Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Bloody Beggar Review in Telugu: ప్రముఖ దర్శకుడు నెల్సన్ నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా ‘బ్లడీ బెగ్గర్’. కవిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా?
శివబాలన్ ముత్తుకుమార్
కవిన్, రెడిన్ కింగ్స్లే, 30 ఇయర్స్ పృథ్వీ, తనూజ మధురాపంతుల తదితరులు
Bloody Beggar Movie Review: ‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక్కసారి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ‘జైలర్’ విజయం తర్వాత ఆయన నిర్మాతగా మారి తమిళంలో ‘బ్లడీ బెగ్గర్’ అనే సినిమాను నిర్మించారు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో కవిన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో డబ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?
కథ: చెన్నై సిటీలో ఒక బిచ్చగాడు (కవిన్) ముష్టెత్తుకుని జీవిస్తూ ఉంటాడు. తనకు దొరికిన ఒక చిన్న బాబుని పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఎవరూ భిక్షం వేయరు. సరిగ్గా ఆ సమయంలో ఒక పెద్దింట్లో అన్నదానం కోసం మనిషి తగ్గాడని ఈ బిచ్చగాడిని తీసుకెళ్తారు కొందరు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక బిచ్చగాళ్లందరూ వెళ్లిపోతారు. కానీ కళ్లకెదురుగా ఉన్న పెద్ద భవనం నచ్చడంతో ఆ ఇంట్లోకి దొంగతనంగా దూరతాడు ఈ బిచ్చగాడు.
కానీ అనుకోకుండా అతను లోపలికి వెళ్లాక ఆ బిల్డింగ్ లాక్ అయిపోతుంది. అదే ఇంట్లో ఇంకొందరు ఉన్నారని తెలుసుకుంటాడు. ఆ ఇంట్లో ఉంటున్నది ఎవరు? బిచ్చగాడిని ఆ ఇంటికి వారసుడు అని ఎందుకు నమ్మించాల్సి వచ్చింది? అసలు ఆ ఇంట్లో ఉన్న వాళ్లకి ఆ బిచ్చగాడికి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ‘బ్లడీ బెగ్గర్’ చూడాల్సిందే.
విశ్లేషణ: మనం ఎంత కొత్త కథని చెబుతున్నాం అనే దాని కంటే చెప్పే విధానం ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి. అదేదో సినిమాలో చెప్పినట్లు గమ్యం బాగుంటే సరిపోదు. దారి కూడా బాగుండాలిగా. ‘బ్లడీ బెగ్గర్’లో కథ కొత్తది. ఒక బిచ్చగాడు అనుకోకుండా ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఇరుక్కోవడం... ఆ ఇంట్లో వాళ్లని, ఈ బిచ్చగాడిని కనెక్ట్ చేసే ఒక విషయం అంతకు ముందే జరగడం, కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం అనేవి చాలా విభిన్నమైన పాయింట్లు. నెల్సన్‌ను ఎగ్జైట్ చేసేవి కూడా ఇవే అయి ఉంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు.
బిచ్చగాడిగా కవిన్ నటన ఆకట్టుకుంటుంది కానీ ఆ సన్నివేశాల్లో హాస్యం మాత్రం పండలేదు. స్టోరీ ప్యాలెస్‌కి షిఫ్ట్ అయినప్పటి నుంచి నెమ్మదిగా కథలో ఉన్న ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అసలు ఆ బిల్డింగ్ ఎవరిది? అందులో ఉన్నవాళ్లంతా ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు? వాళ్లకి ఈ బిచ్చగాడికి సంబంధం ఏంటి? ఈ పోర్షన్లన్నీ బాగా డిజైన్ చేశారు. ట్విస్టులు రివీల్ అయ్యే ఎపిసోడ్లు బాగా పండాయి కూడా. కానీ మధ్యలో సన్నివేశాలు మాత్రం అంత బాగా పండలేదు.
సినిమాలో ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లలో కవిన్ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ మీద నెల్సన్ ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. నటుల క్లోజప్ షాట్లు అయితే నెల్సన్ తీసినట్లే ఉంటాయి. సినిమా క్లైమ్యాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో చిన్న పిల్లాడి నటన కూడా ఆకట్టుకుంటుంది.
సుజిత్ సారంగ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను సినిమాటోగ్రఫీ ద్వారా అందించారు. జెన్ మార్టిన్ సంగీతం ఇంకా మెరుగ్గా ఉండవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ‘బ్లడీ బెగ్గర్’ పూర్తిగా కవిన్ వన్ మ్యాన్ షో. బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో ఏడిపిస్తాడు. కవిన్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర అతను పెంచుకునే పిల్లాడిది. అతను కూడా బాగా నటించాడు. మిగిలిన పాత్రధారులందరి నుంచి విభిన్నంగా పెర్ఫార్మెన్స్‌ను రాబట్టే ప్రయత్నం చేశాడు. తెలుగు నటుడు 30 ఇయర్స్ పృథ్వీ, తెలుగు యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ తనూజ మధురాపంతుల ఈ సినిమాలో నటించారు. ఇద్దరికీ కాస్త రిజిస్టర్ అయ్యే పాత్రలే పడ్డాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కథ బాగుండి కథనం, కథాగమనం వల్ల సక్సెస్ అవ్వలేకపోయిన సినిమాల జాబితాలో ‘బ్లడీ బెగ్గర్’ కూడా చేరిపోతుంది. చూడాలనుకుంటే ఓటీటీలో వచ్చే దాకా వెయిట్ చేయడం బెటర్.