Zinc For Hair: జుట్టు బాగా పెరగాలంటే జింక్ కావాలి, జింక్ కావాలంటే వీటిని తినాలి
జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అయితే ఈ ఆహారాలు తినండి.
జుట్టు రాలిపోయే సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. కాలుష్యం, వాతావరణంలో మార్పులు, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు వాడడం, పోషకాహార లోపం వంటి అనేక సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని ఆపాలన్నా, వాటి పెరుగుదలను ప్రోత్సహించాలన్నా మెరుగైన ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు పెరుగుదల బాగుండాలంటే జింకుతో నిండిన ఆహారాన్ని తినాలి. జింక్ సహజంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్యను నిరోధిస్తుంది. కాబట్టి జింక్ నిండుగా ఉండే ఆహారాలు తింటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.
జింక్ ఎందుకు?
మనం తినే ఆహారాల నుంచే శరీరం జింక్ ను పొందుతుంది. శరీరంలో జింక్ స్వయంగా తయారవ్వదు. అందుకే మన వెంట్రుకల కుదుళ్ళు బలంగా ఉండాలన్నా, రోగనిరోధక వ్యవస్థ బాగుండాలన్నా జింక్ అవసరం. జింక్ తో నిండిన ఆహారాలను రోజూ తినేందుకు ప్రయత్నించండి. ఏ ఆహారాలలో జింక్ పుష్కలంగా ఉంటుందో తెలుసుకోండి.
పుట్టగొడుగులు
విటమిన్ డి తో నిండిన పుట్టగొడుగులు మన శరీరానికి చాలా అవసరం. ఇది తినడం వల్ల ఏడు శాతం జింక్ శరీరానికి అందుతుంది. జింక్ లోపం లేకుండా ఉంటే జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
పాలకూర
పాలకూరలో జింక్ ఉంటుంది. ప్రతిరోజు పాలకూరని తింటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. దీనిలో ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాదు పొడవుగా కూడా పెరుగుతుంది.
చిక్కుళ్ళు
చిక్కుళ్ళలో మాంసకృతులు, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని కాయ ధాన్యాలు అంటారు. జుట్టు వేగంగా పెరగడానికి ఇవి సహాయపడతాయి. మొక్కల ఆధారిత ఆహారాలైన ఈ చిక్కుళ్లలో జింక్ సమృద్ధిగా ఉండడమే కాకుండా రోగనిరోధక శక్తిని. పేగుల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు
ఈ చిన్న గింజలు ఎంతో జింక్ ను తమలో దాచుకుంటాయి. జుట్టు రాలడాన్ని తిప్పికొడతాయి. కొత్త జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినడం అలవాటు చేసుకోండి.
పైన చెప్పిన ఆహారాల్లో రోజూ కనీసం రెండు రకాల పదార్థాలు కచ్చితంగా తినేలా మెనూని రెడీ చేసుకోవాలి. ఇలా నెల రోజులు తింటే చాలు జుట్టులో పెరుగుదలను మీరే గుర్తిస్తారు. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పొడవు కూడా త్వరగా ఎదుగుతాయి. జుట్టును కాపాడుకోవడానికి పైన చెప్పిన ఆహారాలు తినడం అలవాటు చేసుకుంటే చాలు.
Also read: ఈ ఎమోజీలలో ఒకటి మాత్రం భిన్నంగా ఉంది, దాన్ని 15 సెకండ్లలో కనిపెడితే మీరు సూపర్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.