Gaalivaana Web Series Review - 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - Gaalivaana Web Series : రాధికా శరత్ కుమార్, సాయికుమార్ డిజిటల్ తెరకు పరిచయమైన వెబ్ సిరీస్ 'గాలివాన'. ఈ వారం 'జీ 5'లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
శరణ్ కొప్పిశెట్టి
రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: 'గాలివాన'
రేటింగ్: 2.75/5
నటీనటులు: రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి, చైతన్యకృష్ణ, ఆశ్రిత వేముగంటి, 'తాగుబోతు' రమేష్, శరణ్య తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
సంగీతం: హరి గౌర
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022 (జీ5 ఓటీటీలో)
తెలుగు ప్రేక్షకులకు రాధికా శరత్ కుమార్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే, సాయి కుమార్‌ను కూడా! వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు చేశారు. రాధిక సీరియల్స్ చేశారు. సాయికుమార్ టీవీ షోస్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిజిటల్ తెరకు పరిచయమవుతున్నా ప్రాజెక్ట్ 'గాలివాన'. బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఇందులో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. గురువారం విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? (Gaalivaana Web Series Review) ఏమిటి?
కథ: సరస్వతి (రాధికా శరత్ కుమార్) కుమారుడు అజయ్, కొమర్రాజు (సాయి కుమార్) కుమార్తె గీత ప్రేమించుకుంటారు. కుమార్తెకు వేరొకరితో పెళ్లి నిశ్చయం చేసిన కొమర్రాజు... విషయం తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అజయ్‌కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. నూతన దంపతులను ఒక యువకుడు హత్య చేస్తాడు. ఆ తర్వాత కారులో పారిపోతాడు. సరిగ్గా సరస్వతి ఇంటి ముందుకు వచ్చాక... గాలివాన కారణంగా కారుకు యాక్సిడెంట్ అవుతుంది. గాయాలతో ఉన్న యువకుడిని కాపాడతారు. చికిత్స అందించడానికి సిద్ధమవుతారు. అంతలో హంతకుడు అతడేనని తెలుస్తుంది. తెల్లారేసరికి హంతకుడు హత్య చేయబడతాడు. అతడిని చంపింది ఎవరు? నూతన దంపతులకు అతడు ఎందుకు హత్య చేశాడు? ఈ రెండు హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: బిబిసి మినీ సిరీస్ 'వన్ ఆఫ్ అజ్'కు (BBC Mini Series, One Of Us Telugu adoption Gaalivaana Review) అఫీషియల్ అడాప్షన్ 'గాలివాన'. ఫారిన్ కథలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆ విషయంలోనూ... ప్రధాన పాత్రధారుల ఎంపిక, ప్రొడక్షన్ డిజైన్‌తో నేటివ్ ఫీల్ తీసుకు రావడంలోనూ శరణ్ కొప్పిశెట్టి, రైటింగ్ టీమ్ సక్సెస్ అయ్యింది. ఆయుర్వేద వైద్యుడిగా సాయికుమార్, ముగ్గురు పిల్లలను పెంచిన ఒంటరి తల్లిగా రాధికా శరత్ కుమార్‌ను ఎంపిక చేయడం ప్లస్ అయ్యింది. సాయికుమార్ భార్యగా ఆశ్రిత వేముగంటి, రాధికా పిల్లలుగా చైతన్య కృష్ణ, చాందిని చౌదరి అందరూ ఆయా పాత్రలు సరిపోయారు.
'గాలివాన' వెబ్ సిరీస్ స్టార్టింగ్ నోట్ బావుంటుంది. నూతన దంపతులు హత్య కావడం, వాళ్ళ కుటుంబ సభ్యుల చెంతకు వచ్చిన ఆ హంతకుడు సైతం హత్యకు గురి కావడం, ఎవరు హత్య చేశారన్నది సస్పెన్స్ కావడంతో... మొదటి ఎపిసోడ్ మిగతా వాటిపై ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత మూడు ఎపిసోడ్స్ ఆశించిన రీతిలో సాగలేదు. క్యారెక్టర్స్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడమే అందుకు కారణం.
