26/11 Mumbai Attacks : భారత్ కు అనుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు - త్వరలోకి ఇండియాకి ముంబై దాడుల నిందితుడు
26/11 Mumbai Attacks : ఆగస్టు 2024లో, 26/11 ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారతదేశం-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం భారతదేశానికి పంపడానికి యూఎస్ కోర్టు ఆమోదించింది.
26/11 Mumbai Attacks : 26/11 ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను ఇండియాకు రప్పించే నిర్ణయంపై అమెరికా కోర్టు భారత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2008లో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆగస్టు 2024లో, భారతదేశం - అమెరికా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రాణాను అప్పగించవచ్చని కోర్టు తీర్పు వెలువరించింది. అతని అప్పగింతకు సంబంధించిన మేజిస్ట్రేట్ జడ్జి సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాణా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దౌత్య మార్గాల ద్వారా అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఖైదీగా ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారతదేశానికి తీసుకువచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.
2008లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన 26/11 ముంబై దాడుల్లో రాణా పాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోంది. ఈ దాడుల్లో రాణా ప్రమేయం ఉందని, తమకు అప్పగించాలని భారత్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. దిగువ కోర్టులు, అనేక ఫెడరల్ కోర్టులలో జరిగిన న్యాయ పోరాటంలో ఓడిపోయిన రాణా.. చివరిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని US తొమ్మిదో సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లోని న్యాయమూర్తుల ప్యానెల్ వద్దకు చేరుకున్నాడు. 26/11 దాడుల్లో రాణా ప్రమేయానికి సంబంధించిన బలమైన సాక్ష్యాలను అమెరికా కోర్టులో భారత్ సమర్పించింది. అంతిమంగా, భారతదేశంలో రాణాపై అభియోగాలు భిన్నంగా ఉన్నాయని కోర్టు అంగీకరించింది. ఇకపోతే 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఏడాది లోపే, చికాగోలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రాణాను అరెస్టు చేసింది. 2009లో చికాగోలో అతన్ని అరెస్ట్ చేశారు.
Also Read : LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నందుకు రాణాను భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని మేజిస్ట్రేట్ జడ్జి ధృవీకరించడాన్ని సవాలు చేస్తూ తహవ్వూర్ హుస్సేన్ రాణా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను జిల్లా కోర్టు తిరస్కరించడాన్ని ప్యానెల్ ధృవీకరించింది. మేజిస్ట్రేట్ జడ్జి రాణా అభియోగాలు మోపడానికి గల కారణాలను నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలను భారతదేశం అందించిందని కూడా ప్యానెల్ పేర్కొంది. ఇదిలా ఉండగా 26/11 దాడుల సూత్రధారి డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి మద్దతిచ్చినట్లు రాణాపై ఆరోపణలు ఉన్నాయని ముంబై పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
రాణాపై ఆరోపణలు
26/11 దాడుల సూత్రధారి, పాకిస్థాన్-అమెరికన్ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి సహాయం చేసినట్లు రాణాపై ఆరోపణలు ఉన్నాయి. అతను అప్పట్లో చికాగోలో ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించేవాడు. దాడికి ముందు వారు ముంబైలోని లొకేషన్‌లు, ల్యాండింగ్ జోన్‌లను పరిశీలించారు. ఈ ఘోరమైన దాడికి పాల్పడిన పాకిస్థానీ ఉగ్రవాదులు రాణా రూపొందించిన బ్లూప్రింట్‌ను రూపొందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.