(Source: ECI | ABP NEWS)
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు కంటిన్యూ అవుతున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మొథా తుపాను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన అల్లకల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తుపాను వాయుగుండంగా మారి తెలంగాణ వైపు వెళ్లిపోయినా వర్షాల ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. అందుకే అప్రమత్తమైన అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఫ్లాష్‌ఫ్లడ్‌కు అవకాశం ఉందని అంటున్నారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, మచిలీపట్నం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంకా 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని అంటున్నారు. జోరు వానలు, అకస్మాత్తుగా కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. రిస్క్ తీసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. అవసరం అయితే కానీ ఎవరూ బయటకు రావద్దని హితవు పలుకుతున్నారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప్రభావం ఇవాళ రేపు ఉంటుందని తర్వాత నార్మల్ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలకు ఇప్పటికే పలు నదులు, వాగులు వంకలు పొంగుతున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. పులిచింతల రిజర్వాయర్ కు వరద ఇన్ ఫ్లో 5లక్షల వరుకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు 4.9లక్షల క్యూసెక్కులు నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని వలన ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తారు. లోతట్టు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంకా చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. చెరువులు వాగులు పొంగుతున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే వంద కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిగతా జిల్లాల్లో కూడా తుపాను అంచనాలు వేయడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. వర్షాలు లేని వరద ముంపు ఎక్కువగా లేని ప్రాంతాల్లో అంచనాలు షురూ చేశారు. వాన గండం పొంచి ఉండటంతో ఇంకా సహాయక శిబిరాలను కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అధికారులు చేస్తున్నారు.
తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2వేలకుపైగా శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు రెండు లక్షల మందిని అక్కడకు చేర్చింది. వారికి ఆహారం, పాతిక కేజీల బియ్యం, మూడు వేలరూపాయల నగదు, నిత్యావసర సరకులు ఇచ్చారు. వారం రోజులుగా వేటకు వెళ్లని కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు, నగదు కూడా అందజేయనున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లేకుంటే భారీ ప్రాణ నష్టాన్ని చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.





















