Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?
Matti Kusthi (Gatta Kusthi) Movie Review : మాస్ మహారాజ రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ హీరోగా రూపొందిన సినిమా 'మట్టి కుస్తీ'. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉందంటే?
![Matti Kusthi Movie Review Aishwarya Lekshmi Vishnu Vishal's wrestling based sports drama Gatta Kusthi aka Matti Kusthi Review Rating In Telugu Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/02/f27bc57cb8e1f6cc7695ec7686312cd01669943508821313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చెల్లా అయ్యావు
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, అజయ్, శత్రు తదితరులు
సినిమా రివ్యూ : మట్టి కుస్తీ
రేటింగ్ : 2.25/5
నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్ కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు
ఛాయాగ్రహణం : రిచర్డ్ ఎం నాథన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్
రచన, దర్శకత్వం : చెల్లా అయ్యావు
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
కథానాయిక ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi) రెజ్లర్ (మల్లయోధురాలు) పాత్రలో నటించిన సినిమా 'మట్టి కుస్తీ' (Matti Kusthi Movie). ఇందులో విష్ణు విశాల్ (Vishnu Vishal) కథానాయకుడు. మాస్ మహారాజ రవితేజ సమర్పణలో ఆయనే సినిమా నిర్మించారు. రానా 'అరణ్య'లో ప్రధాన పాత్రలో కనిపించిన విష్ణు విశాల్... ఆ తర్వాత 'ఎఫ్ఐఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'మట్టి కుస్తీ' సినిమాతో విజయం అందుకున్నారా? లేదా? (Matti Kusthi Review)
కథ (Matti Kusthi Movie Story) : కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) రెజ్లర్. బీఎస్సీ చేసింది. షార్ట్ హెయిర్‌తో స్టైలిష్‌గా ఉంటుంది. చెల్లెల్ని ఏడిపించిన (ఈవ్ టీజింగ్ చేసిన) ఆకతాయిలను రోడ్డు మీద పరుగులు పెట్టించి మరీ కొడుతుంది. ఆమె ఏడో తరగతి చదివిందని, నడుము కింద వరకు పొడవాటి జుట్టు ఉంటుందని అబద్దాలు చెప్పి వీర (విష్ణు విశాల్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆడపిల్లలు అణిగిమణిగి ఉండాలని, ఎక్కువ చదువుకుంటే సమస్యలు వస్తాయని పురుషాధిక్య / అహంకార ఆలోచనలు ఉన్న మావయ్య ప్రభావం వీర మీద ఎక్కువ. అతని పెంపకంలో పెరుగుతాడు. ఓ రోజు వీర మీద గుడి దగ్గర కొందరు ఎటాక్ చేయబోతే... కీర్తి వాళ్ళందర్నీ చిత్తు చిత్తుగా కొట్టి భర్తను కాపాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి? వాటికి కారణం ఏమిటి? కీర్తికి వీర నుంచి విడాకుల నోటీసు ఎందుకు వెళ్ళింది? భార్యాభర్తలు ఇద్దరూ మట్టిలో కుస్తీ పోటీకి ఎందుకు రెడీ అయ్యారు? ఆ తర్వాత ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Matti Kusthi Movie Telugu Review) : 'మట్టి కుస్తీ' టైటిల్ చూసి కుస్తీ నేపథ్యంలో సినిమా అనుకోవద్దు. ఇదొక సందేశాత్మక సినిమా. మహిళలకు గౌరవం ఇవ్వాలని, మగవాళ్ళతో సమానంగా చూడాలని చెప్పే సినిమా. పెళ్లి తర్వాత భార్యను భర్త గౌరవంగా చూడాలని చెప్పే సినిమా. హిందీ సినిమా 'థప్పడ్', ఐశ్వర్య లక్ష్మి నటించిన 'అమ్ము' సినిమాల్లో పాయింట్ కూడా ఇంచు మించు ఇదే విధంగా ఉంటుంది.
