World Sight Day 2025 : కంటి సమస్యలా? దృష్టిలోపం రాకుండా చూపును మెరుగుపరిచే కాపాడే 8 చిట్కాలు ఇవే
Eye Health : కంటి ఆరోగ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా సైట్ డే నిర్వహిస్తున్నారు. మరి మెరుగైన దృష్టి కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో.. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.

Vision Care and Eye Health Tips : కంటితోనే మనం ప్రపంచాన్ని చూస్తాం. కానీ చాలామంది దృష్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. స్క్రీన్ సమయం, కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి పెరగడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల దృష్టిలోపం సమస్య చాలామందిలో పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తిస్తూ.. ప్రపంచ దృష్టి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అక్టోబర్లో రెండో గురువారం రోజున ప్రపంచ దృష్టి దినోత్సవం చేస్తూ.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు.
సాధారణ కంటి సమస్యలను నివారించడానికి, మొత్తం దృష్టిని మెరుగుపరచడానికి లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. రోజువారీ అలవాట్ల నుంచి పోషకాహారం, నివారణ, సంరక్షణ వరకు 8 చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. వీటివల్ల చూపు స్పష్టంగా మారడంతో పాటు.. సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం.
రెగ్యులర్ స్క్రీనింగ్
దృష్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. వీటివల్ల గ్లకోమా, క్షీణత, డయాబెటిక్ రెటినోపతి వంటి అనేక కంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. వీటిని పట్టించుకోకపోతే నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా కంటి వైద్యుడు లేదా ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య పెరగకుండా అదుపులో ఉంటుంది.
UV కిరణాల నుంచి రక్షణ
అతినీలలోహిత (UV) కిరణాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల కంటిశుక్లం, మచ్చల క్షీణత, ఇతర కంటి రుగ్మతలు వస్తాయి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు 100% UVA, UVB కిరణాలను నిరోధించే అధిక-నాణ్యత గల సన్ గ్లాసెస్ ధరించడం ముఖ్యం. సన్ గ్లాసెస్‌తో పాటు వెడల్పాటి అంచు కలిగిన టోపీలు కూడా పెట్టుకోవచ్చు. ఇవి మీరు స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి. ఎక్స్పోజర్ను తగ్గిస్తాయి. రేడియేషన్ వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టం నుంచి ఇవి కాపాడుతాయి.
పోషకాహారం
మీరు తీసుకునే ఆహారం కంటి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే డైట్లో విటమిన్ ఎ, సి, ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి కంటి వ్యాధులను నివారించడంలో, స్పష్టమైన దృష్టిని అందించడంలో హెల్ప్ అవుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరలు, క్యారెట్లు, బెల్ పెప్పర్స్ వంటి రంగురంగుల కూరగాయలు డైట్లో చేర్చుకోవచ్చు. సాల్మన్, మాకేరెల్ వంటి చేపలు కూడా మంచివే.
డిజిటల్ స్ట్రెస్ తగ్గించాల్సిందే..
కంప్యూటర్ స్క్రీన్లు, స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువసేపు చూడడం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల దృష్టిలోపం, తలనొప్పి వస్తాయి. ఈ సమస్యని తగ్గించడానికి 20-20-20 నియమాన్ని ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడటం వలన ఒత్తిడి తగ్గుతుందట. స్క్రీన్ బ్రైట్నెస్ కూడా కంటిపై ఎఫెక్ట్ చూపించకుండా అడ్జెస్ట్ చేసుకోవాలి. యాంటీ-గ్లేర్ కళ్లజోడు ఉపయోగిస్తే మంచిది. స్క్రీన్ ఎక్కువగా చూస్తుంటే మధ్యలో కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలట.
కంటి వ్యాయామాలు
శారీరక వ్యాయామం శరీరాన్ని బలోపేతం చేసినట్లే.. కంటి వ్యాయామాలు దృష్టిని మెరుగుపరుస్తాయి. కంటిని సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పాలి. దగ్గర, దూర వస్తువులపై దృష్టి పెట్టాలి. తరచుగా రెప్పలు వేయడం వంటి పద్ధతులు కూడా కంటి అలసటను తగ్గిస్తాయి. అరచేతులతో కళ్లను మూయడం.. కళ్లకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. ఇవి కంటిపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి.
లైటింగ్
చదవడం, రాయడం లేదా స్క్రీన్లను ఉపయోగించేటప్పుడు కంటి ఒత్తిడిపై పడకుండా, తలనొప్పిని నివారించడానికి తగినంత లైటింగ్ చాలా ముఖ్యం. తగినంత వెలుగు లేకపోతే కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కళ్లు అలసిపోవడం, పొడిబారడం జరుగుతాయి. చుట్టుపక్కల ఉండే పరిస్థితులకు సరిపోయేలా స్క్రీన్ బ్రైటింగ్ సర్దుబాటు చేసుకోవాలి.
కంటి పరిశుభ్రత
మీ కళ్లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల చికాకులు లేకుండా, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు రాకుండా ఉంటాయి. కళ్లను తాకడానికి ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. చికాకుగా అనిపిస్తే వాటిని రుద్దకూడదు. కాంటాక్ట్ లెన్స్ వారు మరింత జాగ్రత్త ఉండాలి. లెన్స్‌లను శుభ్రపరచుకోవాలి.
హైడ్రేషన్
డీహైడ్రేషన్ నేరుగా కళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది పొడిబారడాన్ని, ఎరుపు, చికాకును కలిగిస్తుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగాలి. ఇది కళ్లను తేమగా, సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. పొడి లేదా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో, హ్యూమిడిఫైయర్ను ఉపయోగించడం వలన కూడా తేమను కోల్పోకుండా నిరోధించవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉండటం మొత్తం ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అయితే కంటి సమస్యలు కచ్చితంగా దూరమవుతాయి. అయితే ఇప్పటికే కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల సమస్య తీవ్రం కాకుండా ఉంటుందని చెప్తున్నారు.






