ఉదాహరణకు సర్వసతి కుమారుడు మార్తాండ్ (చైతన్య కృష్ణ)కు కోపం ఎక్కువ అని చూపిస్తారు. భర్త నుంచి విడాకులు తీసుకుని, కుమార్తె కస్టడీ కోసం పోరాడుతున్న మహిళ అతడిని ఎలా ప్రేమించింది? అనేది క్లారిటీ ఉండదు. నందిని రాయ్ కుటుంబ నేపథ్యం కథలో ఇమడలేదు. దానివల్ల ఉపయోగమూ లేదు. ఆమెను సిన్సియర్ పోలీస్‌గా చూపించి ఉంటే ఇంపాక్ట్ మరింత క్రియేట్ అయ్యేది. ఇలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయితే... ఎవరు హత్య చేశారు? అనే సస్పెన్స్ కంటిన్యూ చేయడం కోసం, నందిని రాయ్ ఏం చేస్తుందో? అని ఆడియన్స్ అనుకునేలా చేయడంలోనూ ఆయా పాత్రలను దర్శకుడు ఉపయోగించుకున్న విధానం బావుంది.
'గాలివాన' మిడిల్ ఎపిసోడ్స్ ఆసక్తి కలిగించకపోవడనికి మరో కారణం 'దృశ్యం'. 'వన్ ఆఫ్ అజ్'కు 'గాలివాన'కు అడాప్షన్ అయినా... పోలీసుల నుంచి తప్పించుకోవాలని హత్యకు గురైన యువకుడి శవం మాయం చేయడం కోసం రెండు కుటుంబాలు ప్రయత్నించడం వంటివి 'దృశ్యం' సినిమాను గుర్తుకు తెస్తాయి. రాధిక భర్త ఎపిసోడ్ కూడా నిడివి పెంచింది తప్ప ఆకట్టుకోలేదు. అయితే... చివరి రెండు ఎపిసోడ్స్ బావున్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ రెవీల్ చేస్తూ... ముగింపుపై ఆసక్తి కలిగించారు. అయితే, క్లైమాక్స్ పాయింట్ ఎంత మంది రిసీవ్ చేసుకుంటారనేది చెప్పడం కష్టమే. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బావున్నాయి. దర్శకుడికి టెక్నికల్ టీమ్ చక్కటి సపోర్ట్ ఇచ్చింది.
సాయికుమార్ నటన 'గాలివాన'కు పెద్ద ప్లస్ పాయింట్. రాధికా శరత్ కుమార్ పాత్ర పరిధి మేరకు నటించారు. నటనలో ఆమె అనుభవం కనిపించింది. చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, నందిని రాయ్, శరణ్య... ప్రతి ఒక్కరూ పాత్రలు తగ్గట్టు నటించారు. 'తాగుబోతు'గా కాకుండా పోలీస్‌గా రమేష్ బావుంది. సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
ఓవరాల్‌గా చెప్పాలంటే... కుటుంబ నేపథ్యంలో రూపొందిన ఒక చక్కటి థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'గాలివాన'. ఫస్ట్ పది నిముషాలు అసలు మిస్ అవ్వవద్దు. థ్రిల్లింగ్ మూమెంట్స్ కంటే మిస్టరీ ఎలిమెంట్స్ ఎంగేజ్ చేస్తాయి. లాజిక్స్ తీయడం మానేసి స్క్రీన్ మీద ఏం జరుగుతుందనే అంశం మీద దృష్టి పెడితే ఆసక్తిగానే ఉంటుంది. అన్నిటి కంటే ముఖ్యంగా నటీనటులందరి అభినయం ఆకట్టుకునేలా ఉంది. థ్రిల్లర్ సినిమాలు రేసీ స్క్రీన్ ప్లేతో సాగితే... వెబ్ సిరీస్‌లు కాస్త నెమ్మదిగా సాగుతూ ఎండింగ్‌లో ఒక చిన్న ట్విస్ట్‌తో ముగుస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకుని చూడాల్సిన సిరీస్ ఇది. ఓటీటీ రిలీజ్ కాబట్టి ఫార్వర్ చేసుకునే ఆప్షన్ ఎలాగో ఉంది. ఫైనల్లీ... వీకెండ్‌కు మంచి టైమ్ పాస్ సిరీస్ 'గాలివాన'.
Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?