World liver day 2023 - వరల్డ్ లివర్ డే: ఈ చిన్న జాగ్రత్తలతో కాలేయాన్ని కాపాడుకోండి
కాలేయ సమస్యల గురించిన అవగాహన కల్పించేందకు గాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19 వరల్డ్ లివర్ డే గా జరుపుతారు. కాలేయ ఆరోగ్యానికి గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయో తెలుసుకుందాం.
World liver day: శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. శరీరం నుంచి వ్యర్థాలను వేరు చేసే అతి పెద్ద గ్రంథి ఇది. కాలేయ ఆరోగ్యం బావుంటేనే శరీరం చురుకుగా ఉంటుంది. కాలేయ సమస్యలు లక్షణాల రూపంలో బయటకు కనిపిస్తున్నాయి అంటే ఇక అనారోగ్యం కొంచెం ఎక్కువే ఉందని అర్థం చేసుకోవాలి. లివర్ నిరంతరాయంగా రక్తం నుంచి వ్యర్థాలను వేరు చేస్తుంది. రక్తశుద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని నుంచి విడుదలయ్యే పైత్య రసం జీర్ణక్రియకు చాలా అవసరం.
మారిన నేటి జీవన విధనం ప్రభావం కాలేయం మీద కూడా ఉంటోంది. పార్టీల పేరుతో రకరకాల పానీయాలు, ఆహారాలు తరచుగా తీసుకోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం వంటివన్నీ కూడా లివర్ ను అబ్యూజ్ చేసేవే. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా కాలేయ సమస్యలు పెరిగి పోతున్నాయి.
- సరైన జీవన విధానం కాలేయ ఆరోగ్యానికి చాలా అవసరం.
- శరీర బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు రాకుండా నివారించవచ్చు.
- రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చెయ్యడం తప్పనిసరి.
- మైదా, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువగా ఉండే ప్యాక్డ్ ఫూడ్ ను పూర్తిగా దూరం పెట్టాలి.
- ఆల్కాహాల్ కు దూరంగా ఉండగలిగితే మంచిది. ఒక వేళ అలా కుదరని పక్షంలో ఎవరి వారు ఒక హద్దు నిర్ణయించుకుని అది దాటకపోవడం చాలా అవసరం.
- కాలేయ ఆరోగ్యానికి సురక్షిత సెక్స్ కూడా అవసరమే. వీలైనంత వరకు ఒక్క భాగస్వామికి పరిమితం కావడం మంచిది. లేదంటే హెపటైటిస్ బి వంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ జీవితాంతం వెంటాడుతాయి.
- హెపైటైటిస్ ఎ, హెపటైటిస్ బి వంటి ఇన్ఫెక్షన్ల నివరాణకు టీకాలు వేయించుకోవాలి.
- షుగర్, బీపీల వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు వాటిని అదుపులో పెట్టుకోవాలి.
కాలేయ సమస్యలకు, కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్లకు సరైన సమయంలో చికిత్స జరగకపోతే అది సిర్రోసిస్, లివర్ ఫేయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారి తియ్యవచ్చు. లివర్ హెల్త్ కోసం పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ పదార్థాలు కాలేయాన్ని శుభ్రం చేస్తాయని చెప్పవచ్చు. టమాట సాస్, పచ్చి బఠానీలు, పాలకూర, చిలగడ దుంప వంటివి పోటాషియం అధికంగా ఉండే పదార్థాలు. కాఫీ కూడా తగు మోతాదులో తీసుకుంటే అది కూడా కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. రెండు కప్పులు మించకుండా జాగ్రత్త పడండి.
ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా తాజా పండ్లు, కారెట్, గింజలు వంటివి కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నారింజ పండ్లు, నిమ్మరసం కలిపి రోజంతా కొద్దికొద్దిగా తీసుకుంటే కాలేయం శుభ్రపడడమే కాదు. శరీరంలోని నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