PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Spadex: స్పేడెక్స్ ప్రయోగం 2 నిమిషాలు ఆలస్యం కావడానికి గల కారణాలను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని.. అందుకే రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
ISRO Chairman Comments On Spadex Launch Postponement: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ఈ ఏడాది చేపట్టిన చివరి ప్రయోగం 'స్పేడెక్స్' (Spadex) కొద్దిసేపు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 9:58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేశారు. పీఎస్ఎల్‌వీ సీ - 60 (PSLV C60) రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. కాగా, ప్రయోగం ఆలస్యానికి గల కారణాలను ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ (S.Somnath) వివరించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వల్లే అనుకున్న సమయానికి జరగాల్సిన ప్రయోగానికి అంతరాయం కలిగినట్లు చెప్పారు. 'అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రయోగం 2 నిమిషాలు ఆలస్యమైంది. 9:58 గంటలకు బదులుగా 10:00:15 సెకన్లకు రీషెడ్యూల్ చేశాం.' అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ వెల్లడించారు.
కాగా, ఇస్రో చరిత్రలో కక్ష్యలో ఇలా జరిగి ప్రయోగం ఆలస్యం కావడం ఇదే తొలిసారి కాదు. 2023లో చంద్రయాన్ - 3 మిషన్‌ను కూడా కొన్ని నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. స్టార్‌లింక్‌కు చెందిన కొన్ని ఉపగ్రహాలు ఈ దారిలో వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం స్టార్‌లింక్ సముదాయానికి చెందిన 7 వేల ఉపగ్రహాలు భూ కక్ష్యలో దిగువ భాగంలో ఉన్నాయని తెలిపారు. చాలాకాలంగా ఈ భారీ నక్షత్రరాశులు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నట్లు వివిధ అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా.. అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఉపగ్రహాలకు భారీ ప్రమాదం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఛేజర్, టార్గెట్ శాటిలైట్స్
సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ - 60 సోమవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా SDX1 (ఛేజర్) SDX2 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ 2 ఉపగ్రహాల బరువు 450 కిలోలు కాగా.. ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైన అనంతరం అంతరిక్షంలో ట్రాఫిక్ జాం ఏర్పడడంతో రీషెడ్యూల్ చేశారు.
భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతో పాటు రోదసిలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం ఖగోళ పరిశోధనల్లో ఇస్రో సాధించిన గణనీయ పురోగతికి సూచికగా నిలవనుంది. ఈ ప్రయోగం ద్వారా స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం సహా మరో 24 పేలోడ్లనూ అంతరిక్షంలోకి పంపించి ప్రయోగాలు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. పలు విద్యా సంస్థలు, స్టార్టప్స్, ఇస్రో అనుబంధ సంస్థలు తయారుచేసిన ఈ పేలోడ్స్‌ను రాకెట్ నాలుగో స్టేజ్ (పైభాగం)లో అమర్చారు. పీఎస్ 4 - ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్‌గా (పీఓఈఎం) వ్యవహరించే ఈ భాగం కొన్ని వారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్స్ నిర్దిష్ట ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది. అంతరిక్ష వ్యర్థంగా మారిపోయే ఓ భాగాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నిర్దిష్ట కాలంలో మరిన్ని ప్రయోగాలను చేపట్టడం పీఏఈఎం ముఖ్య ఉద్దేశం.
Also Read: TTD News: తెలంగాణ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఇక అనుమతిస్తారు !