Bade Miyan Chote Miyan Review: బడే మియా చోటే మియా రివ్యూ: వరదరాజ మన్నార్‌తో బాలీవుడ్ హీరోల ఢీ - ఎలా ఉందంటే?
Bade Miyan Chote Miyan: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా ‘బడే మియా చోటే మియా’ ఎలా ఉంది? పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ లెవల్ విలన్‌గా కనిపించారా?
అలీ అబ్బాస్ జాఫర్
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్
Bade Miyan Chote Miyan Review in Telugu
సినిమా రివ్యూ: బడే మియా చోటే మియా
రేటింగ్: 2/5
నటీనటులు: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలాయా ఎఫ్ తదితరులు
ఛాయాగ్రహణం: మార్సిన్ లస్కావీక్
రచన: అలీ అబ్బాస్ జాఫర్, ఆదిత్య బసు
పాటలు: విశాల్ మిశ్రా
నేపథ్య సంగీతం: జూలియస్ పాకియం
నిర్మాతలు: జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్సికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా
దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్
విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024
బాలీవుడ్‌లో 2024 సంవత్సరానికి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి ‘బడే మియా చోటే మియా’. యాక్షన్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా కనిపించిన ఈ సినిమాలో వీరికి ప్రతినాయకుడిగా ‘సలార్’లో రాజమన్నార్‌గా అలరించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇంత క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కినప్పటికీ ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో రిలీజ్‌ను కూడా ఒక రోజు వాయిదా వేశారు మేకర్స్. కానీ ఈ కాంబినేషన్ క్రేజ్‌కి, యాక్షన్ జానర్‌కి కాస్త పాజిటివ్ టాక్ తోడయితే వసూళ్లు ఒక రేంజ్‌లో వస్తాయి. మరి సినిమా ఎలా ఉంది?
కథ: భారత సైన్యానికి సంబంధించిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఒక చోట నుంచి మరో చోటికి తరలిస్తుండగా ఒక ముసుగు మనిషి దాన్ని దొంగలిస్తాడు. ఆ తర్వాత 72 గంటల్లోనే భారత దేశాన్ని అంతం చేస్తానని ఆర్మీకి వీడియో మెసేజ్ పంపిస్తాడు. అతన్ని ఆపడానికి సైన్యం బయట వ్యక్తులు అవసరం అని కోర్టు మార్షల్ అయిన కెప్టెన్ ఫిరోజ్ అలియాస్ ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), కెప్టెన్ రాకేష్ అలియాస్ రాకీలని (టైగర్ ష్రాఫ్) తిరిగి రప్పిస్తారు. ఇంతకీ ఆ ముసుగు మనిషి తీసుకెళ్లిన టెక్నాలజీ ఏంటి? ఫ్రెడ్డీ, రాకీ దాన్ని కాపాడారా? ఈ మొత్తం కథలో కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ మధ్య బాలీవుడ్‌లో దేశభక్తి ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఫైటర్’, ‘యోధ’ సినిమాలు ఈ జోనర్‌లో విడుదల అయ్యాయి. వీటిలో ‘ఫైటర్’ పర్వాలేదనిపించగా, ‘యోధ’ బోల్తా కొట్టేసింది. ‘బడే మియా చోటే మియా’ కూడా ఈ తరహా సినిమానే. కానీ ఈసారి సైన్స్ ఫిక్షన్ టచ్ యాడ్ చేశారు. ఈ సినిమా చాలా నార్మల్‌గా స్టార్ట్ అవుతుంది. మొదటి 40 నిమిషాలు పూర్తిగా యాక్షన్ సీన్లే ఉంటాయి. అవి తెర మీద చూడటానికి చాలా బాగుంటాయి కానీ నిడివి మాత్రం చాలా ఎక్కువ. స్క్రీన్‌పై అలా సాగుతూనే ఉంటాయి. దీంతో వారి కష్టం తెరపైన కనిపిస్తున్నా మనం థ్రిల్ ఫీలవ్వలేం.
