Arvind Kejriwal: మందులు కూడా కొనాల్సిన పని లేదు, మేమే అన్నీ ఉచితంగా ఇస్తాం - గుజరాత్‌లో కేజ్రీవాల్ హామీలు
Arvind Kejriwal: గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
Arvind Kejriwal:
గుజరాత్ పర్యటనలో కేజ్రీవాల్..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. భాజపా పరిపాలనలో గుజరాత్ అవినీతిమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర నేతలందరూ అవినీతికి పాల్పడుతున్నారని మండి పడ్డారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుని స్విస్‌బ్యాంక్‌లో దాచుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ అధికారంలోకి వస్తే ఆ డబ్బునంతా వెనక్కి రప్పిస్తుందని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ శరవేగంగా ప్రచారం చేపడుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ తరహాలోనే గుజరాత్ వ్యాప్తంగా 20 వేల మొహల్లా క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇలా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. అంతే కాదు. ఆప్‌నకు రాష్ట్రంలో భారీ మెజార్టీ వస్తుందని జోస్యం చెబుతున్నారు. భాజపా చేయించిన ఓ సీక్రెట్ సర్వేలో గుజరాత్‌లో ఆప్ తప్పకుండా గెలిచి తీరుతుందని తేలిందని వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి పర్యటిస్తున్న కేజ్రీవాల్...జునాగఢ్‌లోని కచ్ జిల్లాలో గాంధీధామ్ వద్ద రెండు భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు. నర్మదా నీళ్లు కచ్ జిల్లాలోని ప్రతి మూలకు సరఫరా అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఉచిత, అపరిమిత వైద్యం అందిస్తామని, మందులూ ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. వైద్యపరీక్షలు కూడా ఉచితంగా చేయటమే కాకుండా...ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా సర్జరీలూ చేయిస్తామని హామీ ఇచ్చారు. "గుజరాత్ వ్యాప్తంగా 20 వేల మొహల్లా క్లినిక్‌లు నిర్మిస్తాం. పేదవాళ్లైనా, ధనికులైనా ఉచితంగా వైద్యం పొందచ్చు. టెస్ట్‌లు, ఆపరేషన్లు, ట్రీట్‌మెంట్ అంతా ఫ్రీయే. రూ.20 లక్షల వరకూ ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది" అని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ భారీగా ఫీజులు వసూలు చేయటాన్నీ తప్పుపట్టారు. ఆప్ అధికారంలోకి వస్తే ఆ డబ్బునంతా వెనక్కి రప్పించి ప్రజలకు ఇచ్చేస్తామని స్పష్టం చేశారు.
ఇవే హామీలు
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
- 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
- నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామన్నారు.
గుజరాత్‌లో గెలుపే లక్ష్యంగా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్‌ఆద్మీకి ఫుల్ జోష్ వచ్చింది. దీంతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్‌లో జెండా ఎగరేయాలని కేజ్రీవాల్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఎప్పుడో కసరత్తు మొదలు పెట్టారు కేజ్రీవాల్. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ
ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇటీవల విడుదల చేసింది ఆమ్‌ఆద్మీ. భీమాభాయ్ చౌదరి,
జగ్మల్ వాలా, అర్జున రథ్వా, సాగర్ రబరి, వశ్రామ్, రామ్ ధనుక్, శివపాల్ బరసియా, సునీల్ వాఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాష్ తివారీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో ఎక్కువ మంది పాటిదార్ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. గుజరాత్‌లో 111 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.