Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
Tom Cruise - Top Gun: Maverick Review: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన 'టాప్ గన్: మావెరిక్' సినిమా ఎలా ఉంది? ఈ సీక్వెల్ ఆకట్టుకుందా? లేదా?
జోసెఫ్ కోసిన్స్కీ
టామ్ క్రూజ్, మైల్స్ అలెగ్జాండర్ టెల్లర్, జెన్నిఫర్ కాన్‌లీ
సినిమా రివ్యూ: టాప్ గన్ మావెరిక్
రేటింగ్: 3.25/5
నటీనటులు: టామ్ క్రూజ్, మైల్స్ అలెగ్జాండర్ టెల్లర్, జెన్నిఫర్ కాన్‌లీ, జోనాథన్ డేనియల్ హామ్, గ్లేన్ థామస్ పావెల్ జూనియర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: క్లాడియో మిరిండా
నిర్మాతలు: జెర్రీ బ్రూక్ హామా, టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్ క్యూరీ, డేవిడ్ ఎల్లిసన్
దర్శకత్వం: జోసెఫ్ కోసిన్స్కీ
విడుదల తేదీ: మే 26, 2022
'టాప్ గన్: మావెరిక్' విడుదల తేదీ కంటే ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా విడుదల మే 27న. అయితే, ఈ రోజు (మే 26) నుంచి షోలు పడ్డాయి. ప్రీమియర్లు ముందే వేశారనుకోండి! ఇది 36 ఏళ్ళ క్రితం విడుదలైన 'టాప్ గన్'కి సీక్వెల్. ఎందుకు ఇంత ఈ సీక్వెల్ మీద అంత క్రేజ్? అంటే... 'టాప్ గన్' సాధించిన విజయం అటువంటిది. అండ్ అఫ్‌కోర్స్... టామ్ క్రూజ్! 'టాప్ గన్' చూసినప్పుడు ప్రేక్షకులకు ఎటువంటి అనుభూతి కలిగిందో? ఈ సీక్వెల్ అలాంటి అనుభూతి ఇచ్చిందా? 'టాప్ గన్: మావెరిక్'లో వావ్ ఫాక్టర్, విజువల్స్, ఉత్కంఠకు గురి చేసే కథ, కథనాలు ఉన్నాయా? లేదంటే జస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంటుందా?
కథ: పీట్ 'మావెరిక్' మిచెల్ (టామ్ క్రూజ్) అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్. అతనిది 36 ఏళ్ళ అనుభవం. నిజం చెప్పాలంటే... ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. కానీ, కావాలని పైలట్‌గా ఉంటాడు. ఒక యుద్ధ విమానాన్ని టెస్ట్ చేసే క్రమంలో పరిమితికి మించిన వేగంతో వెళతాడు. ఆ తర్వాత అతడిని టెస్ట్ పైలట్ విధుల నుంచి తప్పించి... 'టాప్ గన్' అకాడమీలో బెస్ట్ పైలట్స్‌కు శిక్షణ ఇవ్వమని పంపిస్తారు. ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య గల లోయలో శత్రుదేశం యురేనియం ప్లాంట్ నెలకొల్పుతారు. దానిని నాశనం చేసే మిషన్ కోసం పైలట్స్‌కు పీట్ మిచెల్ శిక్షణ ఇవ్వాలి. ఆ పైలట్స్‌లో పీట్ ఫ్రెండ్ గూస్ కుమారుడు రూస్టర్ ఒకరు. పీట్‌కు, అతనికి మధ్య ఏం జరిగింది? శిక్షణ ఇచ్చే క్రమంలో పీట్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? శత్రుదేశంలో యురేనియం ప్లాంట్‌ను ధ్వంసం చేశారా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
'మన ఇద్దరిలో బెస్ట్ పైలట్ ఎవరు? నువ్వా... నేనా!?' - పీట్ మావెరిక్ మిచెల్ (టామ్ క్రూజ్)ను ఐస్ మ్యాన్ (వాల్ కిల్‌మ) ప్రశ్నిస్తాడు. 'don't ruin this moment' ('పాత విషయం ఎందుకు? ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం' అని అర్థం వచ్చేట్టు) పీట్ మావెరిక్ చెబుతాడు. 'టాప్ గన్', 'టాప్ గన్: మావెరిక్'... రెండిటిలో ఏది బెస్ట్? అనే కంపేరిజన్ రావడం సహజం. ఆ కంపేరిజన్స్ పక్కన పెట్టి... థియేటర్లలో 'టాప్ గన్: మావెరిక్'ను ఎంజాయ్ చేయడం బెస్ట్!
