పార్టీ నేతలకు విన్నింగ్ ఫార్ములా ఉపదేశించిన అమిత్ షా, కర్ణాటకపై స్పెషల్ ఫోకస్
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు విన్నింగ్ ఫార్ములా ఉపదేశించారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వెనకబడిన ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విన్నింగ్ ఫార్ములాని పార్టీ నేతలకు ఉపదేశించారు హోంమంత్రి అమిత్ షా. జేడీఎస్‌తో కలిసి మొత్తం 28 సీట్లలోనూ పోటీ చేస్తున్న బీజేపీ...అన్ని చోట్లా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చరిష్మాని ఓట్ల రూపంలో రాబట్టుకోవాలని సూచించారు అమిత్ షా. ఈ మేరకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర వెల్లడించారు. అమిత్ షా భేటీ తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర. అయితే...అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంకా హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో సమావేశాల తరవాత JDS,BJP మధ్య సీట్ల షేరింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. మైసూర్ క్లస్టర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది బీజేపీ. మైసూరు, మాండ్య, హసన్, చామరాజ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.
"అమిత్ షా మైసూరు పర్యటన విజయవంతంగా ముగిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 నియోజకవర్గాల్లోనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాకు పలు కీలకమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీని ఓట్ల రూపంలో రాబట్టుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ గతంలో కన్నా కనీసం 10% ఓట్లు ఎక్కువగా సాధించేలా చూడాలని ఆదేశించారు"
- విజయేంద్ర, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు
నేతల ధీమా..
అమిత్ షా చేసిన సూచనలు పాటిస్తే కచ్చితంగా అన్ని సీట్లూ గెలుచుకుంటామని తేల్చి చెబుతున్నారు బీజేపీ నేతలు. అంతా కలిసి కట్టుగా పని చేసి పార్టీ విజయానికి సహకరిస్తామని అమిత్ షాకి వాళ్లంతా భరోసా ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 నియోజకవర్గాల్లో మొత్తం 26 చోట్ల విజయం సాధించింది బీజేపీ. అయితే...సీట్ షేరింగ్ విషయంలో JDSతో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు పడుతోంది.
మోదీ కీలక వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. జబువా జిల్లాలో రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు పర్యటించడం కీలకంగా మారింది. అంతే కాదు. గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు మోదీ. ఈ క్రమంలోనే బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజీపీయే గెలుస్తుందని తేల్చి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (Phir Ek Baar Modi Sarkar) అంటూ నినదించారు. బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని, బీజేపీ కూటమి మొత్తంగా 400 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ఏ అభివృద్ధి కనిపించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని మండి పడ్డారు. ఇప్పుడా రోజులు పోయాయని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, ఇకపై అన్ని సమస్యలు తీరిపోతాయని భరోసా ఇచ్చారు.
Also Read: ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్‌ని చదవని గవర్నర్, తమిళనాడు అసెంబ్లీలో అలజడి