Kannur Squad Review - 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
Kannur Squad Movie Review In Telugu : మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ సినిమా 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
రూబీ వర్గీస్ రాజ్
మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ తదితరులు
సినిమా రివ్యూ : కన్నూర్ స్క్వాడ్
నటీనటులు : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ తదితరులు
కథ, కథనం : మహమ్మద్ షఫీ
ఛాయాగ్రహణం : ముహమ్మద్ రహీల్
సంగీతం : సుషీన్ శ్యామ్
నిర్మాత : మమ్ముట్టి కంపెనీ
కథనం, దర్శకత్వం : రూబీ వర్గీస్ రాజ్
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty)కి తెలుగులోనూ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమాలు హైదరాబాద్ సిటీలో విడుదల అవుతున్నాయి కూడా! మలయాళీలతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం మమ్ముట్టి సినిమాలకు వెళుతుంటారు. సెప్టెంబర్ నెలాఖరున మమ్ముట్టి కొత్త సినిమా 'కన్నూర్ స్క్వాడ్' (Kannur Squad Movie) విడుదలైంది. మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఇంతకీ, ఆ సినిమా ఎలా ఉంది? ఏమిటి?
కథ (Kannur Squad Story) : కేరళలోని కన్నూర్ జిల్లాలో నేరాలకు అరికట్టడానికి ఏఎస్సై జార్జ్ మార్టిన్ (మమ్ముట్టి) నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేస్తారు. అందులో ఒకరు ఇసుక మాఫియా నుంచి లంచం తీసుకోవడం, ఆ వీడియో లీక్ కావడంతో ఆ బృందాన్ని పక్కన పెట్టేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తారు. అయితే... కాసర్ గోడ్ ప్రాంతంలో జరిగిన రాజకీయ నాయకుడి హత్య కేసును ఇన్వెస్టిగేట్ బాధ్యత 'కన్నూర్ స్క్వాడ్' చేతిలో పెడతారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పది రోజుల్లో పట్టుకోవాలని చెబుతారు. అసలు, ఆ హత్య ఎవరు చేశారు? వాళ్ళను జార్జ్ అండ్ టీమ్ పట్టుకున్నారా? లేదా? దర్యాప్తులో వాళ్ళకు ఎదురైనా సవాళ్ళు ఏమిటి? అనేది తెరపై సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Kannur Squad Movie Review) : తమిళంలో కార్తీ హీరోగా నటించిన 'థీరన్ అధిగారమ్ ఒండ్రు' సినిమా గుర్తు ఉందా? తెలుగులో 'ఖాకీ'గా విడుదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ అందులో హీరోయిన్! 'కన్నూర్ స్క్వాడ్' చూడాలని థియేటర్లకు వెళ్లిన అడుగడుగునా 'ఖాకీ' గుర్తుకు వస్తుంది. అందులో మరో సందేహం లేదు.
రెండు సినిమాలను కంపేర్ చేయడం తగదు! కానీ, 'కన్నూర్ స్క్వాడ్' & 'ఖాకీ' మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. రెండు సినిమాలను నిజ జీవితంలో జరిగిన కథల ఆధారంగా తెరకెక్కించారు. 'కన్నూర్ స్క్వాడ్' కూడా నిజంగా జరిగిన కథే. సినిమా చివరలో ఆ అధికారుల ఫొటోలను చూపించారు కూడా! అయితే... కథలో, కథనంలో ప్రతి అడుగులో 'ఖాకీ'ని స్ఫూర్తిగా తీసుకుని 'కన్నూర్ స్క్వాడ్' తెరకెక్కించారని అనిపిస్తోంది. దక్షిణాది పోలీసులు ఉత్తరాదికి వెళ్లి నేరస్థులను పట్టుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారు? ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఏం చేశారు? అనేది రెండు సినిమాల్లో మెయిన్ పాయింట్!
మమ్ముట్టి నటన, యాక్షన్ సన్నివేశాలు 'కన్నూర్ స్క్వాడ్'ను 'ఖాకీ' నుంచి వేరు చేశాయి. కథలో తెలుగు ప్రేక్షకులు కొత్తగా అనుభూతి చెందే అంశాలు ఏవీ లేవు. ఆల్రెడీ 'ఖాకీ' చూశారు కనుక! కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా... లంచగొండి అని ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? ఇతర రాష్ట్రాలకు ఇన్వెస్టిగేషన్ మీద వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? వంటివి 'కన్నూర్ స్క్వాడ్'లో చూపించారు. అసలు కథకు మధ్య మధ్యలో అవి స్పీడ్ బ్రేకర్లు మాదిరిగా అడ్డు పడ్డాయి. 'ఖాకీ'లో కార్తీతో పోలిస్తే... 'కన్నూర్ స్క్వాడ్' కోసం మమ్మట్టి కొంచెం ఎక్కువ ఏరియాలు తిరిగారు. రేప్ & మర్డర్ అంశాలు టచ్ చేశారు.
మమ్ముట్టి వయసును దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన యాక్షన్ అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. ఫైట్లలో హీరోయిజం చూపించే మూమెంట్స్ ఉన్నాయి. మలయాళ ప్రేక్షకులు వాటికి విజిల్స్ వేయడం గ్యారెంటీ! కెమెరా వర్క్, మ్యూజిక్, డైరెక్షన్ ఓకే.
నటీనటులు ఎలా చేశారంటే : మమ్ముట్టి ఎప్పుడో పంథా మార్చారు. కమర్షియల్ హంగులు, కథానాయిక పాత్ర లేకున్నా... కథకు ప్రాముఖ్యం ఇస్తూ కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. 'కన్నూర్ స్క్వాడ్'లో హీరోకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నట్లు ఎక్కడా చూపించలేదు. కమర్షియల్ హంగులు అసలే లేవు. కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా మమ్ముట్టి నటించారు. నటనతో మెప్పించారు.
నార్త్ ఇండియాలోని గ్రామంలో జరిగే సన్నివేశాల్లో మమ్ముట్టి హీరోయిజం ఎలివేట్ చేశారు. ఆ సీన్ మొత్తం బావుంటుంది. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖం అంటే కిశోర్ ఒక్కరే. ఐపీఎస్ చోళన్ పాత్రలో ఆయన కనిపించారు. నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read : 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
చివరగా చెప్పేది ఏంటంటే : 'కన్నూర్ స్క్వాడ్'... ఇది మలయాళ 'ఖాకీ'. కేరళ ప్రజలకు కొత్తగా అనిపించవచ్చు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం కాదు! కార్తీ 'ఖాకీ' చూసిన ప్రేక్షకులకు అసలు కాదు. 'ఖాకీ' థీమ్ తీసుకుని మలయాళ నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి మమ్ముట్టి కొత్త సినిమా చేసినట్లు ఉంటుంది.
Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial