King Of Kotha Review - 'కింగ్ ఆఫ్ కొత్త' రివ్యూ : యాక్షన్ హీరోగా దుల్కర్ సల్మాన్ హిట్ అందుకుంటారా? లేదా?
King Of Kotha Review in Telugu : దుల్కర్ సల్మాన్ యాక్షన్ హీరో కావాలని చేసిన ప్రయత్నం 'కింగ్ ఆఫ్ కొత్త'. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా హీరోకి విజయాన్ని అందిస్తుందా? లేదా?
అభిలాష్ జోషి
దుల్కర్ సల్మాన్, షబీర్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో రితికా సింగ్!
సినిమా రివ్యూ : కింగ్ ఆఫ్ కొత్త
రేటింగ్ : 2.25/5
నటీనటులు : దుల్కర్ సల్మాన్ డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో రితికా సింగ్
కథ : అభిలాష్ ఎన్. చంద్రన్
ఛాయాగ్రహణం : నిమిష్ రవి
నేపథ్య సంగీతం : జేక్స్ బిజోయ్
పాటలు : జేక్స్ బిజోయ్, షాన్ రెహమాన్
నిర్మాణం : జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ (దుల్కర్ సల్మాన్)
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : అభిలాష్ జోషీ
విడుదల తేదీ: ఆగస్టు 24, 2023
'మహానటి', 'సీతా రామం' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషలకు అతీతంగా జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు. ఆయన నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' (King Of Kotha Review) ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (King Of Kotha Story) : రాజు (దుల్కర్ సల్మాన్) 'కొత్త' పట్టణంలో రౌడీ. అతనికి ఎదురే లేదు. తండ్రిని చూసి రౌడీగా మారాడతాడు రాజు. అతడిని చూసి మోజు పడని అమ్మాయి ఉండదు. అయితే... తారా (ఐశ్వర్య లక్ష్మి) ప్రేమలో పడిన తర్వాత మరో అమ్మాయి ముఖం చూడడు. సొంతూరిలో రాజులా ఉన్న రాజు, ఊరు విడిచి లక్నో ఎందుకు వెళ్ళాడు? తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు రీతూ (అనిఖా సురేంద్రన్), స్నేహితుడు కన్నా (షబీర్ కాళ్లరక్కల్)ను వదిలి ఎలా ఉండగలిగాడు? 'కొత్త'కు తిరిగి వచ్చిన తర్వాత కన్నా, రాజు మధ్య యుద్ధం మొదలు కావడానికి కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (King Of Kotha Review) : ఓ మహిళ కోసం రాజులు, రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయని చరిత్రలో చదివాం! 'కింగ్ ఆఫ్ కొత్త'లో అంతకు మించిన కొత్త కథ ఏమీ లేదు. కథలోని ప్రతి మలుపులో ఓ మహిళ కీలక పాత్రధారిగా ఉంటుంది. కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. హీరోతో చాలా పాత్రలకు స్నేహ బంధం లేదంటే బంధుత్వం ఉంటుంది. యాక్షన్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టడంతో అవన్నీ మురుగున పడ్డాయి. ఎమోషన్స్ పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేదు. కథ, కథనాల్లో ఎంత వెతికినా కొత్తదనం కనిపించదు.
'కింగ్ ఆఫ్ కొత్త'ను పై నుంచి చూస్తే గ్యాంగ్‌స్టర్ డ్రామా. లోతుగా చూస్తే... అందులో తల్లి ప్రేమ, సిస్టర్ సెంటిమెంట్, మనసుకు ప్రేయసి చేసిన గాయం, స్నేహితుడు పొడిచిన వెన్నుపోటు వంటివి భావోద్వేగాలు ఉన్నాయి. కమర్షియల్ ఫార్మటులో కథను చెప్పాలని, ప్రతి సన్నివేశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దాలని దర్శకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో సినిమా చాలా అంటే చాలా నిదానంగా సాగుతుంది. ఒక విధంగా చూస్తే... ఫస్టాఫ్ అలా అలా సాగింది! పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లడంతో కాస్త ఆసక్తిగా ఉంటుంది. విశ్రాంతి తర్వాత కాసేపటికి ముగింపు ఏమిటనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కథ ముగుస్తుందని భావించిన ప్రతిసారీ దర్శక, రచయితలు సాగదీశారు. అక్కడ కొన్ని ట్విస్టులు పడ్డాయి. కానీ, అప్పటి వరకు సాగదీసి సాగదీసి కథను చెప్పడంతో త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళవచ్చనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
'కింగ్ ఆఫ్ కొత్త'లో అసలైన హీరోలు అంటే నేపథ్య సంగీతం అందించిన జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి. కథా నేపథ్యంలో 1980, 90లలో జరుగుతుంది. ఆ కాలం తెరపై కనిపించేలా ప్రొడక్షన్ డిజైనర్లు, సినిమాటోగ్రాఫర్ జాగ్రత్తలు తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. యాక్షన్ సీన్స్ డిజైనింగ్ కూడా బావుంది.
నటీనటులు ఎలా చేశారంటే... : దుల్కర్ సల్మాన్ ఎటువంటి పాత్ర అయినా చేయగలరని 'కింగ్ ఆఫ్ కొత్త' మరోసారి నిరూపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచారు. కథలో కీలకమైన కన్నా పాత్రలో షబీర్ లుక్స్ పరంగా వేరియేషన్ చూపించడమే కాదు... నటుడిగానూ మెరిశారు. ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్, పోలీస్ అధికారిగా ప్రసన్న తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. రంజిత్ పాత్రలో చెంబన్ వినోద్ దాస్ మధ్యలో కొన్ని నవ్వులు పూయించారు. రితికా సింగ్ ప్రత్యేక గీతంలో మెరిశారు.
Also Read : 'బెదురులంక' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - కార్తికేయ ముందున్న కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే?
చివరగా చెప్పేది ఏంటంటే : అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే యాక్షన్ ప్రేమికులు 'కింగ్ ఆఫ్ కొత్త'ను ఓసారి చూడవచ్చు. అదీ దుల్కర్ సల్మాన్ నటన, యాక్షన్ బ్లాక్స్ & జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం కోసం! లేదంటే కష్టమే!
Also Read : 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial