Tribanadhari Barbarik Review - 'త్రిబాణధారి బార్బరిక్' రివ్యూ: మైథాలజీతో లింక్ ఉందా? సత్యరాజ్ - ఉదయభానుల సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Sathyaraj's Barbarik Movie Review: సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్ సింహ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
మోహన్ శ్రీవత్స
సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహా, ఉదయభాను, క్రాంతి కిరణ్, 'సత్యం' రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ తదితరులు
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు సత్యరాజ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'త్రిబాణధారి బార్బరిక్'. ఇందులో ఉదయభాను లేడీ డాన్ రోల్ చేయడం, వశిష్ఠ ఎన్ సింహ హీరోగా నటించడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. 'సత్యం' రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన ఇతర ప్రధాన తారాగణం. మహాభారతంలోని బర్బరీకుడిని గుర్తు చేసే టైటిల్ మరింత ఆసక్తి పెంచింది. మరి, వానర సెల్యూలాయిడ్ పతాకంపై మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన సినిమా ఎలా ఉంది? మైథాలజీకి, కథకు లింక్ ఉందా? అనేది తెలుసుకోండి.
కథ (Tribanadhari Barbarik Movie Story): శ్యామ్ కతు (సత్యరాజ్) సైక్రియాట్రిస్ట్. మనవరాలు నిధి (మేఘన) కనిపించడం లేదని పోలీసుల దగ్గరకు వెళతాడు. నిధి మిస్సింగ్ కేసుకు, లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) మేనల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)కు సంబంధం ఏమిటి? విదేశాలు వెళ్లేందుకు డబ్బులు అవసరమైన రామ్ (వశిష్ఠ ఎన్ సింహ)తో కలిసి దేవ్ ఏం చేశాడు? మిస్సింగ్ కేసులో డ్రగ్స్ పాత్ర ఏమిటి? సత్య (సాంచీ రాయ్), మునిగి దాసన్న (మొట్ట రాజేంద్రన్) పాత్రలు ఏమిటి? మనవరాలు మిస్సింగ్ కేసును శ్యామ్ కతు ఎలా చేధించాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Tribanadhari Barbarik Telugu Review): మైథాలజీ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అందుకు చక్కటి ఉదాహరణ. అందులో అశ్వత్థామ, కల్కి, కర్ణుడి పాత్రలకు వచ్చిన స్పందన అద్భుతం. 'త్రిబాణధారి బార్బరిక్'పై ఆసక్తికి కారణం టైటిల్. ఈ సినిమాలో బర్బరీకుడిని ఎలా చూపించారోనని ప్రేక్షకులు కొందరు ఇంకొంచెం ఆసక్తి చూపించారు. సినిమాలో బర్బరీకుడు ప్రస్తావన ఉంది. అయితే... 'కల్కి 2898 ఏడీ' తరహాలో అప్పటి పాత్రలు ఇప్పుడు మళ్ళీ కనిపించడం వంటివి లేవు. ఇక సినిమా విషయానికి వస్తే...
కథగా చూస్తే 'త్రిబాణధారి బార్బరిక్' ఓ మర్డర్ మిస్టరీ. ఈ తరహా కథలను ఇంతకు ముందు తెరపై చూసి ఉంటాం. అయితే... ఈ కథను దర్శకుడు మోహన్ శ్రీవత్స చూపించిన విధానం బావుంది. అనవసరపు సన్నివేశాలు ఎక్కువ రాయలేదు. మరీ కథను సాగదీయలేదు. రెండు గంటల్లో సినిమా ముగించారు. కథనంలో మలుపులు ఆసక్తికరంగా చూపించారు. ఇటువంటి సినిమాల్లో ట్విస్టులు కీలకం. ప్రేక్షకుడి ఊహకు మించి షాక్, సర్‌ప్రైజ్ ఇచ్చినప్పుడు 'వావ్' ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ కోవలోకి వస్తుంది. సినిమాకు మైనస్ ఎమోషనల్ మూమెంట్స్. థ్రిల్లర్ సీన్స్ ఎంత బాగా చేశారో... ఆ స్థాయిలో ఎమోషనల్ సీన్స్ తీయలేదు. మనవరాలు మిస్ అయితే తాతయ్య ఫీలయ్యే ఎమోషన్ సరిగా చూపించలేదు.
'త్రిబాణధారి బార్బరీక్'లో ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్న నేరాలు - ఘోరాలను కథానుగుణంగా చెప్పారు. డ్రగ్స్, మహిళలపై వేధింపులు, అత్యాశ వంటి అంశాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్ థ్రిల్లింగ్‌గా మొదలైనా విరామం వరకు కాస్త సాగింది. మంచి ట్విస్టుతో ఇంటర్వెల్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు మర్డర్ మిస్టరీగా మారడం, ఒక్కో మలుపుతో ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా సాగాయి. పోలీస్ వ్యవస్థను కాదని సత్యరాజ్ రంగంలోకి దిగిన తర్వాత కథనంలో వేగం పెరిగింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టులతో చకచకా ముందుకు తీసుకు వెళ్లి సినిమాను ముగించారు. టెక్నికల్ పరంగా... బార్బరిక్ ఆశ్చర్యపరుస్తుంది. కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ పాటలు & ఆర్ఆర్ కథతో ట్రావెల్ చేసేలా ఉన్నాయి. నిర్మాత కాంప్రమైజ్ కాకుండా తీశారు.
Also Read: మూడు బాణాల్లో కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగల 'బర్బరీకుడు' ప్రాణత్యాగం ఎందుకు చేశాడు?
సైక్రియార్టిస్ట్ శ్యామ్ పాత్రలో సత్యరాజ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా సన్నివేశంలో భావాన్ని చూపించారు. వశిష్ఠ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అన్నిటినీ ఆయన చక్కగా చేశారు. మరోసారి వశిష్ఠ వాయిస్ హైలైట్ అవుతుంది. ఉదయభాను లేడీ డాన్ కింద చక్కగా నటించారు. ఆవిడను ఆ పాత్రలో చూడటం కొత్తగా ఉంటుంది. క్రాంతి కిరణ్, 'సత్యం' రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ కాస్త నవ్వించారు.
Tribanadhari Barbarik Rating: మహాభారతంతో బర్బరీకుని లక్షణాలతో సత్యరాజ్ పాత్రను పోలుస్తూ చేసిన సినిమా 'త్రిబాణధారి బార్బరీక్'.కథలో మైథాలజీ టచ్ తక్కువ. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎక్కువ. రెగ్యులర్ మర్డర్ మిస్టరీతో తీసిన చిత్రమిది. రన్ టైమ్ రెండు గంటలు కావడం, రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మంచి ట్విస్టులు ఇవ్వడం వల్ల థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులను శాటిస్‌ఫై చేస్తుందీ 'త్రిబాణధారి బార్బరీక్'.
Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?




















