Eagle Movie Review - ఈగల్ రివ్యూ: మాస్ మహారాజా మారణహోమం... రవితేజ వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?
Eagle Review Telugu: రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'ఈగల్'. ప్రచార చిత్రాలతో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కార్తీక్ ఘట్టమనేని
రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ తదితరులు
Ravi Teja Eagle Review in Telugu: రవితేజకు సపరేట్ స్టైల్ ఉంది. కమర్షియల్ సినిమాల్లో స్టైల్, ఎనర్జీ కనిపిస్తాయి. అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి డిఫరెంట్ జానర్స్, ఎక్స్‌పరిమెంట్స్ ట్రై చేయడం ఆయనకు అలవాటు. 'ఈగల్' ప్రచార చిత్రాల్లో 'ఇది కమర్షియల్ సినిమా. కానీ, రెగ్యులర్ కమర్షియాలిటీ ఉండదు. డిఫరెంట్ ఫిల్మ్' అని రవితేజ చెప్పారు. మరి, సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా 'సూర్య వర్సెస్ సూర్య' వంటి డిఫరెంట్ ఫిల్మ్ తీసిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈసారి ఎటువంటి సినిమా తీశారు? అనేది రివ్యూలో చూడండి.
కథ: నళినీ రావు (అనుపమ పరమేశ్వరన్) జర్నలిస్ట్. తలకోన అడవుల్లో కొండలపై పండించే పత్తి, దాంతో తయారైన అరుదైన కాటన్ క్లాత్, ఆ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి సహదేవ వర్మ (రవితేజ) ఆచూకీ ఏడాదిగా ఎవరికీ తెలియదని చిన్న ఆర్టికల్ రాస్తుంది. దాంతో ఏకంగా పేపర్ ఆఫీస్ మీద సీబీఐ దాడులు చేస్తుంది. చివరకు, నళినీ రావు ఉద్యోగం పోతుంది. ఎవరీ సహదేవ వర్మ అని ఆమెలో క్యూరియాసిటీ మొదలవుతుంది.
తలకోన అడవుల్లో కొండ మీద ఉన్న సహదేవ వర్మను మట్టుబెట్టాలని కేంద్ర ప్రభుత్వ బలగాలు, నక్సల్స్, టెర్రరిస్టులు ఎందుకు వచ్చారు? సహదేవ వర్మ గతం ఏమిటి? గతంలో, వర్తమానంలో అతని అనుచరుడు జై (నవదీప్) పాత్ర ఏమిటి? సహదేవ వర్మ, రచన (కావ్య థాపర్) మధ్య ప్రేమ కథ ఏమిటి? చివరకు, సహదేవ వర్మను ఎవరైనా పట్టుకోగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: ఇండియన్ సినిమాల్లో కొత్త రకం కమర్షియల్ సినిమాల రాక మొదలైంది. కథ, కథనంపై నమ్మకం కంటే క్యారెక్టర్ డ్రివెన్, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లతో సినిమాలు వీస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల చాటున కథ మరీ చిన్నదైపోతుంది. 'కెజిఎఫ్', 'విక్రమ్', 'జైలర్' సినిమాలను అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 'ఈగల్' ఆ తరహా చిత్రమే. ముందు చెప్పిన మూడు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించడానికి కేవలం హీరోయిజం, యాక్షన్ సీన్లు మాత్రమే కారణం కాదు. ఆయా కథల్లో అంతర్లీనంగా ఎమోషన్ క్యారీ అయ్యింది. 'ఈగల్'లో అది కరువైంది.
ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి... 'ఈగల్'లో యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, రవితేజ నటన అద్భుతం. కానీ, చిన్న కథ ముందు అవన్నీ తేలిపోయాయి. 'ఈగల్' మొదలైన కాసేపటి నుంచి హీరోకి బీభత్సమైన ఎలివేషన్లు ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లు మణిబాబు కరణం పదునైన సంభాషణలు రాశారు. అయితే... ఆ ఎలివేషన్లు ఎంత సేపటికీ ఆగవు. హీరోకి ఎందుకు అంత బిల్డప్? అసలు అతను ఎవరు? అని ప్రేక్షకుడి మదిలో మొదలైన ప్రశ్నకు సమాధానం చాలాసేపటి వరకు లభించదు. మణిబాబు కరణం సంభాషణలు చాలాసార్లు సన్నివేశాన్ని డామినేట్ చేశాయి. అవసరమైన దానికంటే ఎక్కువ రాశారు. ఒక దశలో ప్రాసలు ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టాయి.
ఫస్టాఫ్ మొత్తం ఎలివేషన్లతో ముగించారు. అందువల్ల, యాక్షన్ సీన్లు మెప్పించినా ఏదో తెలియని అసంతృప్తి, వెలితి ప్రేక్షకుడిని వెండతాయి. ఇంటర్వెల్ తర్వాత కథలోకి వెళ్లడంతో క్లారిటీ వస్తుంది. పబ్జి నేపథ్యంలో ఫైట్ కూడా బావుంది. దాంతో ఫస్టాఫ్ కంటే బెటర్ అనిపిస్తుంది. విధ్వంసం, వినాశనం, విస్ఫోటనం... ఆ మారణ హోమం చేయడం మూలం ప్రేమ కథలో ఉంది. అందులో బలం తగ్గింది. హీరో ఆలోచన వెనుక మానవాళికి చేసే మేలు ఉంది. ఆ సందేశం చిన్న సన్నివేశంలో చెప్పడం వల్ల రిజిస్టర్ కాలేదు. డేవ్ జాండ్ సంగీతం కాస్త కొత్తగా ఉంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. ప్రొడక్షన్ హౌస్ బ్రాండ్ వేల్యూ కనిపించింది. మాస్ జనాలకు నచ్చితే టీజీ విశ్వ ప్రసాద్ పెట్టిన ఖర్చుకు తగ్గ ప్రతిఫలం రావడం పెద్ద కష్టం ఏమీ కాదు.
రవితేజకు అలవాటైన హుషారు, ఎనర్జీ సహదేవ వర్మ పాత్రలో లేదు. కానీ, ఈ సినిమాలో మాస్ ఉంది. ఆయన నటనలో హీరోయిజం ఉంది. తనలో నటుడిని మరోసారి మాస్ మహారాజా చూపించారు. కావ్య థాపర్ కనిపించేది తక్కువ. తన పాత్ర పరిధి మేరకు చక్కగా చేశారు. రవితేజ, కావ్య థాపర్ జోడీ బావుంది.
Also Read: 'ఈగల్' ఆడియన్స్ రివ్యూ: ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే...
జర్నలిస్ట్ పాత్రలో అనుపమ పర్వాలేదు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, వినయ్ రాయ్, నితిన్ మెహతా తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. ఆర్టిస్టులందరిలో అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి ప్రేక్షకులకు ఎక్కువ గుర్తు ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ మధ్యలో రిలీఫ్ ఇస్తుంది.
లార్జర్ దేన్ లైఫ్ కథతో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఈగల్'. యాక్షన్ సీన్లు, డైలాగులు ఎంజాయ్ చేసే ప్రేక్షకులు హాయిగా థియేటర్లకు వెళ్లవచ్చు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే మంచిది. రవితేజ అభిమానులను మెప్పించే అంశాలు అయితే ఉన్నాయి. అలాగని, ఎక్స్‌ట్రాడినరీ అని చెప్పలేం. చిన్న వెలితి ఉంటుంది. యాక్షన్ మూవీ లవర్స్ & డైహార్డ్ రవితేజ ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. సీక్వెల్ కోసం మంచి సెటప్ రెడీ చేశారు. ఎండింగ్ చూస్తే... భారీ యాక్షన్ ఫిల్మ్ తీయడానికి రెడీ అయినట్లు అర్థం అవుతోంది.
రేటింగ్: 2.75/5
Also Read: రవితేజ 'ఈగల్' సినిమాకు సీక్వెల్ - టైటిల్ కూడా ఫిక్స్!