'మట్టి కుస్తీ' స్పెషల్ ఏంటి'? అంటే... పైన చెప్పిన రెండు సినిమాలు సీరియస్‌గా సాగితే, 'మట్టి కుస్తీ' కామెడీతో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ అంశాలతో కమర్షియల్ పంథాలో రూపొందించడం! హీరోయిన్ క్యారెక్టర్‌ను బలంగా రాసుకోవడం! ఐశ్వర్య లక్ష్మి రోల్ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది. దర్శకుడు ఆమె క్యారెక్టర్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ హీరో క్యారెక్టర్, భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన కాన్‌ఫ్లిక్ట్స్ మీద పెట్టలేదు.
హీరో హీరోయిన్లకు పెళ్ళైనప్పుడే... ఏదో ఒక రోజు నిజం తెలిసిన తర్వాత హీరో ఎలా రియాక్ట్ అవుతాడు? అనేది ఆడియన్స్‌కు ఐడియా వస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సన్నివేశాన్ని దర్శకుడు పూర్తిగా వినోదాత్మకంగా మలిచాడు. ఆ సీన్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అంతకు ముందు ఐశ్వర్య లక్ష్మి కోడి పట్టుకోవడం, భర్తకు నిజం తెలియకూడదని చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. అయితే, ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలను మరీ రొటీన్‌గా రాశారు. అవి బోర్ కొట్టిస్తాయి.
కథలో విషయం ఉన్నప్పటికీ... కథనం అందరూ ఊహించేలా ఉంది. ఇంటర్వెల్ తర్వాత మరీ రొటీన్ టెంప్లేట్‌లో సాగుతుంది. హీరోలో ఈగో లక్షణాలు సరిగా చూపించలేదు. భార్య ఫైట్ చేసిన తర్వాత భర్తలో ఒక్కసారి మార్పు రావడం నవ్వించినా... మావయ్య కోసం భార్యను దూరం చేసుకోవడంలో లాజిక్ లేదని అనిపిస్తుంది. హీరో, మావయ్య మధ్య బాండింగ్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోయిన్ తండ్రిలో వచ్చే మార్పు కూడా ఫేక్‌గా ఉంటుంది. ఈ విధమైన మిస్టేక్స్ చేసి మంచి పాయింట్‌ను రొటీన్ సినిమా చేశాడు దర్శకుడు. కానీ, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ నుంచి మంచి పాటలు, నేపథ్య సంగీతం తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : 'మట్టి కుస్తీ'కి అసలైన హీరో ఐశ్వర్య లక్ష్మీ. కీర్తి పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయి. రెజ్లింగ్ డ్రస్‌లో మోడ్రన్ అమ్మాయిగా... పెళ్ళి, ఆ తర్వాత కొన్ని సీన్స్‌లో శారీలో సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే అదరగొట్టారు. నటిగానూ చక్కటి ఎమోషన్స్ చూపించారు. విష్ణు విశాల్‌ది అల్లరి చిల్లరగా తిరిగే రెగ్యులర్ హీరో తరహా క్యారెక్టర్. దానికి తగ్గట్టు చేశారు. ఇంటర్వెల్ ఫైట్‌లో ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్ బావున్నాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక ఫైట్‌లో అజయ్, విష్ణు విశాల్ మధ్య సీన్ కూడా బావుంటుంది. శత్రు రెగ్యులర్ రొటీన్ రోల్ చేశారు. కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, కరుణాస్, మునీష్ కాంత్... తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఎందుకో వాళ్ళ నటనలో ఎక్కువ తమిళ నేటివిటీ కనిపించింది.
Also Read : వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ఆడ, మగ అంటూ వేర్వేరుగా చూడకూడదని, అందరూ సమానమేనని చెప్పే సినిమా 'మట్టి కుస్తీ'. కాన్సెప్ట్ బావుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కూడా! ఇంటర్వెల్‌లో కామెడీ డోస్ అయితే హై ఇస్తుంది. కానీ... సెకండాఫ్‌ను మరీ రొటీన్‌గా తీయడంతో డిజప్పాయింట్ అవుతాం. ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్, విష్ణు విశాల్ కామెడీ టైమింగ్ బావున్నా... మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళను, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఈ 'మట్టి కుస్తీ' ఆకట్టుకుంటుంది. సగటు ప్రేక్షకులకు ఫస్టాఫ్ నచ్చే అవకాశాలు ఎక్కువ. సినిమాలో తమిళ నేటివిటీ మరీ ఎక్కువ ఉంది. అందువల్ల, తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చవచ్చు.
Also Read : 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)