By: Satya Pulagam | Updated at : 06 Oct 2023 05:13 PM (IST)
'మంత్ ఆఫ్ మధు' సినిమాలో స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర, శ్రేయా నవేలి
మంత్ ఆఫ్ మధు
అడ్వెంచర్, రొమాంటిక్ డ్రామా
దర్శకుడు: శ్రీకాంత్ నాగోతి
Artist: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయా నవేలి, హర్ష చెముడు తదితరులు
సినిమా రివ్యూ : మంత్ ఆఫ్ మధు
రేటింగ్ : 2/5
నటీనటులు : నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), శ్రేయా నవేలి, హర్ష చెముడు (వైవా హర్ష), మంజుల ఘట్టమనేని, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, 'కంచెరపాలెం' కిషోర్ తదితరులు
ఛాయాగ్రహణం : రాజీవ్ ధరావత్
సంగీతం : అచ్చు రాజమణి
నిర్మాత : యశ్వంత్ ములుకుట్ల
రచన, దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023
ఓటీటీలో విడుదలైన 'భానుమతి & రామకృష్ణ' ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తీసిన తాజా సినిమా 'మంత్ ఆఫ్ మధు' (Month Of Madhu Movie). ఇందులో స్వాతి రెడ్డి (Swathi Reddy), నవీన్ చంద్ర జంటగా నటించారు. శ్రేయా నవేలి ప్రధాన పాత్రధారి. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Month Of Madhu Story) : మధు... మధుసూదన్ రావు (నవీన్ చంద్ర), లేఖ (స్వాతి రెడ్డి) ప్రేమించుకుంటారు. ఇద్దరూ ఒక్కటి కావడంతో లేఖ ఓసారి అబార్షన్ చేయించుకుంటుంది. తర్వాత ఇంట్లో విషయం తెలుస్తుంది. అన్నయ్య శ్రీను (రాజా చెంబోలు) చెప్పినా వినకుండా మధును పెళ్లి చేసుకుంటుంది లేఖ. మధుతో పాటు అతడి కోపాన్ని, మొండితనాన్ని కూడా ప్రేమిస్తుంది. అటువంటి అమ్మాయి భర్త నుంచి విడాకులు కావాలని ఎందుకు కోర్టు మెట్లు ఎక్కింది?
అమెరికా నుంచి ఓ పెళ్లి కోసం ఇండియా వచ్చిన మధు... మధుమతి (శ్రేయా నవేలి) మధు, లేఖ దంపతుల జీవితాల్లో మార్పుకు పరోక్షంగా ఎలా కారణం అయ్యింది? ఇండియాలో నెల రోజులు ఉంటానని తండ్రితో చెప్పిన మధుమతి జీవితంలో ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (Month Of Madhu Movie Review) : స్త్రీ స్వేచ్ఛ అంటే ఏమిటి? అని అడిగితే... ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిర్వచనం ఇస్తారు. పద్ధతులు, కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో మహిళలకు సమాజం కట్టుబాట్లు విధించిన మాట వాస్తవం. ఇష్టమైనా కష్టమైనా పెళ్ళైన తర్వాత భర్తను భరించాలని సమాజం చెబుతుంది. అలాగే... ఆడపిల్ల ఆటపాటల నుంచి ఇరుగు పొరుగుతో ఏ విధంగా మాట్లాడాలో కూడా చెబుతుంది. ఓ గిరి గీసి అందులో కూర్చోమంటోంది. 'మంత్ ఆఫ్ మధు'లో పైన చెప్పిన రెండు అంశాలపై దర్శకుడు శ్రీకాంత్ నాగోతి దృష్టి పెట్టారు.
'మంత్ ఆఫ్ మధు' టైటిల్, కథకు సంబంధం ఏమిటి? అంటే... ఇండియాలో ఓ నెల ఉంటానని అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి తండ్రి నుంచి అనుమతి తీసుకుంటుంది. ఆ నెలలో ఏం జరిగింది? అనేది కథ! టైటిల్ ప్రకారం చూస్తే... ఇది శ్రేయా నవేలి కథ. స్క్రీన్ మీద చూస్తే... ఇది స్వాతి, నవీన్ చంద్రల కథ!
భర్త నుంచి విడాకులు కోరుతూ స్వాతి కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఏమైంది? అని నవీన్ చంద్రను ఎవరైనా అడిగితే 'ఎవడికి తెలుసు?' అని సమాధానం చెబుతాడు. సినిమా మధ్యలో పక్క సీటులో ప్రేక్షకుడిని 'ఇప్పుడీ సీన్ ఎందుకు వచ్చింది? ఏమైంది?' అని అడిగితే... 'ఎవరికి తెలుసు?' అని కోపడ్డొచ్చు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పేరుతో దర్శకుడు అంత కంగాళీగా సినిమా తీశారు. ప్రజెంట్ నుంచి ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ అక్కడి నుంచి ప్రజెంట్... కథ ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ, సరైన లింక్స్ & క్లారిటీ ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. స్వేచ్ఛకు, కట్టుబాట్లకు మధ్య దర్శకుడు సరైన గీత గీయలేదు. ఆయన రాసిన సన్నివేశాల్లో పరస్పరం విరుద్ధమైన భావాలు ఉన్నాయి.
