True Lover Movie Review - ట్రూ లవర్ రివ్యూ: 'గుడ్ నైట్' హీరో కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?
True Lover review in Telugu: 'గుడ్ నైట్' ఫేమ్ మణికందన్, 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన తమిళ సినిమా 'లవర్'ను తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో మారుతి, ఎస్కేఎన్ విడుదల చేశారు.
ప్రభురామ్ వ్యాస్
మణికందన్, శ్రీ గౌరీ ప్రియా, కన్నా రవి, గీతా కైలాసం, హరీష్ నాగలక్ష్మీ కుమార్ తదితరులు
Tamil movie Lover review starring Manikandan and Sri Gouri Priya in Telugu: 'గుడ్ నైట్' చిత్రాన్ని ఓటీటీలో చూసిన తెలుగు ప్రేక్షకులు ఎక్కువే. అందులో మణికందన్ నటన చాలా మందికి నచ్చింది. ఆయన నటించిన తాజా సినిమా 'లవర్'. ఇందులో 'రైటర్ పద్మభూషణ్', 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 'ట్రూ లవర్' పేరుతో తెలుగులో మారుతి, ఎస్కేఎన్ విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ: అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరీ ప్రియా)ది ఆరేళ్ల ప్రేమ. ఇద్దరూ కాలేజీలో చదివినప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు. దివ్యకు మంచి ఉద్యోగం వచ్చింది. కేఫ్ పెట్టాలని ఖాళీగా ఉన్నాడు అరుణ్. తాగుడు, అనుమానం ఎక్కువ. మరొకరికి దివ్య దగ్గర అవుతుందోనని ఆమె ఎక్కడికి వెళ్లేది, ఏం చేసేదీ చెప్పమని అడుగుతూ ఉంటాడు. ఒక విధంగా ఆమెను కంట్రోల్ చేయాలని చూస్తాడు.
అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య చాలాసార్లు బ్రేకప్ చెబుతుంది. అతడు సారీ చెప్పేసరికి మళ్లీ కలుస్తుంది. ఒక దశలో అరుణ్ నుంచి దూరం కావాలని నిర్ణయించుకుంటుంది. ఆఫీసులోని సహచరులతో కలిసి ట్రిప్ వెళ్లడానికి రెడీ అవుతుంది. అనుకోకుండా దివ్యకు బర్త్ డే విషెస్ చెప్పడానికి వస్తాడు అరుణ్. అతడిని ఇన్వైట్ చేస్తారు. నో అని ముందు చెప్పినా... చివరకు దివ్య, ఆమె స్నేహితులతో అరుణ్ కూడా వెళతాడు. తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: ప్రేమకు నమ్మకం పునాది అయితే... అనుమానం సమాధి. నమ్మకం లేని చోట ప్రేమకు చోటు లేదనే కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు, 'ట్రూ లవర్'కు డిఫరెన్స్ ఏంటంటే? ఈతరం యువతీ యువకుల నేపథ్యం! అది కొత్తగా కనిపిస్తుంది. బాటిల్ కొత్తది అయితే సరిపోదు కదా! లోపల సరుకులో కూడా విషయం ఉండాలి. మరి, అనుమానం - అభద్రత నేపథ్యంలో ప్రభురామ్ వ్యాస్ తీసిన సినిమా ఎలా ఉందంటే?
'ట్రూ లవర్'లో కథ కంటే క్యారెక్టర్లు, మూమెంట్స్, సన్నివేశాలతో యూత్ రిలేట్ అవుతారు. బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పకుండా ఆఫీస్ కొలీగ్స్‌తో అమ్మాయి బయటకు వెళుతుంది. అది తెలిసిన అబ్బాయి లొకేషన్ షేర్ చేయమని అడుగుతాడు. ఈ తరహా సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. కథ, కథనంతో సంబంధం లేకుండా వాటికి విజిల్స్ పడతాయి. 'ట్రూ లవర్' ప్రారంభంలో కొత్తగా, ఆసక్తిగా ముందుకు వెళ్లినా... కొంతసేపటి తర్వాత రిపీటెడ్ సన్నివేశాలతో విసిగిస్తుంది.
ప్రభురామ్ వ్యాస్ రచనలో బలంలో ఉంది. ముఖ్యంగా హీరో, తల్లి క్యారెక్టరైజేషన్లతో పాటు కొన్ని సన్నివేశాలను రాసిన తీరు బావుంది. అందమైన లవర్ ఉన్నప్పుడు, తనకు ఉద్యోగం లేనప్పుడు అబ్బాయి అభద్రతకు లోను కావడాన్ని అద్భుతంగా చూపించారు. భర్తతో సమస్యలు ఉన్నప్పటికీ, కొడుకు బాధ్యతగా లేనప్పటికీ... ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతాడని తల్లి పాత్ర సైతం నచ్చుతుంది. అయితే... అమ్మాయి ప్రేమలో ఎందుకు పడింది? అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. అబ్బాయితో సమస్య ఉన్నప్పటికీ... ఎందుకు రిలేషన్ కంటిన్యూ అవుతుంది? అనేది అర్థం కాదు. రిపీటెడ్ సీన్లు వల్ల బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ అయ్యాయి. ఎమోషనల్ సీన్లలో తమిళ ఫ్లేవర్ అందరినీ ఆకట్టుకోవడం కష్టం.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో సమస్య ఉందని సినిమా ప్రారంభంలో దర్శకుడు స్పష్టంగా చెప్పారు. టాక్సిక్ రిలేషన్ నుంచి అమ్మాయి బయట పడటానికి క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే... క్లైమాక్స్‌లో హీరో యాటిట్యూడ్ కొంత మంది అబ్బాయిలను మెప్పిస్తుంది. 'ట్రూ లవర్'లో మాటలు, పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. సాన్ రోనాల్డ్ మ్యూజిక్ ట్రెండీగా, పెప్పీగా సాగింది. కెమెరా వర్క్ కూడా బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
Also Read: లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?
అరుణ్ పాత్రకు మణికందన్ ప్రాణం పోశాడు. అతని నటన మెప్పిస్తుంది. తాగిన తర్వాత అమ్మాయితో మాట్లాడే సన్నివేశాల్లో కోపాన్ని ప్రదర్శించడం, మత్తు దిగిన తర్వాత సారీ చెప్పడం వంటి మూమెంట్స్ చాలా మందికి కనెక్ట్ కావచ్చు. 'రైటర్ పద్మభూషణ్', 'మ్యాడ్' సినిమాలతో కంపేర్ చూస్తే... ఇందులో శ్రీ గౌరీ ప్రియాకు ఎమోషనల్ సన్నివేశాలు చేసే అవకాశం లభించింది. ఆమె కూడా బాగా చేశారు. మిగతా నటీనటులు ఓకే.
'ట్రూ లవర్'లో యువతీ యువకులు రిలేట్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. సీన్లతో కనెక్ట్ కావచ్చు. కానీ, కథతో కనెక్ట్ కావడం కష్టం. కాంటెంపరరీగా తీశారు కానీ కథను కన్వీన్సింగ్‌గా చెప్పలేదు. హీరో హీరోయిన్లు బాగా చేశారు. మ్యూజిక్ బావుంది. ప్రచార చిత్రాలు, పాటలు చూసి ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. యువతను మెప్పించే, వాళ్లతో విజిల్స్ వేయించే సన్నివేశాలకు 'ట్రూ లవర్'లో లోటు లేదు.
Also Read: ఈగల్ రివ్యూ: మాస్ మహారాజా మారణహోమం... రవితేజ వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?