Dear Movie Review - డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Dear Review 2024: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్'. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్. తెలుగులో ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
ఆనంద్ రవిచంద్రన్
జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్యా రాజేష్, కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని తదితరులు
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్' (Dear Movie). కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులలో తనకు అంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. గురక నేపథ్యంలో 'డియర్' తీయడం... ఐశ్వర్యా రాజేష్ కథానాయక కావడం... సిమిలర్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ 'గుడ్ నైట్' విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తి ఎదురు చూశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Dear Movie Story): అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) న్యూస్ రీడర్. టీవీలో ఫేస్ ఫ్రెష్ గా కనిపించడం కోసం ప్రతి రోజూ తప్పకుండా ఎనిమిది గంటలు నిద్ర పోతాడు. చిన్న శబ్దం వినిపడినా నిద్ర లేస్తాడు. దీపిక (ఐశ్వర్యా రాజేష్)తో అతడికి పెళ్లి జరుగుతుంది. నిద్రపోతే భయంకరంగా గురక పెట్టే అలవాటు ఆమెకు ఉంది. హనీమూన్ టూరులో, పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు ఇద్దరికీ భారంగా గడుస్తుంది. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తారు... రాత్రి ఒకరు నిద్రపోతే మరొకరు మెలకువగా ఉండాలని! మెలకువగా ఉన్నవారు మరుసటి రాత్రి నిద్రపోతే, ఇంకొకరు మెలకువగా ఉండాలని!
నిద్రలేకుండా ఆఫీసుకు వెళ్లిన అర్జున్... కీలకమైన ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు బాత్ రూంలో నిద్రపోవడంతో ఉద్యోగంతో పాటు పరువు పోతుంది. ఆ తర్వాత దీపికాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అమ్మ (రోహిణి), అన్నయ్య (కాళి వెంకట్) చెప్పినా వినడు. మరోవైపు విడాకులు ఇవ్వనని, భర్తతో కలిసి జీవించాలని కోరుకుంటున్నట్టు దీపిక చెబుతుంది. విడాకుల కేసు కోర్టులో ఉండగా దీపిక ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అర్జున్ ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? అతడి తండ్రి కథ ఏమిటి? అర్జున్, దీపిక మళ్లీ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Dear Movie Review Telugu): గురక పెట్టే భార్య తనకు వద్దని కోర్టులో కేసు వేసిన అర్జున్ మీద ఫస్ట్ హియరింగ్ తర్వాత అన్నయ్య చరణ్ లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. కట్ చేస్తే... 'నీ కళ్లు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని' సాంగ్ వస్తుంది. చెంప మీద బీర్ బాటిల్ పెట్టుకుని హీరో కనిపిస్తాడు. కోర్టులో జరిగిన సన్నివేశానికి, తర్వాత వచ్చిన పాట & సన్నివేశానికి సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదు కదూ! గురకకు, ఈ సినిమా కథకు సైతం సంబంధం లేదు. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయని, అయితే వాటిని అధిగమించి జీవిత భాగస్వామిని అంగీకరించడమే జీవితమని చెప్పే చిత్రమిది.
'డియర్' ట్రైలర్ విడుదలైనప్పుడు 'గుడ్ నైట్'తో కంపేరిజన్స్ వచ్చాయి. ఓ కొత్త సినిమాకు ఉండే అడ్వాంటేజ్ అప్పుడే మిస్ అయ్యిందీ సినిమా. 'గుడ్ నైట్'లో హీరో గురక పెడితే... 'డియర్'లో హీరోయిన్ గురక పెడుతుంది. గురక వల్ల సంసార జీవితంలో సమస్యలు వస్తాయని ప్రేక్షకుడు ఊహిస్తాడు. అతడి ఊహకు అందని విధంగా సన్నివేశాలు, కథనం ఉన్నప్పుడు మాత్రమే సినిమా ఆసక్తిగా ముందుకు కదులుతుంది. దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ ఆ తరహాలో సినిమాను ముందుకు తీసుకు వెళ్లడంలో దారుణంగా విఫలమయ్యారు.
Also Read: శ్రీరంగనీతులు రివ్యూ: నీతులు చెప్పేటందుకు మాత్రమే బావున్నాయా? లేదంటే సినిమా చూసేందుకూ బావుందా?
ఆల్రెడీ ఆడియన్స్ గురక కాన్సెప్ట్ చూసేశారు. పోనీ, గురక వల్ల వచ్చే సన్నివేశాలు గానీ... ఆ తర్వాత కథ, కథనం గానీ ఏమంత ఆసక్తిగా లేవు. అసలు ఈ సినిమాకు ప్రధాన సమస్య గురక కాదు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం! 'ఒక న్యూస్ రీడర్ అయ్యి ఉండి గురకను సాకుగా చూపించి విడాకులు అడుగుతున్నావ్ ఏంటి?' అని హీరోని జడ్జ్ ప్రశ్నిస్తారు. నిజమే కదా అని ప్రేక్షకుడు ఆలోచిస్తే అసలు హీరో వాదనలో బలం లేదని అనిపిస్తుంది. బహుశా... దర్శకుడు కూడా ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగాలని ఆ సీన్, డైలాగ్ రాసి ఉంటారు. అది రివర్స్ అయ్యింది. గురక మీద ఫస్టాఫ్ అంతా నడిచిపించిన దర్శకుడు... ఇంటర్వెల్ తర్వాత, ముఖ్యంగా పతాక సన్నివేశాలకు ముందు హీరో తల్లిదండ్రుల మీదకు దృష్టి సారించారు. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'తో పాటు కొన్ని సినిమాల్లో ఆ తరహా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ పేరెంట్స్ ట్రాక్ కూడా కొత్తగా లేదు. భావోద్వేగాలు సైతం పండలేదు. అంతకు ముందు సన్నివేశాల్లో కామెడీ కూడా వర్కవుట్ అవ్వలేదు.
దర్శకుడు ఎంపిక చేసుకున్న కథ, కథనం, సన్నివేశాల్లో బలం లేదు. దాంతో హీరో హీరోయిన్లు జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్యా రాజేష్ తమ ప్రతిభ చూపించడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. సన్నివేశాలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు తప్ప నటనలో అద్భుతాలు చూపించిన మూమెంట్స్ ఏమీ లేవు. రోహిణి నటించడం వల్ల కొన్ని సన్నివేశాలకు హుందాతనం వచ్చింది. హీరో అన్నయ్యగా కాళీ వెంకట్ నటన బావుంది. ఆయన సీన్లు మాత్రమే కొంత నవ్విస్తాయి. హీరోగా కంటే సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ మెరిశారు. రెండు పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటల్లో సినిమాటోగ్రఫీ బావుంది.
'డియర్'లో హీరోయిన్ గురక పెట్టడం మొదలు పెడితే... ఆమెను నిద్ర లేపడానికి హీరోకి కొంత సమయం పడుతుంది. ఆమె గురక సంగతి ఏమో గానీ దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించిన తీరు వల్ల థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిద్ర వచ్చేలా ఉంది. కాన్సెప్ట్ బావుంది. కానీ, సినిమాలో కామెడీ లేదు. ఎంగేజ్ చేసే సీన్లు లేవు. కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్ లేవు. గురక తప్పిస్తే... కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు రొటీన్.
Also Read: బడే మియా చోటే మియా రివ్యూ: వరదరాజ మన్నార్‌తో బాలీవుడ్ హీరోల ఢీ - ఎలా ఉందంటే?