తల్లి నుంచి తనకు స్వేచ్ఛ లేదని అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి (శ్రేయా నవేలి) ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఓ ర్యాప్ సాంగ్! ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఒకవేళ ఆ అమ్మాయి కోరుకున్నది స్వేచ్ఛ అని శ్రీకాంత్ నాగోతి భావించారా? అమ్మాయిలు మందు, గంజాయి కొట్టడమే స్వేచ్ఛ అని ఆయన భావిస్తున్నారా? 'ఇద్దరు ఉండాల్సిన పెళ్ళిలో ఒకరు ఉండటం కరెక్టా? లేదంటే ఒంటరిగా ఉండటం కరెక్టా?' అని స్వాతి పాత్రకు ఓ డైలాగ్ రాశారు. అటువంటి అర్థవంతమైన సంభాషణ రాసిన దర్శకుడి నుంచి శ్రేయా నవేలి క్యారెక్టర్ సీన్స్ రావడం ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికాలో పద్ధతులు వేరు, ఇండియాలో పద్ధతులు వేరు. ఆ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని దర్శకుడు చూపలేదు. ఆమె చేసిన పనులను సమర్ధించారు. చివరలో ఆ పాత్రతో సందేశం ఇప్పించారు. క్లైమాక్స్ అయితే హైలైట్! అది అర్థం కాలేదు. సినిమా నిదానంగా ముందుకు సాగుతుంది.
'మంత్ ఆఫ్ మధు' బాలేదని చెబితే ఓ సెక్షన్ ఆఫ్ ఫెమినిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. భార్యను సరిగా చూసుకొని భర్తది తప్పు అని చెప్పడం ఎంత కరెక్టో, అమ్మాయి తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడం అంతే కరెక్ట్ అనేది గ్రహించాలి. అలాగని, 'మంత్ ఆఫ్ మధు' సినిమా అంతా బాలేదని కాదు. కొన్ని సన్నివేశాలు ఆలోచన రేకెత్తిస్తాయి. భార్య భర్తల బంధం ఎలా ఉండాలో చెప్పాయి. అయితే... దర్శకుడి ఆలోచనల్లో సంఘర్షణ సినిమాను ఏ తీరం చేరని నావలా నడి సంద్రంలో విడిచి పెట్టింది. కొన్ని సన్నివేశాలకు సరైన ముగింపు ఇవ్వలేదు. పాటల్లో ఫ్యూజన్ ఎక్కువ వినిపించింది. నేపథ్య సంగీతంలో కూడా! సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారంటే : తాగుబోతు అంటే నవీన్ చంద్ర అనేంతలా మధు... మధుసూదన్ రావు పాత్రలో నవీన్ చంద్ర జీవించారు. సారీ... ఆ పాత్రకు ప్రాణం పోశారు. గెటప్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు... ప్రతిదీ పర్ఫెక్ట్!
స్వాతి పాత్రలో రెండు కోణాలు ఉన్నాయి. కాలేజీ అమ్మాయి రోల్ చేసినప్పుడు... ముద్దు ముద్దుగా కనిపించారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే అమ్మాయి పెళ్లి తర్వాత మూగబోయిన మహిళగా వేరియేషన్ చూపించారు. డీ గ్లామర్ లుక్ మైంటైన్ చేశారు. ఓ బోల్డ్ సీన్ కూడా చేశారు. అది కొందరిని సర్‌ప్రైజ్ చేయవచ్చు. స్వాతి నటన సహజంగా ఉంది. శ్రేయా నవేలి కూడా అంతే సహజంగా నటించారు. జ్ఞానేశ్వరి గ్లామరస్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంది. నటిగానూ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. రాజా, రుచితా సాధినేని, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read : 'చిన్నా' రివ్యూ : నటుడిగా సిద్ధార్థ్ టాప్ క్లాస్ పెర్ఫార్మన్స్ - మరి సినిమా?
చివరగా చెప్పేది ఏంటంటే : నటుడిగా నవీన్ చంద్ర మరో మెట్టు ఎక్కిన సినిమాగా 'మంత్ ఆఫ్ మధు' నిలుస్తుంది. స్వాతి రెడ్డిలో కొత్త కోణం చూడవచ్చు. సినిమాలో పాత్రల విషయానికి వస్తే... ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రేమించారు. దర్శకుడు తనకు నచ్చినట్టు తీశారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే కష్టమే. ఇటువంటి సినిమాలకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆదరణ ఉంటుంది. అందరికీ నచ్చే అవకాశాలు తక్కువ.
Also Read :'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
The Boys Season 4: ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 4 వచ్చేస్తోంది, ఇదిగో తెలుగు టీజర్
Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>