Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Maoist Surrender Rehabilitation 2025:మావోయిస్టు ఉద్యమాన్ని విడిచి పెట్టి వందల మంది జనం బాట పడుతున్నారు. ఇలా లొంగిపోయిన తర్వాత వాళ్లంతా ఎక్కడ ఉంటున్నారు? వారి జీవనోపాధికి ఏం చేస్తున్నారో చూద్దాం.

Maoist Surrender Rehabilitation 2025: భారతదేశంలో దశాబ్దాలుగా అంతర్గత భద్రతకు పెను సవాలు విసిరిన లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ఉద్యమం ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు ఇప్పటికే చాలా సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారికి రెండు ఆప్షన్‌లు ఇచ్చారు. ఒకటి లొంగిపోవడం రెండోది చచ్చిపోవడం అని తెగేసి చెప్పేశారు. అడవులను జల్లెడ పట్టేసి మావోయిస్టులను దెబ్బ తీస్తున్నారు. ఉద్యమం క్షీణ దశలో ఉండటం భద్రతా బలగాలు దూసుకొస్తుండటంతో ప్రమాదాన్ని గ్రహించిన చాలా మంది మావోయిస్టులు తుపాకులు వదిలేస్తున్నారు. జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఉద్యమానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు.
లొంగుబాటు కార్యక్రమం 2025లో ఊహించని వేగాన్ని పుంజుకుంది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 15 వందల మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి పోలీసులకు లొంగిపోయారు. ఇది కేవలం భద్రతా బలగాల ప్రయత్నమే కాకుండా సమగ్ర ప్రభుత్వ పునరావాస విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారిలో మార్పులకు కారణమయ్యాయి. ఈ విధానాలు ఒకప్పుడు 'రెడ్ జోన్'లుగా పిలిచే అడవుల్లో ప్రశాంతతకు మారుపేరుగా మారుతున్నాయి.
అగ్రనేతల లొంగుబాటుతో ఎదురు దెబ్బలు:
మావోయిస్టు ఉద్యమంలో 2025లో వచ్చిన మార్పునకు ప్రభుత్వ విధానాలతో పాటు మావోయిస్టుల్లో అంతర్గత విభేదాలు కూడా కారణమయ్యాయి. వీటి కారణంగానే కీలక నాయకులు లొంగిపోవడం మొదలైంది.
అక్టోబర్ 17, 2025న ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న సహా 210 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 111 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు. వీళ్లందరిపై ఏకంగా రూ. 9.18 కోట్ల రివార్డు ఉంది. అక్టోబర్ 14, 2025న మావోయిస్టు కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, 61 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 103 మంది లొంగిపోయారు. అక్టోబర్ 29న బిజాపూర్‌లో 51 మంది, అక్టోబర్ 26న కాంకర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.
మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రాలు:
2025లో లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఈ లొంగుబాటు కార్యక్రమానికి ప్రధాన కేంద్రంగా మారింది. తెలంగాణలో ములుగు జిల్లా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మహారాష్ట్రలో గడ్చిరోలీ జిల్లా లొంగుబాటుకు మరో ప్రధాన కేంద్రంగా ఉంది.
మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి రావడానికి ప్రభుత్వం అందిస్తున్న సమగ్రమైన పునరావాస ప్యాకేజీ బాగా ఆకర్షిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2025లో ప్రారంభించిన పునః మార్గం పథకం లొంగిపోయిన వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది.
• తక్షణ సహాయం: లొంగిపోయిన వెంటనే ప్రతి మావోయిస్టుకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సహాయం అందిస్తారు.
• స్టైపెండ్: మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 10,000 స్టైపెండ్ అందిస్తారు. ఉద్యోగం పొందిన తర్వాత ఇది నిలిపివేస్తారు.
• ఫిక్స్డ్ డిపాజిట్: రూ. 1.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌ను మూడేళ్ల పాటు ఉంచుతారు, మంచి ప్రవర్తన ఆధారంగా ఈ సొమ్మును తర్వాత తిరిగి పొందవచ్చు.
• రుణాలు: రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రివార్డు ఉన్న మావోయిస్టులకు రూ. 5 లక్షల రాయితీ వడ్డీ రేటుతో రుణం అందుబాటులో ఉంటుంది.
• వివాహ ప్రోత్సాహకం: లొంగిపోయిన మూడేళ్లలోపు వివాహం చేసుకుంటే అదనంగా రూ. 1 లక్ష సహాయం అందుతుంది.
• నివాస స్థలం: గ్రామీణ ప్రాంతాల్లో 1 హెక్టార్ వ్యవసాయ భూమి లేదా పట్టణ ప్రాంతాల్లో 1,742 చదరపు అడుగులు నివాస స్థలం ప్రభుత్వాలు అందిస్తున్నాయి.
• ప్రత్యామ్నాయంగా నగదు: భూమి వద్దు అనుకుంటే, దానికి బదులుగా రూ. 2 లక్షల నగదు స్వీకరించే అవకాశం ఉంది.
• గృహ నిర్మాణం: అదనంగా, రూ. 1.5 లక్షల గృహనిర్మాణ సహాయం కూడా అందుబాటులో ఉంటుంది.
వృత్తిపరమైన శిక్షణ :
పునరావాస కార్యక్రమాలలో భాగంగా, వ్యక్తిగత ఆసక్తి ఆధారంగా వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. బిజాపూర్‌లోని పునరావాస కేంద్రంలో 58 మంది మావోయిస్టులు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్నారు. టైలరింగ్, ఎలక్ట్రీషియన్, డ్రైవింగ్, ఆగ్రో-ఫార్మా, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. స్వయం ఉపాధి లేదా వ్యాపారం ప్రారంభించడానికి రూ.1.5 లక్షల నిధులను రెండు దశల్లో అందిస్తారు, బ్యాంక్ రుణాలకు ఫిక్స్డ్ డిపాజిట్ హామీగా ఉపయోగపడుతుంది.
మావోయిస్టులు ఎందుకు తిరిగి వస్తున్నారు?
1. అభివృద్ధి ఆకర్షణ: కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ 'నియాద్ నెల్లన్నార్' వంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల అడవి ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, నీరు, ఆసుపత్రులు అందుబాటులోకి రావడం వారిని ఆకర్షించింది.
2. అంతర్గత కలహాలు: సంస్థలో అంతర్గత కలహాలు, అశాంతి, నాయకత్వ వైఫల్యం, బలవంతపు అజ్ఞాత వాసంతో విసిగిపోవడం.
3. పోలీసుల చొరవ: తెలంగాణ పోలీసులు 'పోరు కన్నా ఊరు మిన్నా – మన ఊరికి తిరిగి రండి' అనే అవగాహన కార్యక్రమం కింద మావోయిస్టులను ఆకర్షిస్తున్నారు.
4. భద్రత -ఆరోగ్యం: లొంగిపోయిన వారికి ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఆరోగ్య ప్రయోజనాలు, ఉచిత విద్య.
ఆయుధ లొంగుబాటుకు అదనపు నష్టపరిహారం:
హింసా మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ప్రోత్సహిస్తూ, లొంగిపోయే టైంలో అప్పగించిన ఆయుధాలకు గణనీయమైన అదనపు పరిహారాన్ని అందిస్తుంది. LMGకి రూ.5 లక్షలు, AK-47కి రూ. 1.5 లక్షలు, SLRకి రూ.75,000 వరకు పరిహారం ఇస్తారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకం వారు తమ హింసాత్మక గతాన్ని వదిలిపెట్టడానికి ఒక స్పష్టమైన సంకేతంగా పనిచేస్తుంది.
120 రోజుల్లో పునరావాస హామీ
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ఆలస్యం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. దీని కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, SP కార్యదర్శిగా ఉండే పునరావాస కమిటీలు ఏర్పాటు చేసింది. పర్యవేక్షణ కోసం ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక ఐడీ కేటాయించి, డిజిటల్ పోర్టల్ ద్వారా పురోగతి పర్యవేక్షిస్తారు. బస్తర్, బిజాపూర్ వంటి ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ లొంగిపోయిన వారిని మూడు నుంచి ఆరు నెలల పాటు ఉంచి, భద్రత, మానసిక కౌన్సెలింగ్, చట్టపరమైన సహాయం అందిస్తారు.
శాంతి వైపు అడుగులు
2025లో నమోదైన లొంగుబాటుల సంఖ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేలల్లో ఉండే దళాల సంఖ్య ఇప్పుడు వందలకు పడిపోయిందని అంటున్నారు. అందుకే బహుముఖ వ్యూహాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు లొంగిపోయిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తూనే మరోవైపు తాక్కొని ఉద్యమం కోసం నిలబడిన వారిని కాల్చి పడేస్తున్నారు. మార్చి 2026 నాటికి అడవులను క్లీన్ చేయాలనే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జల్లెడ పడుతున్నాయి.





















