Breaking News Live: ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవను తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దమ్మపేట, చింతలపూడి మధ్య పోలీసులు వనమా రాఘవేంద్రరావు(59)ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు గిరీష్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విపక్షాల నుంచి విమర్శలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ శుక్రవారమే రాఘవను సస్పెండ్ చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే (కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవ బెదిరింపుల కారణంగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం జనవరి 3న ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తగా ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ తలదూర్చాడు. హైదరాబాద్‌కు భార్యను తీసుకొచ్చి అప్పగిస్తే ఆస్తి నీకు దక్కేలా చేస్తానని వనమా రాఘవ తనను బెదిరించాడని.. ఈ అవమానాలు తట్టుకోలేక కుటుంబంతో పాటు చనిపోయాతున్నానని రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, ఆపై తాను కూడా కాల్చుకుని బలవన్మరణం చెందాడు. రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో దుమారం రేపుతోంది.
హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.69 కాగా.. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.35గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 46 పైసలు పెరిగింది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, 43 పైసలు పెరగడంతోడీజిల్ ధర రూ.94.78 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.29 అయింది. 17 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.36కు చేరుకుంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.21 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.30 అయింది. డీజిల్ ధర 0.19 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.41 అయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పతనమయ్యాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్లపై రూ.350 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 కి క్షీణించింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,500కి పడిపోయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.350 మేర పతనమైంది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,600కు పడిపోయింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 కు క్షీణించింది. ఏపీ, తెలంగాణలో వెండి ధరలు ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మహేష్ బాబు ఇంట్లో విషాదం... ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా రమేష్ బాబు లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
రణస్థలం సరాక ఫార్మా కంపెనీ కెమికల్స్ లీక్.. ఒకరి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పరిధిలోని సరాక ఫార్మా కంపెనీలో పెను ప్రమాదం జరిగింది. కంపెనీలో బ్లాక్ బి లో రేడియేటర్ లీక్ అవ్వడంతో, కెమికల్స్ లీక్ అయ్యి బ్లాక్ ఇంచార్జ్ బోగీ ప్రసాద్ రావు (45) అక్కడకక్కడే మృతి చెందారు. బ్లాక్ లో ఉన్న మిగతా ఐదుగురు పరిస్థితి విషమించడంతో, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయనగరం తిరుమల హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న జె. ఆర్. పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు
దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కొని సీఎం ఐన వ్యక్తి శివరాజ్ చౌహాన్.. మంత్రి హరీశ్ రావు
శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాక్కులు మాట్లాడారంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు శివరాజ్ తీరు ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు, నాలుగేళ్లు సీఎం అయి ఏం సాధించావని ప్రశ్నించారు. తెలంగాణతో మీ రాష్ట్రం దేనికి పోలిక, ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించిందంటూ శివరాజ్ ను ఈ సందర్భంగా
వనమా రాఘవకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించిన మేజిస్ట్రేట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవను కొత్తగూడెం జిల్లా జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట పాల్వంచ పోలీసులు హాజరు పరిచారు. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అనంతరం ఖమ్మం సబ్ జైలుకు తరలించారు.
సత్రంలో తల్లీ కొడుకు మృతి... కృష్ణా నదిలో తండ్రీకొడుకు గల్లంతు... విజయవాడలో కలకలం...
విజయవాడలో ఓ ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. నలుగురు కూడా వేర్వేరు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు గల్లంతయ్యారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకుందీ కుటుంబం.
వీళ్లంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై విజయవాడ పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణానదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అసలు వీళ్లు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనే కోణంలో పోలీసు విచారణ సాగుతోంది.