Param Sundari Review Telugu - 'పరమ్ సుందరి' రివ్యూ: కాంట్రవర్సీలకు కారణమైన బాలీవుడ్ మూవీ - మలయాళీగా జాన్వీ ఎలా నటించింది? సినిమా ఎలా ఉంది?
Param Sundari Review In Telugu: జాన్వీ కపూర్ నటించిన తాజా సినిమా పరమ్ సుందరి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ప్రచార చిత్రాలతో వివాదాలకు కారణమైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
తుషార్ జలోటా
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కపూర్, మన్ జోత్ సింగ్ తదితరులు
Sidharth Malhotra and Janhvi Kapoor's Param Sundari Review In Telugu: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'పరమ్ సుందరి'. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఈ సినిమా ట్రైలర్ వివాదాలకు కారణమైంది. చర్చిలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఏమిటని కొందరు విమర్శిస్తే… జాన్వీ కపూర్ మలయాళీ యాస మీద మలయాళీలు మండిపడ్డారు. అందువల్ల దక్షిణాది ప్రేక్షకుల దృష్టి పడింది. మరి, సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Param Sundari Story): పరమ్ (సిద్ధార్థ్ మల్హోత్రా)ది ఢిల్లీ. తండ్రి (సంజయ్ కపూర్) దగ్గర డబ్బులు తీసుకుని స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. అన్నీ ఫెయిల్ అవుతాయి. డేటింగ్ యాప్ 'ఫైండ్ మై సోల్ మేట్' సక్సెస్ ఇస్తుందని నమ్ముతాడు. అయితే డబ్బులు ఇవ్వడానికి తండ్రి ఒక కండిషన్ పెడతాడు. దాంతో కేరళ వెళతాడు పరమ్.
కేరళలోని సుందరి (జాన్వీ కపూర్) ఇంటిలో హోమ్ స్టేకి దిగుతాడు పరమ్. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ప్రపోజ్ చేసే సమయానికి వేణు నాయర్ (సిద్ధార్థ్ శంకర్)తో సుందరి పెళ్లి నిశ్చయం చేస్తారు ఊరి పెద్దలు. ఆ పెళ్లి చేయాలనేది సుందరి తల్లిదండ్రుల ఆలోచన. అయితే వాళ్ళ మరణంతో ఊరి పెద్దలు బాధ్యత తీసుకుంటారు. అయితే పరమ్ ప్రేమలో పడుతుంది సుందరి. ప్రపోజ్ చేద్దామని అనుకుంటుంది. అప్పుడు తన డేటింగ్ యాప్ గురించి చెబుతాడు పరమ్. అతడు చెప్పిన ఒక విషయం సుందరికి కోపం తెప్పిస్తుంది. మనసు ముక్కలు అవుతుంది.
పరమ్ తండ్రి పెట్టిన కండిషన్ ఏమిటి? పరమ్, సుందరి మధ్య ప్రేమ నిజమా? అబద్ధమా? చివరకు వేణును సుందరి పెళ్లి చేసుకుందా? లేదంటే ఆమె మనసు పరమ్ గెలుచుకున్నాడా? అనేది సినిమా.
విశ్లేషణ (Param Sundari Telugu Review): ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది మారదు. అలాగని ఒకే ప్రేమ కథను మళ్ళీ మళ్ళీ చూపిస్తే ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది. ప్రేమ ఒక్కటే అయినా... ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకు దారి తీసిన పరిస్థితులు, సందర్భాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్లే ప్రేమకథలు ఎక్కువ తెరపైకి వస్తాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాయి. ఆ కొత్తదనం చూపించడంలో 'పరమ్ సుందరి' దర్శక రచయితలు ఘోరంగా ఫెయిల్ అయ్యారు.
'పరమ్ సుందరి'కి తుషార్ జలోటా దర్శకుడు. ఆర్ష్ వోరా, గౌరవ్ మిశ్రాతో కలిసి కథ రాశారు. తుషార్, ఆర్ష్ కలిసి స్క్రీన్ ప్లే రాశారు. కథలో, కథనంలో ఈ ముగ్గురూ కాస్త కూడా కొత్తదనం చూపించలేదు. కథలో కొత్తదనం అంటే కథా నేపథ్యం మారిస్తే సరిపోతుందని భావించినట్టు ఉన్నారు. ఢిల్లీలో పెరిగిన పంజాబీ అబ్బాయ్ కేరళ వచ్చి అక్కడ అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు? అనేది క్లుప్తంగా కథ. ఇందులో 'నువ్వు నాకు నచ్చావ్' ఛాయలు ఎక్కువ కనబడతాయి తెలుగు ప్రేక్షకులకు. ఈ కథలో కొత్తదనం లేదంటే కథనం, సన్నివేశాల్లోనూ కొత్తగా ఏమీ ట్రై చేయలేదు. రొటీన్, ఓల్డ్ లవ్ స్టోరీని కేరళ సీసాలో కుక్కినట్టు ఉంటుంది.
డేటింగ్ యాప్స్, స్టార్టప్స్ జమానాలో మన సోల్ మేట్ ఎవరనేది మనసు డిసైడ్ చేస్తుంది తప్ప యాప్స్, ఏఐ వేసే లెక్కలు కాదని చెప్పడం బావుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ, మంచి సన్నివేశాలు రాసుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? అనేది చిన్న పిల్లలు సైతం చెప్పేలా ముందుకు సాగిందీ సినిమా. అయితే పాటలు చాలా వరకు సినిమాను నిలబెట్టాయి. సచిన్ - జిగర్ సంగీతంలోని ప్రతి పాట బావుంది. పరదేశీయా అంటూ వచ్చే నేపథ్య సంగీతంతో సహా! కేరళ నేపథ్యంలో సాంగ్స్ పిక్చరైజ్ చేయడం వల్ల కలర్ ఫుల్ గా, అందంగా కనిపించాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంట బావుంది. ఇద్దరి జోడీ, గుడ్ లుక్స్ వల్ల సాంగ్స్ & కొన్ని సీన్స్ మంచిగా అనిపిస్తాయి. లవ్ స్టోరీకి కావాల్సిన హ్యాండ్సమ్ లుక్, ఆ ఫిజిక్ సిద్ధార్థ్ మల్హోత్రాలో ఉన్నాయి. అయితే సరైన సన్నివేశాలు పడలేదు. చీరలు, కేరళ స్టైల్ డ్రసింగ్‌లో జాన్వీ కపూర్ కొత్తగా కనిపించారు. చర్చిలో రొమాంటిక్ సీన్ ఏమీ లేదు. జాన్వీ చెప్పిన మలయాళీ డైలాగులు తక్కువే. కానీ ఆవిడ చెప్పిన తీరు బాలేదు. పర్ఫెక్షన్ కోసం ట్రై చేయలేదు. నిజం చెప్పాలంటే... జాన్వీ కపూర్ నటన బావుంది. పాటల్లో అందంగా కనిపించారు. అయితే మలయాళీలు అంటే మల్లెపూలు పెట్టుకుని, చీరలు కట్టుకుని ఉంటారన్నట్టు క్యారెక్టర్ డిజైన్ చేయడం బాలేదు. అది గ్లామర్ గాళ్ రోల్ అంతే. అందుకు ఆవిడను నిందించడం కంటే దర్శక రచయితలను ప్రశ్నించాలి. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అవ్వలేదు. సంజయ్ కపూర్ కనిపించేది నాలుగైదు సన్నివేశాలే. జాన్వీ కపూర్ చెల్లెలిగా నటించిన ఇనాయత్ వర్మ క్యూట్ గా ఉంది.
కేరళ నేపథ్యంలో రొటీన్ ప్రేమకథతో రూపొందిన సినిమా 'పరమ్ సుందరి'. సచిన్ - జిగర్ అందించిన స్వరాలు, వాటిని చిత్రీకరించిన విధానం బావుంది. ఈ సినిమాకు హైలైట్ సాంగ్స్. ఆ తర్వాతే సిద్ధార్థ్ మల్హోత్రా - జాన్వీ కపూర్ జంట! వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బావుంది. కానీ, రొటీన్ స్టోరీలో ఏమీ చేయలేకపోయారు. కేరళ బ్యాక్‌డ్రాప్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. పాటల కోసం వెళ్ళండి. జాన్వీ కపూర్ ఫ్యాన్ అయితే. లేదంటే లైట్, హ్యాపీగా ఇంట్లో ఉండండి.
Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?





















