Mama Mascheendra Review - 'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?
Mama Mascheendra Movie Review In Telugu : సుధీర్ బాబు హీరోగా నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. నేడు థియేటర్లలో విడుదలైంది.
హర్షవర్ధన్
సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్
సినిమా రివ్యూ : మామా మశ్చీంద్ర
రేటింగ్ : 1.5/5
నటీనటులు : సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, 'మిర్చి' కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, 'షకలక' శంకర్, అలీ రేజా తదితరులు
ఛాయాగ్రహణం : పీజీ విందా
నేపథ్య సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
స్వరాలు : చైతన్ భరద్వాజ్
సమర్పణ : సోనాలి నారంగ్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : హర్షవర్ధన్
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023
సుధీర్ బాబు (Sudheer Babu) త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'మామా మశ్చీంద్ర' (Mama Mascheendra Movie). దీనికి నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు లుక్స్, ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశాయి. మరి, సినిమా?
కథ (Mama Mascheendra Story) : పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా రాతి మనిషిలా మారడతాడు. వందల కోట్ల ఆస్తి కోసం సొంత మనుషులను సైతం చంపడానికి వెనుకాడడు. చెల్లెలు, ఆమె భర్తతో పాటు పిల్లల్ని చంపమని తన మనిషి దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. అయితే... వాళ్ళు తప్పించుకుంటారు. కట్ చేస్తే...
కొన్నేళ్ళకు పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఈ విషయం తెలిసి... తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని ఇలా ప్రేమ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారేమోనని పరశురామ్ అనుమానిస్తాడు. అది నిజమా? లేదంటే అతడి ఊహ మాత్రమేనా? పరశురామ్ మీద హత్యాయత్నం చేసింది ఎవరు? కుమార్తెల విషయంలో పరశురామ్, దాసు ఒకరి దగ్గర మరొకరు దాచిన నిజం ఏమిటి? అది వాళ్ళకు ఎప్పుడు తెలిసింది? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Mama Mascheendra Review) : రచయితగా హర్షవర్ధన్ (Harshavardhan) ట్రాక్ రికార్డు చూస్తే విజయాలు ఎక్కువ. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో కూడిన 'మనం'కు ప్రేక్షకుడు గందరగోళానికి గురి కాకుండా మంచి సంభాషణలు రాశారు. 'గుండెజారి గల్లతయ్యిందే', 'చిన్నదాన నీ కోసం' సినిమాల్లో చక్కటి ప్రేమ సన్నివేశాలు రాశారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా అంటే ప్రేక్షకుల్లో మినిమమ్ అంచనాలు ఉంటాయి. మరి, 'మామా మశ్చీంద్ర' ఎలా ఉందనేది చూస్తే...
ఎంత చెయ్యి తిరిగిన వంటగాడు అయినా సరే... తన ప్రతిభ అంత ఒక్క వంటలో చూపించాలని అనుకోకూడదు. ఒకవేళ ప్రయత్నిస్తే... అసలు వంటకు ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. స్వీట్ బావుందని ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. అలాగే... ట్విస్టులు బావుంటాయని, బావున్నాయని కథలో లెక్కకు మిక్కిలి పెడితే ప్రేక్షకులు గందరగోళానికి గురి అవుతారు. 'మామా మశ్చీంద్ర' విషయంలో జరిగింది అదే.
'మామా మశ్చీంద్ర'లో టిస్టులు కొత్తగా ఉన్నాయా? అంటే అదీ లేదు. సినిమా స్టార్టింగే 'అల వైకుంఠపురములో' గుర్తుకు వస్తుంది. ఆ ట్విస్టును ఇంకాస్త సాగదీశారు. ఆ తర్వాత కూడా చాలా ట్విస్టులు ఉన్నాయి. కొన్నిసార్లు ఏం జరుగుతోంది? అని ప్రేక్షకులు బుర్ర చించుకుని ఆలోచించుకునేలా సన్నివేశాలు ఉంటాయి.
ఒక షాక్ తర్వాత మరొక షాక్ అంటే కథను అర్థం చేసుకోవడం కష్టమే. హీరోని మూడు నాలుగు లుక్కుల్లో చూపించాలని, లేదంటే సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉండాలని ముందు ఫిక్స్ అయ్యారేమో!? కథను ఆసక్తికరంగా ముందు తీసుకు వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. హర్షవర్ధన్ బలం కామెడీ! ఆయన సినిమాల్లో వినోదం బాగుంటుంది. కానీ, ఈ సినిమాలో నవ్వించిన సీన్లు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. లడ్డు బాబు లాంటి హీరో వెంట హీరోయిన్ ఎందుకు పడింది? పతాక సన్నివేశాల్లో హీరోలో మార్పు ఎందుకు వచ్చింది? మేనల్లుళ్ళ మీద అంత బలమైన పగ ఎందుకు? వంటివి కన్వీన్సింగ్‌గా చెప్పలేదు. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని సీన్లు రాసుకుంటూ వెళ్లారు.
పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు. పీజీ విందా ఇంతకు ముందు లో బడ్జెట్ సినిమాలు చేసినా కెమెరా వర్క్ భారీ బడ్జెట్ ఫిల్మ్ అన్నట్టు ఉండేది. కానీ, ఈ సినిమాలో ఆ ఫీల్ లేదు. సినిమా చూస్తుంటే తక్కువలో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు ఎలా చేశారంటే : సుధీర్ బాబు మూడు పాత్రలు చేశారు. రెగ్యులర్ లుక్కులో బాగున్నారు. ఎప్పటిలా ప్యాక్డ్ బాడీ చూపించారు. లడ్డు బాబు మేకప్ గానీ, ఆ లుక్ గానీ ఆయనకు సెట్ కాలేదు. ముసలి గెటప్ కూడా! పైగా... సుధీర్ బాబుతో కాకుండా వేరొకరితో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పించడం కూడా బాలేదు. సినిమాలో సుధీర్ బాబు అన్‌కంఫర్టబుల్‌గా కనిపించారు.
ఈషా రెబ్బా, మృణాళిని రవి... హీరోయిన్లు ఇద్దరి పాత్రలు రొటీన్! ఆయా పాత్రల్లో వాళ్ళ నటన కూడా! దర్శక, రచయితగా కంటే నటుడిగా హర్షవర్ధన్ మెప్పించారు. క్యారెక్టర్స్ డిజైన్ కారణంగా రాజీవ్ కనకాల, 'మిర్చి' కిరణ్, హరితేజ, అజయ్ తమ పరిధి మేరకు నటించారు. రామ్ గోపాల్ వర్మగా 'షకలక' శంకర్ కనిపించారు.
Also Read : 'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉంది? నవ్వించారా? లేదా?
చివరగా చెప్పేది ఏంటంటే : ప్యాక్డ్ బాడీ & స్టైల్ విషయంలో పర్ఫెక్షన్ చూపించడం సుధీర్ బాబుకు అలవాటు. ఓల్డ్ ఏజ్ గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. స్టార్టింగ్ & ఎండింగ్... మధ్యలో కొన్ని కామెడీ సీన్లు తప్పిస్తే దర్శకుడిగా, రచయితగా హర్షవర్ధన్ ఫెయిల్ అయ్యారు. సుధీర్ బాబు ఖాతాలో మరొక ఫ్లాప్!
Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial