Viral: ఏకంగా 56 బ్లేడ్లు మింగేసిన యువకుడు- పొట్ట చూసి షాక్ అయిన వైద్యులు
కొన్ని సంఘటనలు షాక్‌కు గురిచేస్తాయి. అలాంటిదే ఇది కూడా ఒకటి.
చిన్నపిల్లలు తెలియక చిన్న చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుని మింగేస్తూ ఉంటారు. కానీ పాతికేళ్లు వచ్చిన యువకుడు కూడా అలా వస్తువులను మింగేయడం ఆశ్చర్యం. అది కూడా పదునైన బ్లేడ్లు మింగేయడం గమనార్హం. అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 బ్లేడ్లు మింగేశాడు. అతని పేరు యష్‌పాల్ సింగ్, ఉండేది రాజస్థాన్లోని సంచోర్ ప్రాంతంలోని డేటా అనే గ్రామంలో. అతను అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు.నలుగురు స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు. అతనికి బ్లేడ్లు తినే అలవాటు ఉంది. ఆ విషయం స్నేహితులకు కూడా తెలియదు. ఎవరు లేని సమయంలో బ్లేడ్లను తినేసేవాడు. దీంతో ఆరోగ్యం క్షీణించింది. ఉద్యోగానికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయాడు. హఠాత్తుగా ఓరోజు రక్తపు వాంతులు చేసుకున్నాడు. వెంటనే స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
గదికి వచ్చిన స్నేహితులు అతడి పరిస్థితి చూసి భయపడిపోయారు. వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతని పొట్టను స్కాన్ చేయగా ఎన్నో వస్తువులు ఉన్నట్టు కనిపించింది. సోనోగ్రఫీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు కూడా చేశారు. ఆ పరీక్షల్లో ఆ వ్యక్తి కడుపులో మెటల్ బ్లేడ్లు ఉన్నట్టు తేలింది. శస్త్ర చికిత్స చేయడం ద్వారా బ్లేడ్లను బయటకు తీశారు. లెక్కపెడితే ఏకంగా 56 బ్లేడ్లు ఉన్నాయి. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
బ్లేడ్లు పదునుగా ఉంటాయి. వాటిని మింగడం సాధ్యం కాదు, అందుకనే అతను కవర్లతో పాటు చుట్టి ఉన్న బ్లేడులను అలాగే మింగేసేవాడు. వైద్యలుకు అతను ఇదే విషయాన్ని చెప్పాడు. పేపర్ తో పాటు మింగడం వల్ల అది గొంతులో ఎలాంటి గాయం చేయకుండా పొట్టలోకి చేరుకునేది. అయితే పూర్తి బ్లేడు గొంతులో దిగడం కష్టం కాబట్టి, దాన్ని రెండు ముక్కలుగా మధ్యకి మడిచి మింగేసేవాడు.
పొట్టలో ఆ కాగితం కరిగిపోయి పదునైన బ్లేడ్లు పొట్టను గాయపరచడం మొదలుపెట్టాయి. అతడి నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ‘ఎందుకలా బ్లేడ్లు తింటున్నావ్?’ అని అడిగితే దానికి సమాధానం మాత్రం చెప్పడం లేదు. అతని బంధువులకు కూడా ఇతనికి బ్లేడ్లు తినే అలవాటు ఉన్నట్టు తెలియదు.
గతంలోనూ...
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. పొట్టలో రాళ్లు, జుట్టు, షాంపూ ప్యాకెట్లను కూడా వెలికితీశారు. కోయంబత్తూరులో 13 ఏళ్ల బాలిక పొట్టలోంచి ఖాళీ షాంపూ ప్యాకెట్లతో పాటూ, అరకిలో జుట్టును కూడా శస్త్ర చికిత్స ద్వారా బయటికి తీశారు. ఆ బాలిక మానసికంగా ఆరోగ్యం బాగోలేక ఇలా జుట్టు, షాంపూ ప్యాకెట్లను మింగిందని వైద్యులు తేల్చారు.
Also read: బ్లాక్ టీ రోజూ తాగే అలవాటు ఉందా? జాగ్రత్త, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.