World Heart Day 2022: గుండె సమస్య ఉందో లేదో తేల్చేసే ముఖ్యమైన టెస్టులు ఇవే
World Heart Day 2022: ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ సందర్భంగా గుండె జబ్బులను గుర్తించే పరీక్షల గురించి తెలుసుకుందాం.
World Heart Day 2022: గుండె జబ్బులు వచ్చినా అవి వెంటనే లక్షణాలు చూపించవు. దీని వల్ల ఒక్కోసారి పరిస్థితి చేయిదాటే పరిస్థితి వస్తుంది. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా గుండె ఎలా పనిచేస్తుందో నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి. వీటి ద్వారా గుండె సమస్యలను సులువుగా తెలుసుకోవచ్చు.
ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG)
ఈ పరీక్షలో గుండె నుంచి వచ్చే విద్యుత్ తరంగాలు నమోదు చేస్తారు. ఇది గుండె విద్యుత్ కార్యకలాపాలకు సంబంధించిన గ్రాఫ్‌ను తయారుచేస్తుంది. ఈ పరీక్షలో భాగంగా శరీరంపై ఎలక్ట్రోడ్లు ఉంచుతారు. ఈ ఎలక్ట్రోడ్ల సెన్సార్లు గుండె కొట్టిన ప్రతిసారీ ఉత్పత్తి చేసే విద్యుత్ సంకేతాలను గుర్తిస్తాయి.
కరోనరీ యాంజియోగ్రామ్
కరోనరీ యాంజియోగ్రామ్‌లో గుండె రక్తనాళాలను ఎక్స్‌రే ద్వారా చూస్తారు.ఇది సాధారణంగా గుండెకు రక్త ప్రవాహాన్ని నిరోధించే అడ్డంకులను గమనించేందుకు చూస్తారు.
మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)
దీన్ని శరీరంలో ఉన్న ఎముకల్లేని భాగాలను, మృదు కణజాలాలను పరిశీలించేందుకు ఉపయోగించే ఇమేజింగ్ టెక్నాలజీ. ఇందులో గుండెను చూసేందుకు బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తారు. వివిధ గుండె జబ్బులను తెలుసుకోవడానికి వైద్యులు దీనిని ఉపయోగిస్తారు.
ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ టెస్టు
దీన్ని ట్రెడ్‌మిల్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. మీ గుండె ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఈ పరీక్షలో భాగంగా ట్రెడ్‌మిల్‌పై నడిపిస్తారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) మీ గుండె విద్యుత్ లయలను నమోదు చేస్తుంది. డాక్టర్ మీ రక్తపోటును కూడా కొలుస్తారు, అలాగే మీకు ఛాతీలో అసౌకర్యం లేదా అలసట వంటి లక్షణాలు ఉన్నాయా అని పర్యవేక్షిస్తారు.
కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రామ్ (CCTA)
కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రామ్ (CCTA) అనేది 3D ఇమేజింగ్ పరీక్షా పద్ధతి. ఇది కరోనరీ ధమనులను తగ్గించే ఫలకం లేదా ఏదైనా వేరే సమస్య ఉన్నా గుర్తిస్తుంది.
ఎకోకార్డియోగ్రామ్
ఈ అల్ట్రాసౌండ్ పరీక్షలో, గుండె నిర్మాణం ఎలా ఉందో చూస్తారు. కార్డియోమయోపతి, వాల్వ్ డిసీజ్ వంటి అనేక గుండె సంబంధిత సమస్యలను నిర్ధారిస్తుంది. ఈ పరీక్షలో రేడియేషన్ ఉపయోగిస్తారు.
న్యూక్లియర్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్
ఈ పరీక్షలో గుండెకు రక్తం ఎలా ప్రవహిస్తుందో చూస్తారు. ఇందుకోసం రేడియోధార్మిక పదార్థాన్ని ట్రేసర్ గా ఉపయోగిస్తారు. గుండెకు రక్తప్రసరణ సరిగా అవ్వకపోతే ఈ టెస్టులో తేలిపోతుంది.
టిల్ట్ పరీక్ష
రోగిని పడుకోబెట్టి సేఫ్టీ బెల్టులు పెడతారు. ECG, రక్తపోటు మానిటర్‌కు అతడిని కనెక్ట్ చేస్తారు. రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల, గుండె సక్రమంగా కొట్టుకోక పోవడం, స్ట్రక్చరల్ హార్ట్ సమస్య, గుండెపోటు, కార్డియోమయోపతి వెంట్రిక్యులర్ డిస్‌ఫంక్షన్ వంటివి సమర్థవంతంగా అంచనా వేస్తారు.
రక్తపరీక్ష
గుండె జబ్బును గుర్తించడానికి అధిక కొలెస్ట్రాల్, ప్లాస్మా సిరమైడ్‌లు, నాట్రియురేటిక్ పెప్టైడ్, ట్రోపోనిన్ T మరియు అధిక-సున్నితత్వం కలిగిన సి-రియాక్టివ్ ప్రోటీన్ వంటి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
Also read: వైట్ చాక్లెట్ రోజుకో ముక్క తింటే చాలు, జ్ఞాపకశక్తిలో పెరుగుదల
Also read: గర్భిణులు ఆకుకూరలు తింటే శిశువులు ఏడుస్తారు, క్యారెట్లు తింటే నవ్వుతారు, అదిరిపోయే అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.