Assam: అలవైకుంఠపురం సీన్ రిపీట్ అయింది, అచ్చం అలాంటి కథే ఇది
అసోంలో ఓ మహిళ మూడేళ్ల తరవాత తన శిశువుకి దగ్గరైంది. ఆసుపత్రిలో జరిగిన చిన్న తప్పిదం వల్ల తన బిడ్డకు మూడేళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది.
నర్స్ కన్‌ఫ్యూజన్..బిడ్డ మారిపోయింది
ఒకరికొకరికి సంబంధం లేని ఇద్దరు మహిళలు పురిటి నొప్పులు పడుతూ ఒకే ఆసుపత్రికి వచ్చారు. నొప్పులు తీవ్రమవటం వల్ల వెంటనే డాక్టర్లు డెలివరీ చేశారు. వాళ్లలో ఓ మహిళకు పండంటి బిడ్డ పుట్టింది. మరో శిశువు పురిట్లోనే కన్నుమూసింది. ఇద్దరి మహిళల పేర్లు ఒకటే కావటం వల్ల నర్స్ కన్‌ఫ్యూజన్‌లో బతికి ఉన్న ఆ బిడ్డను మరో తల్లికి అందించింది. ఏంటి కాస్త అటు ఇటుగా మార్చి అలవైకుంఠపురం కథ చెబుతున్నారు
అనుకుంటున్నారా..? ఇదేం కథ కాదు. నిజంగా జరిగిందే. అసోంలోని బర్పెట జిల్లాలో జరిగిందీ ఈ విచిత్రం.
గుట్టు తేల్చిన డీఎన్‌ఏ
అసలు కథేంటంటే..మూడేళ్ల క్రితం అసోంలోని బర్పెట జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు మహిళలు ప్రసవించారు. ఇద్దరి పేర్లూ నజ్మా ఖానం అనే ఉండటం వల్ల నర్స్ ఒకరి బిడ్డను మరొకరికి అందించింది. మరో శిశువు మృతి చెందటం వల్ల ఆ తల్లి ఎంతో బాధ పడింది. అయితే కుటుంబ సభ్యులకు మాత్రం అనుమానం వచ్చింది. నజ్మా ఖానం పండంటి బిడ్డను ప్రసవించిందని, శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉందని, చనిపోయే అవకాశమే లేదని భావించారు. వెంటనే అడ్వకేట్‌ని కలిసి తమ అనుమానాలన్నీ ఆయనతో పంచుకున్నారు. ఇంకేముంది వ్యవహారం కాస్త కోర్టు మెట్లు ఎక్కింది. అడ్వకేట్ అబ్దుల్ మన్నన్ ఆ ఆసుపత్రిలో అదే తేదిన ప్రసవించిన మహిళల పేర్లన్నీ పరిశీలించారు. ఆ సమయంలోనే నజ్మా ఖానం పేరుతో మరో మహిళ ఉన్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పేరు ఒకే విధంగా ఉండటం వల్ల నర్స్ పొరపాటు పడి ఇలా చేసి ఉండొచ్చని అనుమానించారు అబ్దుల్ మన్నన్. అప్పటికే నజ్మా ఖానం కుటుంబ సభ్యులు పోలీసులకుఫిర్యాదు చేశారు. సరైన రీతిలో విచారణ జరపాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డీఎన్‌ఏ టెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని భావించారు. అప్పుడే డీఎన్‌ఏ పరీక్షించగా...ఫిర్యాదు చేసిన నజ్మాఖానం బిడ్డేనని తేలింది. ఈ రిపోర్ట్ ఆధారంగా బిడ్డను నజ్మాఖానంకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇదంతా జరగటానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఇలా మూడేళ్ల తరవాత ఆ బిడ్డ తల్లి ఒడికి చేరుకుంది. ఇన్నాళ్లు బిడ్డకు దూరమయ్యానన్న బాధ నుంచి బయటపడి
మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది ఆ మహిళ. భలే విచిత్రంగా ఉంది కదూ ఈ కథ. సినిమాల్లోనే కాదు, ఇలా నిజ జీవితాల్లోనూ ఇలాంటివి జరుగుతాయనటానికి ఈ సంఘటనే ఉదాహరణ.