సినిమా ఫస్టాఫ్‌లో సగం పాత్రల పరిచయానికే సరిపోతుంది. ఎప్పుడైతే స్టోరీ లండన్‌కు షిఫ్ట్ అవుతుందో అక్కడ నుంచి కాస్త ఊపు అందుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. కానీ సెకండాఫ్ మొదలయ్యాక గ్రాఫ్ ఒక్కసారిగా కిందికి పడిపోతుంది. సమయం సందర్భం లేకుండా టైగర్ ష్రాఫ్ చేసే కామెడీ విసిగిస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఒకట్రెండు చోట్ల మాత్రమే టైగర్ ష్రాఫ్ వేసే పంచులు నవ్విస్తాయి. సినిమాలో పాటలు కథకు అడ్డం పడతాయి. క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. కానీ నిడివి చాలా ఎక్కువ. కేవలం ఈ ఒక్క యాక్షన్ సీన్ నిడివే దాదాపు అరగంటకు పైగా ఉంటుంది. రెండు గంటల 45 నిమిషాల సినిమాలో రెండు గంటల వరకు యాక్షన్ సీన్లే ఉంటాయి. మిగతా 45 నిమిషాల్లో చాలా జాగ్రత్తగా కథని సర్దారు.
విలన్ పాత్రపై సానుభూతి కలిగేలా రాసుకోవడం పెద్ద మైనస్. యాక్షన్‌లో ఇతర జోనర్లకు అది వర్కవుట్ అవుతుందేమో కానీ ఇలాంటి పేట్రియాటిక్ సినిమాల్లో అలా ఉంటే కష్టం. ఈ సినిమాలో ఉన్న అన్ని పాత్రల్లో కాస్త క్యారెక్టర్ ఆర్క్, డెప్త్ ఉన్నది పృథ్వీరాజ్ పోషించిన కబీర్ పాత్రకే. హీరోలు ఇద్దరూ తమకు ప్రాణ స్నేహితుడు అని చెప్పుకునే పాత్రని చంపే సీన్ ఒకటి ఉంటుంది. ఎంత చెడ్డవాడైనా ప్రాణ స్నేహితుడ్ని చంపేటప్పుడు కాస్త బాధ కలగడం సహజమే. కానీ ‘కుక్కకి పిచ్చి ఎక్కువ అయింది’ అని ఆ పాత్రని చంపడమే చెప్పవచ్చు హీరోల క్యారెక్టర్స్‌ని ఎంత బలంగా రాసుకున్నారో.
జూలియస్ పాకియం నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్లను ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. మార్నిస్ లస్కావీక్ ఛాయాగ్రహణం ఓకే ఓకే. ఈ సినిమాకు 3డీ టెక్నాలజీ అనవసరం. ఎక్కడా 3డీ ఎఫెక్ట్‌లు సరిగ్గా లేవు.
Also Read: లవ్ గురు రివ్యూ: భార్య ప్రేమ కోసం రోమియోగా మారిన విజయ్ ఆంటోనీ - కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే... సినిమా మొత్తంలో నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉన్నది కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌కే. కబీర్ పాత్రలో పృథ్వీరాజ్ చాలా బాగా నటించారు. గతంలో ఇంతకంటే మంచి పాత్రల్లో పృథ్వీరాజ్ నటించినా... చుట్టుపక్కల ఉన్నవాళ్లకు ఏ మాత్రం పెర్ఫార్మ్ చేయకపోవడమో, వారి పాత్రలకు స్కోప్ లేకపోవడం వల్లనో కానీ బాగా ఎలివేట్ అయ్యారు. నో ఎమోషన్, ఓన్లీ యాక్షన్ పాత్రల్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానుషి చిల్లర్‌కు కూడా యాక్షన్ సన్నివేశాల్లో స్కోప్ ఉన్న పాత్ర లభించింది. మిగతా పాత్రలు పోషించిన వారు బాగానే నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కథతో సంబంధం లేదు జస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు అనుకుంటే ఈ ‘బడే మియా చోటే మియా’ ట్రై చేయవచ్చు. 3డీ వెర్షన్ కంటే 2డీ వెర్షన్ చూడటమే బెటర్.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?