Sriranga Neethulu Movie Review - శ్రీరంగనీతులు రివ్యూ: నీతులు చెప్పేటందుకు మాత్రమే బావున్నాయా? లేదంటే సినిమా చూసేందుకూ బావుందా?
Sriranga Neethulu Review In Telugu: సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'శ్రీరంగ నీతులు'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్
సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం, వాసు ఇంటూరి, దేవి ప్రసాద్ తదితరులు
Sriranga Neethulu 2024 Movie Review: దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించిన సినిమా 'శ్రీరంగ నీతులు'. మూడు కథల సమాహారంగా తెరకెక్కిన యాంథాలజీ ఫిల్మ్. ఓ కథలో సుహాస్, మరో కథలో కార్తీక్ రత్నం హీరోలు. ఇంకో కథలో విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ జంటగా నటించారు. వాసు ఇంటూరి, దేవి ప్రసాద్, సీవీఎల్ నరసింహా రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రంజాన్ సందర్భంగా గురువారం (ఏప్రిల్ 10న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Sriranga Neethulu 2024 Movie Story): బస్తీలో కుర్రాడు (సుహాస్)కి స్కూల్ గ్రౌండులో తన ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ పెడతాడు. దాన్ని ఎవరో తీసేస్తారు. మరో ఫ్లెక్సీ వేయించే డబ్బులు ఉండవు. కొత్త ఫ్లెక్సీ వేయించాలనే పట్టుదలతో ఏం చేశాడు? అనేది ఓ కథ.
కొడుకు (కార్తీక్ రత్నం) మందు, గంజాయికి బానిస అయ్యాడని బాధ పడుతుంటే... అతడిని పట్టుకోవడం కోసం పోలీసులు రావడంతో తండ్రి (దేవి ప్రసాద్) తప్పించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైంది? తండ్రి కోసం కొడుకు వచ్చాడా? లేదా? అనేది మరో కథ.
తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక, పెద్దలు చూసిన సంబంధం చేసుకోలేక తనలో తాను సతమతం అవ్వడమే కాదు... లవర్ (విరాజ్ అశ్విన్)కు కోపం తెప్పిస్తుంది ఓ అమ్మాయి (రుహానీ శర్మ). చివరకు, వాళ్లు కలిశారా? లేదా? అనేది ఇంకో కథ.
సుహాస్, కార్తీక్ రత్నం, రుహానీ శర్మ... ముగ్గురిలో మార్పు వచ్చిందా? లేదా? మూడు కథలు ఎక్కడైనా కలిశాయా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Sriranga Neethulu Movie Review): ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటామని ఇండస్ట్రీలో చెప్పే ఆర్టిస్టులు, దర్శక రచయితలు ఎందరో! 'ఖడ్గం'లో రవితేజ, సంగీత చేత కృష్ణవంశీ సైతం ఆ మాటే చెప్పించారు. అయితే... దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ ప్రతి మనిషికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు 'శ్రీరంగ నీతులు' సినిమాలో!
ఒకరి (సుహాస్)ది పేరు కోసం ఆరాటం అయితే... మరొకరి (రుహానీ శర్మ)ది పరువు కోసం పడే ఆలోచన... ఇంకొకరు (కార్తీక్ రత్నం)ది వైఫల్యాలను మరొకరిపై నెట్టేసి మత్తులో దాక్కునే నైజం. పేరు, పరువు, ఫెయిల్యూర్... సమాజంలో చాలా మంది ప్రవర్తనలకు కారణం అవుతాయని, ఆ ప్రవర్తనలకు కారణం తోటి మనుషులేనని, ఒకరిని నిందించడం మానేసి మారడానికి అవకాశం ఇవ్వాలని చెప్పే కథ 'శ్రీరంగ నీతులు'.
దర్శకుడు ప్రవీణ్ కుమార్ చెప్పాలనుకున్న పాయింట్ బావుంది. అయితే, క్లారిటీ లోపించింది. ఫ్లెక్సీ అంటే అంత సుహాస్ (Suhas)కు ఎందుకంత ఇష్టం అనేది తెలియదు. గంజాయికి కార్తీక్ రత్నం ఎందుకు బానిస అయ్యాడో క్లారిటీ లేదు. ఆ రెండు కథల్లోని హీరోల్లో మార్పుకు కారణాలు కూడా కన్వీన్సింగ్‌గా లేవు. దాంతో ఎంత సేపటికీ కథ ముందుకు వెళ్లిన ఫీలింగ్ కలగదు. పైగా, లెంగ్త్ ఎక్కువైన ఫీల్ కలిగి బోర్ కొడుతుంది. మధ్య మధ్యలో రెండు మూడు సన్నివేశాలు నవ్వించాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాటలు గుర్తు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు.
Also Read: లవ్ గురు రివ్యూ: భార్య ప్రేమ కోసం రోమియోగా మారిన విజయ్ ఆంటోనీ - కొత్త సినిమా ఎలా ఉందంటే?
విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ కథను మాత్రం చక్కగా రాసుకున్నారు. ఉన్నంతలో మంచిగా ప్రజెంట్ చేశారు. వాళ్లిద్దరి నటన పాత్రలకు సూటయ్యింది. ఈ కథలో అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో నటించారు. బాయ్ ఫ్రెండ్, బ్రేకప్, మ్యారేజ్ ప్రపోజల్ గురించి ఆయన చెప్పే డైలాగులు యువతకు కనెక్ట్ కావచ్చు. తనికెళ్ల భరణి ఈ మూడు కథలను చెప్పే ప్రవచనకర్తగా కనిపించారు.
'శ్రీరంగ నీతులు' తరహా కథలు, కాన్సెప్టులు ఓటీటీలకు బావుంటాయి. రెండున్నర గంటలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టాలంటే 'వేదం' తరహాలో బలమైన సన్నివేశాలు, సంభాషణలు, భావోద్వేగాలు ఉండాలి. ఈ సినిమాలో అటువంటివి ఏవీ లేవు. షార్ట్ ఫిలింకు ఎక్కువ, ఓటీటీ ఫిలింకి తక్కువ అన్నట్టుందీ సినిమా. ఈ కథలు ప్రేక్షకుల్ని మెప్పించడం చాలా చాలా కష్టం సుమా! ఒకవేళ చెబితే... 'శ్రీరంగ నీతులు' వినడానికి బావుంటాయేమో!? కానీ, థియేటర్లలో చూసేందుకు కాదు!
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?