'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? ఇక, సినిమా విషయానికి వస్తే... 'టాప్ గన్'ను గుర్తు చేస్తూ ఈ సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని పీట్ మావెరిక్ పాత్రను పరిచయం చేశారు. అప్పటికీ, ఇప్పటికీ... 36 ఏళ్ళ తర్వాత కూడా అతడిలో ఎటువంటి మార్పు లేదని చూపించారు. న్యూ ఏజ్ ఫైటర్ పైలట్స్, లక్ష్యాల గురించి వివరించారు. ఈ సీక్వెల్‌లో ప్రధాన తారల జీవితాలపై ఎక్కువ దృష్టి సారించారు. సెకండాఫ్‌లో యాక్షన్ మీద దృష్టి పెట్టారు. క్లైమాక్స్, చివరి అరగంట ఉత్కంఠభరితంగా నడిపారు.
కథ, దర్శకత్వం ఎలా ఉన్నాయి? 'టాప్ గన్'లో స్పిరిట్ ఏమాత్రం మిస్ అవ్వకుండా, థ్రిల్ ఇచ్చేలా 'టాప్ గన్ మావెరిక్' స్క్రిప్ట్ డిజైన్ చేశారు. అయితే... ఫస్టాఫ్‌లో మావెరిక్, రూస్టర్ మధ్య సన్నివేశాల్లో డ్రామా ఎక్కువ అయ్యింది. దాంతో కొంత నిదానంగా సాగిన ఫీలింగ్ ఉంటుంది. మధ్య మధ్యలో దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ కొంత వినోదం పండించే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు... జెన్నిఫర్ ఇంటి కిటికీ నుంచి టామ్ క్రూజ్ దూకిన తర్వాత జెన్నిఫర్ కుమార్తె పాత్రలో నటించిన అమ్మాయి కింద ఉండి చూడటం... 'ఈసారి మా అమ్మ మనసును బాధ పెట్టకు' అని చెప్పడం భలే నవ్విస్తుంది. అయితే, జెన్నిఫర్ పాత్రకు పెద్ద ప్రాముఖ్యం లేదు. ఎమోషనల్ మూమెంట్స్ సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఫస్టాఫ్ బోర్ కొట్టదు. కానీ, సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కొంత మందికి నచ్చకపోవచ్చు.
సాంకేతిక నిపుణులు ఎలా చేశారు? టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌లో యాక్షన్, వీఎఫ్ఎక్స్ గురించి చెప్పాలి. రెండూ టాప్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ముందు చెప్పినట్టు... క్లైమాక్స్, చివరి అరగంట యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్. సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది. ఏరియల్ కంబాట్ సీక్వెన్సులు, ట్రయినింగ్ ఎపిసోడ్ ఉత్కంఠ కలిగిస్తాయి. నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. టెక్నికల్ టీమ్ బెస్ట్ వర్క్ ఇచ్చింది.
నటీనటులు ఎలా చేశారు? నటీనటులు అందరూ బాగా చేశారు. అయితే, అందరిలో టామ్ క్రూజ్ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ వయసులోనూ హుషారుగా కనిపించారు. బైక్ రైడింగ్, ఫైటర్ జెట్స్ సీన్స్‌లో తనదైన శైలిలో చేశారు. నటనలోనూ టామ్ క్రూజ్ ముద్ర కనిపించింది. వాల్ కిల్‌మ ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపిస్తారు. అయితే, రియల్ లైఫ్‌లో ఆయన సమస్యలను రీల్ లైఫ్‌కు అడాప్ట్ చేయడం బావుంది. జోనాథన్, గ్లెన్, ఎడ్ హ్యారిస్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చేశారు.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
ఫైనల్ పంచ్: యాక్షన్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే అడ్వెంచర్ ఫిల్మ్ 'టాప్ గన్: మావెరిక్'. సినిమాలో హై అండ్ లో మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది. కానీ, సినిమాలో సోల్ ఉంది. టామ్ క్రూజ్ ప్రతి సన్నివేశంలోనూ ఎనర్జీగా కనిపించారు. బెస్ట్ ఇచ్చారు. సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. టామ్ క్రూజ్ అభిమానులు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా. 'టాప్ గన్' చూడని ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది.