Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
Sankranti Meal: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు గోదావరి జిల్లాల్లో అత్తింటి వారు మర్యాదలు అదరగొట్టారు. వందల రకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించారు.

Sankranti Huge Meal For New Son In Laws In Godavari Districts: సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది కోనసీమ, గోదావరి జిల్లాలు. ఓ వైపు కోడిపందేలు, మరోవైపు ఎడ్ల పోటీలు, ఇప్పుడు కొత్తగా పడవ పోటీలు కూడా చేరాయండోయ్. ఇక మర్యాదల విషయానికొస్తే సాధారణంగానే గోదారి జిల్లాలు ఇలాంటి మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ కొత్త అల్లుళ్లంటే మామూలుగా ఉండదు. తమ ఇంటి ఆడబిడ్డను చేసుకున్న అల్లుడికి ఆప్యాయత అనురాగాలతో పాటు వందల రకాల పిండివంటలతోనూ విందు భోజనం వడ్డిస్తారు. 'అల్లుడు గారూ కాస్త ఇవి తినిపెడుదురూ..' అంటూ తమదైన మర్యాదలతో వారి ప్రత్యేకతను చాటుకుంటారు.
470 రకాల వంటలు..
కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు చెందిన ఓ కొత్త అల్లుడికి అత్తింటి వారు మామూలుగా మర్యాదలు చేయలేదు. ఏకంగా 470 రకాల వంటలను అరిటాకుపై వడ్డించారు. వివరాల్లోకి వెళ్తే.. యానాం వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు, విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో గతేడాది వివాహం జరిపించారు. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడిని తొలి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. దాదాపు 470 రకాల వంటలతో వాహ్ అనిపించారు. శాకాహారం, పిండివంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు.. ఇలా వందల కొద్దీ వంటలు అరిటాకులపై చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరినీ విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందును చూసిన కొత్త అల్లుడు సాకేత్ హర్షం వ్యక్తం చేశారు. అత్తారింట్లో అపురూప విందును ఊహించలేదని.. శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే చూశానని తెలిపారు.
ఆంధ్రా అల్లుడు.. 130 రకాల తెలంగాణ వంటలు
అటు, సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి అత్తింటి వారి మర్యాదలు అబ్బురపరిచాయి. పెళ్లైన తర్వాత తొలిసారిగా వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణ వంటకాలు రుచి చూపించారు. సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్‌లో నివాసం ఉంటున్న క్రాంతి - కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెకు కాకినాడకు చెందిన మల్లికార్జున్‌తో 4 నెలల క్రితం వివాహం జరిపించారు. ఈ క్రమంలో సంక్రాంతికి తొలిసారి ఇంటికి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా అత్తమామలు సర్ ప్రైజ్ ఇచ్చారు. పిండి వంటలతో పాటు శాకాహారం, మాంసాహారం, పులిహోర, బగారా వంటి 130 రకాల వంటలు వడ్డించారు.
మరోవైపు, సంక్రాంతి పండుగకు వచ్చిన ఓ కొత్త అల్లుడికి 108 రకాల వంటలతో అత్తమామలు విందు భోజనం వడ్డించారు. సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లోని తమ ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఓ వైపు కూతురు, అల్లుడు, మరోవైపు కొడుకు, కోడలిని కూర్చోబెట్టుకుని వంటకాలను వడ్డించారు. వీరి మర్యాదలను చూసిన కొత్త అల్లుడు ఆనందం వ్యక్తం చేశాడు.






















