Women's Equality Day 2022: మహిళా సమానత్వ దినోత్సవం ఎలా మొదలైంది? ఆగస్టు 26నే జరిపేందుకు కారణం ఏమిటీ?
సమానత్వం కోసం మహిళలు చేసిన పోరాటానికి గుర్తే ఈ మహిళా సమానత్వ దినోత్సవం.
స్త్రీ అంటే వంటింటికి మాత్రమే పరిమితం అనేది కొన్నేళ్ళ క్రితం మాట. కానీ ఇప్పుడు మాత్రం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంటి పనుల దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు మహిళలు తమ ప్రతిభ ఏంటో నిరూపించుకుంటున్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఎన్నో ఏళ్లుగా మహిళలు పోరాటాలు చేశారు. కనీసం ఇళ్ల నుంచి బయటకి వచ్చే స్వేచ్చ కూడా లేని రోజులు ఉండేవి. విద్యాలయాల్లో, పని చేసే కార్యాలయాల్లో కూడా మహిళల పట్ల వివక్ష చూపించే వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో అయితే స్త్రీలు తమ ముఖం ఇంట్లో పురుషుడికి తప్ప వేరే వాళ్ళకి కూడా చూపించకూడదు అనే ఆంక్షలు ఉండేవి. సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. మగవారితో సమానంగా న్యాయమైన వాటాను పొందడంలో మహిళలు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తున్నారు. వాళ్ళ శ్రమని గుర్తిస్తూ ఏటా ఆగస్టు 26న మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ రోజు(ఆగస్ట్ 26)ను సెలబ్రేట్ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా మహిళల సంఘాలు కూడా ఘనంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వాలనేది ఈ రోజు ప్రత్యేకత.
ఆగస్టు 26 నే ఎందుకు జరుపుకుంటారు?
సాధారణంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారనే విషయం చాలా మందికి తెలుసు. కానీ సమానత్వ దినోత్సవం చాలా వరకు తెలియదు. అమెరికాలో 1919 జూన్ 4న మహిళలందరికి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ అమెరికా చట్ట సభలో బిల్లుని ప్రవేశపెట్టారు. దానికి 1920 ఆగస్టు 18న ఆమోదిస్తూ అమెరికా మహిళలందరికి ఓటు హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హక్కుల కోసం అక్కడ సుదీర్ఘకాలం పాటు ఈ ఉద్యమం సాగింది. తర్వాత 1970 లో ఆగస్టు 26 న అమెరికా రాజ్యాంగంలోని 19 వ సవరణ తీసుకొచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో అక్కడి నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ మహిళల సమానత్వం కోసం సమ్మెకి పిలుపునిచ్చారు. వాళ్ళ పోరాటాన్ని గుర్తిస్తూ యూఎస్ 37 వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అధికారికంగా ఆగస్టు 26వ తేదీని మహిళా హక్కుల దినోత్సవంగా ప్రకటించారు. అలా చేసిన మొదటి అధ్యక్షుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అప్పటి నుంచి ప్రతి యూఎస్ అధ్యక్షుడు ఆగస్టు 26వ తేదీన మహిళా సమానత్వ దినోత్సవంగా పరిగణిస్తారు.
భారత్ లో ఎందుకు జరుపుకోవాలి?
భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళల పట్ల వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంటా బయట అన్ని చోట్ల లింగ వివక్ష చూపిస్తున్నారు. మహిళలు తమ జీవితాల్లో ముందడుగు వేయాలంటే అమెరికాలో మాదిరిగా భారత్ లో కూడా జరగాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో ఇప్పటికీ కొంతమంది సమాజంలో బాలికలకి అన్యాయం చేస్తున్నారు. అది రూపుమాసిపోవాలంటే మహిళలకు అన్నింటిలోనూ సమాన అవకాశాలు ఉండాలి. ఇటువంటి ధోరణి మారి మన దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే మహిళా సాధికారత జరగాలి. అన్ని రంగాల్లోనూ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మహిళా సాధికారతకి నిజమైన అర్థం వస్తుంది.
Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి
Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు