TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం తిరుగుతోంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ స్టెప్ ఏమై ఉంటుందనే చర్చ నడుస్తోంది.

TTD Adulterated Ghee Case: తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో వాడేందుకు కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందనే కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం జరిగిన అరెస్టుతో ఇందులో కీలక వ్యక్తులను కూడా విచారిస్తారనే ప్రచారం జోరందుకుంది. అరెస్టు అయిన వ్యక్తి టీటీడీ మాజీ ఛైర్మన్‌కు మాజీ పీఏ అరెస్టు కావడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తొలిసారి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి అరెస్టు
వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా విచారణ సాగుతున్న కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు రాజకీయాలకు నేరుగా సంబంధం లేని వ్యక్తులను మాత్రమే అరెస్టు చేసి విచారించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇది అపన్న నేపథ్యం
టీటీడీ మాజీ ఛైర్మన్, రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పని చేసిన అప్పన్ననను సిటి బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. విజయనగరానికి చెందిన అప్పన్న వైవీ సుబ్బారెడ్డి వద్ద 2014 నుంచి 2024 వరకు పీఏగా పని చేశారు. ఆయనే ఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రోటోకాల్ ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టిన వ్యక్తిని ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో అరెస్టు చేయడం సంచలనంగా మారింది. అప్పన్నను ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు విచారించారు. ఆ విచారణలో ఆయన సమాధానాలు సరిగా చెప్పలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి విచారణకు పిలుస్తారనే క్రమంలో అప్పన్న హైకోర్టును ఆశ్రయించి సిట్ విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే దీనిపై సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ సాగేలా వాదనలు వినిపించారు. కోర్టు సిట్‌కు అనుకూలంగా నిర్ణయం వెల్లడించింది. దీంతో విచారణ తిరిగి ప్రారంభించిన అధికారులు రెండు రోజుల నుంచి అప్పన్నను తిరుపతిలో ప్రశ్నిస్తున్నారు. ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
నెక్ట్స్ టార్గెట్ సుబ్బారెడ్డియేనా?
సుబ్బారెడ్డితో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తి నెలకొంది. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే తిరుమలకు మూడు కంపెనీల నుంచి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని సిట్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయా కంపెనీల ప్రతినిధులను విచారించారు. ఇప్పుడు అప్పన్నను కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తారు. దీంతో ఆయన చెప్పే విషయాలు ఆధారంగా సుబ్బారెడ్డిని కూడా విచారిస్తారా అనే అనుమానం అందరిలో ఉంది. ముందు అప్పన్నను కస్టడీలోకి తీసుకున్న తర్వాత కీలక పరిణాలు జరుగుతాయని అంటున్నారు.





















