Kalapuram Movie Review - 'కళాపురం' రివ్యూ : అందరూ కళాకారులే - సినిమా ఎలా ఉందంటే?
Telugu Movie Kalapuram Review : 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' తర్వాత దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా 'కళాపురం'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.
కరుణ కుమార్
'సత్యం' రాజేష్, సంచిత పూనాచా, 'చిత్రం' శీను, జనార్ధన్, ప్రవీణ్ యండమూరి తదితరులు
సినిమా రివ్యూ : కళాపురం
రేటింగ్ : 2/5
నటీనటులు : 'సత్యం' రాజేష్, సంచిత పూనాచా, 'చిత్రం' శీను, జనార్ధన్, ప్రవీణ్ యండమూరి, రుద్ర ప్రతాప్, కాషిమా రఫీ, సనా, 'జబర్దస్త్' అప్పారావు, ఫైమా, తదితరులు
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ జీకే
సంగీతం: మణిశర్మనిర్మాణ సంస్థలు : జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : రజనీ తాళ్లూరి
రచన, దర్శకత్వం : కరుణ కుమార్
విడుదల తేదీ: ఆగస్టు 26, 2022
'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్'తో దర్శకుడు కరుణ కుమార్ రా అండ్ రస్టిక్ సినిమాలు బాగా తీస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. మూడో సినిమాతో ఆయన రూట్ మార్చారు. గ్రామీణ వాతావరణం, చిత్రసీమ నేపథ్యంలో వినోదాత్మక సినిమా తీశారు. అది 'కళాపురం' (Kalapuram Movie). 'అందరూ కళాకారులే...' అనేది ఉపశీర్షిక. 'సత్యం' రాజేష్ హీరోగా (Satyam Rajesh As Hero) నటించారు. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Kalapuram Movie Story) : కుమార్ ('సత్యం' రాజేష్) ఓ అసిస్టెంట్ డైరెక్టర్. నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, అవకాశం రావడం లేదు. నటిగా ప్రయత్నాలు చేస్తున్న ఇందు (కాషిమా రఫీ)తో అతను ప్రేమలో ఉంటాడు. అవకాశాలు, లగ్జరీ లైఫ్ కోసం కుమార్ కంటే డబ్బులు, పేరు ఉన్న మరొకరితో సంబంధం పెట్టుకుంటుంది. కుమార్‌కు విషయం తెలిసి అడిగితే తీసి పారేస్తుంది. బ్రేకప్ బాధలో ఉన్న కుమార్ సినిమాలు వదిలేసి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటాడు. ఇరానీ ఛాయ్ కేఫ్‌లో తన రూమ్మేట్, హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న స్నేహితుడు (ప్రవీణ్ యండమూరి)కి విషయం చెబుతాడు. అప్పుడు వెనుక కుర్చీలో ఉన్న అప్పారావు (జనార్ధన్) తమ ఊరు కళాపురంలో సినిమా తీయమని, డబ్బులు తాను పెడతానని చెబుతాడు. అతని మాట నమ్మి కళాపురం వెళ్లిన కుమార్‌కు పెద్ద షాక్ తగులుతుంది. ఆ ఊరు ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే మరణించడంతో ఉప ఎన్నిక వస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కుమార్ దగ్గర ఉన్న డబ్బులకు లెక్కలు చూపించమని పోలీసులు కోరతారు. అప్పారావుకు ఫోన్ చేస్తే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. రాత్రుళ్ళు హైదరాబాద్ పార్కుల్లో నిద్రపోయే అప్పరావుకు సినిమా ప్రొడ్యూస్ చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మోసం చేశాడా? మరొకటా? అప్పారావు ఇచ్చిన డబ్బులు పోలీసులు తీశాక చేతిలో చిల్లిగవ్వ లేని కుమార్ కళాపురం ఊరిలో, అక్కడి ప్రజలతో సినిమా ఎలా తీశాడు? కళాపురంలో కుమార్‌లో స్ఫూర్తి నింపిన శారద (సంచిత పూనాచ) ఎవరు? చివరకు, కుమార్ తీసిన సినిమా విడుదలైందా? లేదా? కుమార్‌కు తెలియకుండా అతని వెనుక ఏం జరిగింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Kalapuram Review) : 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాలతో తనపై పడిన రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ మేకర్ ముద్రను కరుణ కుమార్ పోగొట్టుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు. పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక చిత్రం తీయాలని ఆయన చేసిన ప్రయత్నం బావుంది. ఆ ఆలోచన మంచిదే. అయితే, ఆలోచన పేపర్ మీద నుంచి స్క్రీన్ మీదకు వచ్చే క్రమంలో కొత్తదనం కొరవడింది.
'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల్లో చూపించిన కొత్తదనం ఇతర దర్శకుల మధ్య కరుణ కుమార్‌ను కాస్త భిన్నంగా నిలిపింది. 'కళాపురం'లో ఆ విధమైన కొత్తదనం చూపించలేదు. అవకాశాల కోసం ప్రయత్నించే సహాయ దర్శకులకు ఎటువంటి సందర్భాలు ఎదురవుతాయి? పరిశ్రమలో కొంత మంది అమ్మాయిలు అవకాశాల కోసం ఏం చేస్తారు? వంటివి కొన్ని సినిమాల్లో వచ్చాయి. అందుబాటులో ఉన్న నటీనటులు, పరిమిత వనరులతో సృజనాత్మక చూపిస్తూ సినిమాలు తీసిన యువకుల ప్రయాణాన్ని 'ఒక విచిత్రం', 'సినిమా బండి'లో చూశాం. అందువల్ల, ఆ పాయింట్ కూడా కొత్తగా అనిపించదు. పల్లెటూరి వాతావరణాన్ని మరోసారి స్క్రీన్ మీద చక్కగా చూపించారు కరుణ కుమార్.
'కళాపురం' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారంటే నమ్మడం కొంచం కష్టమే. పాటల్లో ఆయన మార్క్ కనిపించలేదు. కానీ, కథకు తగ్గట్టు పాటలు అందించారు. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 'సత్యం' రాజేష్ అండ్ కో ఉన్న సినిమాకు అంత ఖర్చు పెట్టడం ఎక్కువ అని చెప్పుకోవాలి.
నటీనటులు ఎలా చేశారు? : హీరోగా కంటే పాత్ర మాత్రమే కనిపించేలా 'సత్యం' రాజేష్ నటించారు. నటుడిగా అనుభవం ఉండటం వల్ల ఇటువంటి పాత్రలో నటించడం ఆయనకు పెద్ద కష్టం ఏమీ కాదు. తనలో కమెడియన్ మాత్రమే కాదు, మంచి నటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నారు. నిర్మాత పాత్రలో నటించిన జనార్ధన్ ఆకట్టుకుంటారు. క్యారెక్టర్‌కు ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. నటుడిగా ఆయనకు మరిన్ని అవకాశాలు రావచ్చు. హీరోయిన్ సంచిత పూనాచా అభినయం, ఆహార్యం బావున్నాయి. 'చిత్రం' శీను, ప్రవీణ్ యండమూరి, రుద్ర ప్రతాప్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. 'జబర్దస్త్'లో పాపులర్ అయిన ఫైమా, అప్పారావు ఒక్కో సన్నివేశంలో కనిపించారు.
Also Read : ఓదెల రైల్వే స్టేషన్ రివ్యూ : శోభనం తర్వాత రోజు పెళ్లి కుమార్తెను చంపేస్తున్నది ఎవరు?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'కళాపురం'లో 'సత్యం' రాజేష్ తీసిన 'నాగేశ్వరి' సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తాను తీసింది గొప్ప సినిమా కాదని, ఎందుకు హిట్ అయ్యిందని హీరో అడుగుతుంటాడు. నిర్మాతలు కథ ఓకే చేసిన తర్వాత తమది గొప్ప కథా? కాదా? అని కరుణ కుమార్ విశ్లేషణ చేసుకుంటే మరిన్ని మంచి సన్నివేశాలు, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించి ఉండేవారు. ఆల్రెడీ వచ్చిన కథలను మళ్ళీ కొత్తగా చెప్పి విజయాలు అందుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాల జాబితాలో 'కళాపురం' మాత్రం ఉండదు. కళాకారులు ఉంటే సరిపోదు, కథ కూడా ముఖ్యమే. అయితే, కొన్ని సన్నివేశాలు... లీడ్ రోల్స్ చేసిన ఆర్టిస్టుల నటన అభినందించేలా ఉన్నాయి.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?