Expensive Pillow: ఈ దిండు ధర రూ.45 లక్షలు, కొన్నవాడికి ఇక నిద్ర పడుతుందా?
దిండును తలకింద పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుంది. కానీ, ఈ దిండు గురించి తెలిస్తే చాలు మీకు నిద్ర కరువవ్వుతుంది.
ఇంట్లో విలువైన వస్తువులను బీరువాలో పెట్టి లాక్ చేసినా మనసులో ఏదో కలత నిద్ర లేకుండా చేస్తుంది. చిన్న అలికిడైనా సరే భయపడిపోతాం. అలాంటిది రూ.45 లక్షలు విలువ చేసే దిండును తలకింద పెట్టుకుంటే నిద్ర వస్తుందా? పొరపాటున ఆ దిండు మీద నుంచి తల పక్కకు జరిగితే.. ఒక్కసారే గుండె జారినట్లు అవుతుంది కదూ. ఒక వేళ ఆ పిల్లోని ఇంట్లో వదిలి వెళ్తే.. మనసంతా అక్కడే ఉంటుంది కదూ. అయినా.. దిండు ఖరీదు మరీ రూ.45 లక్షలు ఏమిటీ? విడ్డూరం కాకపోతేనూ అని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఆ దిండు గురించి తెలుసుకోవల్సిందే.
దిండు విలాసవంతమైన వస్తువుగా మీరు భావించి ఉండరు. అయితే, దింగు ఖరీదు రూ.45 లక్షలంటే జోక్ అనుకుని ఉంటారు. కానీ, ఇది ఖరీదైన నిజం! డచ్‌కు చెందిన గర్భాశయ నిపుణుడు థీజ్ వాన్ డెర్ హిల్స్ట్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును తయారు చేశాడు. దిండు ఈజిప్షియన్ కాటన్, మల్బరీ సిల్క్‌తో తయారు చేసిన ఈ దిండులో విషరహిత డచ్ మెమరీ ఫోమ్ ఉంది.
ఈ దిండును తయారు చేయడానికి అతడికి పదిహేనేళ్లు పట్టింది. అందుకని, మరీ అంత రేటు చెబుతారా? అని అనుకుంటున్నారా? కానే కాదు.. అది అంత ధర పలకేందుకు కారణం మరొకటి ఉంది. ఈ దిండును 24 కారెట్ల బంగారంతో తయారు చేశారు. అంతేకాదు వీటిలో ఖరీదైన వజ్రాలు, నీలమణి(sapphire)తో ఈ దిండును తయారు చేశారు. ఈ దిండు జిప్‌కి నాలుగు వజ్రాలు, నీలమణి పొదిగారు.
ఈ దిండును సాదాసీదా కవర్లో ప్యాక్ చేయరు. ఖరీదైనది కాబట్టి.. బ్రాండ్ బాక్స్‌లో ప్యాక్ చేసి ఇస్తారు. నిద్రలేమితో బాధపడే వ్యక్తులు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ దిండును తయారు చేశానని థీజ్ వాన్ తెలిపాడు. ఈ దిండును కస్టమర్ల అవసరానికి తగినట్లుగా తయారు చేస్తామని ఆయన తెలిపాడు. దీన్ని తయారు చేయడానికి ముందు కస్టమర్ ఏ భంగిమలో నిద్రపోతాడో తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా దిండును తయారు చేస్తారు.
కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత థీజ్ వాన్ బృందం 3D స్కానర్‌ని ఉపయోగించి, కస్టమర్ భుజాలు, తల, మెడ కొలతలను తీసుకుంటుంది. కొలతల ప్రక్రియ ముగిసిన తర్వాత దిండును డచ్ మెమరీ ఫోమ్‌తో నింపుతారు. హైటెక్ రోబోటిక్ మెషిన్ మిల్లులను ఉపయోగించి కస్టమర్ తల ఆకారానికి అనుగుణంగా రూపొందిస్తారు. అయినా, అంత ఖరీదైన దిండు కొన్న తర్వాత కస్టమర్‌కు నిద్ర ఎందుకు పడుతుంది చెప్పండి. అయితే, సంపన్నులకు ఇది పెద్ద అమౌంట్ కాదనుకోండి!! మనలాంటి సామాన్యుల దగ్గర అంత డబ్బు ఉంటే.. ఆ దిండుకు బదులు చక్కని ఫ్లాట్ కొనుక్కొని, అందులోనే చాప వేసుకుని గుండెలపై చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు.
Also Read: లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి
Also Read: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు