CSI Sanatan Movie Review - 'సిఎస్ఐ సనాతన్' రివ్యూ : ఆది సాయికుమార్ సినిమా ఎలా ఉందంటే?
Aadi Sai Kumar's CSI Sanatan Review : ఆది సాయికుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'సిఎస్ఐ సనాతన్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.
శివశంకర్ దేవ్
ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, 'బిగ్ బాస్' వాసంతి తదితరులు
సినిమా రివ్యూ : సిఎస్ఐ సనాతన్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, మధు సూదన్, 'బిగ్ బాస్' వాసంతి, భూపాల్ రాజా, ఖయ్యుమ్, రవిశంకర్ తదితరులు
ఛాయాగ్రహణం : జి. శేఖర్
సంగీతం : అనీష్ సోలోమాన్
నిర్మాత : అజయ్ శ్రీనివాస్
రచన, దర్శకత్వం : శివశంకర్ దేవ్
విడుదల తేదీ : మార్చి 10, 2023
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) నటించిన తాజా సినిమా ' సిఎస్ఐ సనాతన్' (CSI Sanatan Movie). మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ చిత్రమిది. సినిమా ఎలా ఉంది (CSI Sanatan Review)?
కథ (CSI Sanatan Movie Story) : వడ్డీలేని రుణాలు అంటూ తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి వచ్చిన ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ వీసీ గ్రూప్ సీఈవో విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) హత్యకు గురవుతాడు. ఆఫీసులో జరిగిన పార్టీలో ఎవరో షూట్ చేస్తారు. కేసును క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సిఎస్ఐ) అధికారి సనాతన్ (ఆది సాయి కుమార్)కు అప్పగిస్తారు. విక్రమ్ చక్రవర్తితో పాటు కంపెనీలో పార్టనర్ దివ్య (నందినీ రాయ్), ఉద్యోగులు లాస్య (బిగ్ బాస్ వాసంతి), సుదీక్ష (మిషా నారంగ్), మరో ఇద్దరిని చాలా అనుమానిస్తాడు. విక్రమ్, లాస్యతో పాటు ఎన్నో కేసులు ఉన్న మంత్రి రాజవర్ధన్ (మధుసూదన్ రావు) కూడా వీసీ కంపెనీలో భాగస్వామి అని తెలుస్తుంది. సనాతన్ ముందు ఎన్నో చిక్కు ముడులు ఉంటాయ్. దానికి తోడు మాజీ ప్రేయసి అదే కంపెనీలో ఉంటుంది. ప్రేమికులైన సనాతన్, సుదీక్ష మధ్య ఎందుకు బ్రేకప్ అయ్యింది? రాజవర్ధన్ పీఏ చోటా మరణానికి కారణం ఎవరు? చేతిలో చిల్లిగవ్వ లేని విక్రమ్ పదేళ్ళలో ఐదు వేల కోట్ల కంపెనీకి సీఈవో ఎలా అయ్యాడు? విక్రమ్, దివ్య మధ్య సంబంధం ఏమిటి? వీసీ కంపెనీ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన, ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు ఆ కంపెనీలో ఎందుకు ఉద్యోగులకు చేరారు? విక్రమ్ చక్రవర్తిని ఎవరు చంపారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (CSI Sanatan Review In Telugu) : ఆది సాయి కుమార్ ఎంపిక చేసుకునే కథలు బావుంటాయి. 'సిఎస్ఐ సనాతన్' కాన్సెప్ట్ కూడా బావుంది. ఆ కథను స్క్రీన్ మీదకు తీసుకు వచ్చే క్రమంలో కొన్ని తప్పులు దొర్లాయి. బడ్జెట్ పరిమితులు స్క్రీన్ మీద తెలుస్తూ ఉన్నాయి. కొన్ని రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద జరుగుతున్న అంశాలను మళ్ళీ డైలాగుల రూపంలో మళ్ళీ చెప్పడం టైమ్ వేస్ట్ ప్రాసెస్. ప్రేమకథకు కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
'సిఎస్ఐ సనాతన్'లో మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే... కమర్షియల్ వేల్యూస్ వెంట ఆది సాయి కుమార్ పరుగులు తీయలేదు. పాత్రకు ఏం కావాలో అది చేశారు. దర్శక నిర్మాతలు కూడా కథను పక్కదోవ పట్టించకుండా ముందుకు వెళ్ళారు. సమాజంలో మధ్య తరగతి, పేద ప్రజలు మోసపోతున్న అంశాన్ని మర్డర్ మిస్టరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫస్టాఫ్ అంతా సోసోగా ఉంటుంది. మర్డర్ ఎవరు చేశారు? అనే ఇన్వెస్టిగేషన్ ఎక్కువసేపు సాగింది. కథ పెద్దగా ముందుకు కదల్లేదు. అసలు కథ అంతా సెకండాఫ్, క్లైమాక్స్ ముందు 30 నిమిషాల్లో ఎక్కువ చెప్పారు. ఆ సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. లాజిక్స్ కొన్ని వదిలేశారు. క్లైమాక్స్ ట్విస్టులు బావున్నాయి.
స్వార్థం, డబ్బు మీద ఆశ మనిషిని ఎన్ని తప్పులు చేయిస్తుంది? డబ్బు కోసం ఎదుటి వ్యక్తికి శారీరకంగానూ లొంగిన మహిళ మోసపోతే పరిస్థితి ఏమిటి? ఆ కోపం ఎంత దూరం వెళుతుంది? అనేది చూపించిన తీరు బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సోసోగా ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎలివేషన్స్ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. నిడివి పరంగానూ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. పావుగంట, 20 నిమిషాలు కత్తిరిస్తే సినిమా మరింత రేసీగా ఉండేది.
నటీనటులు ఎలా చేశారంటే? : సనాతన్ క్యారెక్టర్ కోసం ఆది సాయి కుమార్ తన ఎనర్జీ అంతటినీ పక్కన పెట్టారు. ఎక్కువగా అండర్ ప్లే చేశారు. సినిమాలో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయి. కమర్షియల్ అంశాలు లేకపోయినా క్యారెక్టర్ కోసం సినిమా చేశారు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా సీన్స్ చేశారు. మిషా నారంగ్ స్క్రీన్ స్పేస్ తక్కువే. ఆదితో ఒక సాంగ్ ఉంది. కథలో కీలకమైన రెండు మూడు సీన్లలో కనిపించారు. యాక్టింగ్ పరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాలి. టైప్ కాస్ట్ అవుతున్న ఆర్టిస్టుల్లో నందినీ రాయ్ ఒకరు. ఈ తరహా పాత్రలు ఆమె చేశారు. అయితే, ఈ సినిమాలో ఆమెకు ఇంపార్టెంట్ రోల్ దక్కింది. పతాక సన్నివేశాల్లో ప్రాముఖ్యం లభించింది. నందినీ రాయ్ కూడా చక్కగా చేశారు. 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్ కనిపించిన సన్నివేశాలు తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. అలీ రెజా, ఖయ్యుమ్, రవిప్రకాష్, మధుసూదన్ రావు తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
Also Read : బుర్ర పాడు చేసే డిస్టర్బింగ్ ట్విస్ట్‌తో వచ్చిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఇరట్టా’ - ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'సిఎస్ఐ సనాతన్' పాసబుల్ థ్రిల్లర్. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే టైమ్ పాస్ చేయొచ్చు. ఆది సాయి కుమార్ మరోసారి మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థ్రిల్లర్ జానర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రమే.
Also Read : 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?