Bharat Ratna 2024: మోదీ సర్కార్ అరుదైన రికార్డు, 15 రోజుల వ్యవధిలో ఐదుగురికి భారతరత్న
Bharat Ratna Awards: మోదీ సర్కార్ కేవలం 15 రోజుల వ్యవధిలో 5గురికి భారత రత్న అవార్డులు ప్రకటించి రికార్డు సృష్టించింది.
Bharat Ratna Awards 2024: మోదీ సర్కార్ అరుదైన రికార్డ్ సాధించింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురికి భారతరత్న అవార్డు ప్రకటించింది. వీళ్లలో ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులు, ఒకరు డిప్యుటీ ప్రధాన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. వీళ్లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సాధారణంగా ఏడాదిలో కేవలం ముగ్గురికే భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. కానీ...మోదీ సర్కార్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఇప్పటికే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ముగ్గురిని ఈ పురస్కారంతో సత్కరించింది. మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావుతో పాటు చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్‌కి ఈ అవార్డు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా ఈ ప్రకటన చేశారు. X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. వాళ్ల సేవల్ని స్మరించుకున్నారు.
కర్పూరి ఠాకూర్
మోదీ సర్కార్ ఈ ఏడాదికి తొలి భారతరత్న అవార్డుని బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కి ప్రకటించింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో 1924లో జన్మించిన కర్పూరి ఠాకూర్...రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 1970లో డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ సీఎంగా ఉన్నారు. ఆ తరవాత 1977 నుంచి 1979 వరకూ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం బిహార్‌లోని చాలా మంది రాజకీయ నేతలకు ఆయనే మెంటార్. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కర్పూరి ఠాకూర్ శిష్యులే.
ఎల్‌కే అద్వానీ
రెండో భారతరత్న అవార్డుని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి ప్రకటించింది మోదీ సర్కార్. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్‌కే అద్వానీ. ఆ తరవాత పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్‌లోని రెండు సభలకూ ప్రాతినిధ్యం వహించారు. బీజేపీని ముందుండి నడిపించిన రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించడంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. పలువురు కేంద్రమంత్రులూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
పీవీ నరసింహా రావు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి (PV Narasimha Rao) భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు, ఒకేఒక తెలుగువారు పీవీ నరసింహా రావు. 1991 నుండి 1995 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన అపర చాణక్యులు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి.
చౌదరి చరణ్ సింగ్
తన జీవితం అంతా రైతుల సంక్షేమం కోసమే ధారపోసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌నీ భారతరత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1902లో ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో డిసెంబర్ 23న జన్మించారు చరణ్ సింగ్. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వాళ్ల కష్టాలేంటో తెలుసు. బాల్యం నుంచి వాటిని కళ్లారా చూశారు. అందుకే...అంతగా రైతుల సంక్షేమం కోసం అనునిత్యం తపించారు.
ఎమ్ఎస్ స్వామినాథన్
భారత హరితవిప్లవ పితామహుడు MS స్వామినాథన్ సేవల్ని గుర్తించి భారతరత్న అవార్డుని ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు స్వామినాథన్. దేశానికి ఆహార భద్రత కల్పించారు. ఎన్నో కొత్త రకాల విత్తనాలను పరిచయం చేశారు. రైతుల మేలు కోసం నిరంతరం కృషి చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కన్నుమూశారు.