Winter Special Laddu : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా తినాల్సిన లడ్డూలు ఇవే.. టేస్టీ రెసిపీ
Protein Laddu Recipe : చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వేడి చేసి.. చలి నుంచి రక్షిస్తాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

Chana Dal and Dry Fruits Laddus Recipe : చలి పెరిగినప్పుడు శరీరానికి శక్తిని, వెచ్చదనాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. చలికాలంలో రుచిగా ఉండటమే కాకుండా శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో బయట వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అయితే ఇంట్లో తయారుచేసిన కొన్ని ప్రత్యేకమైన లడ్డూలు శరీరానికి సహజంగా వెచ్చదనాన్ని ఇస్తాయి. పైగా ఈ లడ్డూలను ఈ రోజుల్లో చాలా మంది ఇష్టపడుతున్నారు. వీటిని రోజూ తినడం వల్ల కండరాలు బలపడతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. శక్తి లభిస్తుంది. కాబట్టి చలికాలంలో ఏ పదార్థాలతో లడ్డూలు తయారుచేసుకోవచ్చో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
చలికాలంలో బెస్ట్ లడ్డూలు
చలికాలంలో శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలను ఇంట్లో తయారు చేసుకోవాలి. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. చలి నుంచి రక్షిస్తాయి. ఈ లడ్డూలను చలికాలానికి పవర్ హౌస్‌గా కూడా పరిగణిస్తారు. కాబట్టి.. మీరు ప్రతిరోజూ చలికాలంలో ఒక శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డూ తింటే.. శరీరం మంచి మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను పొందుతుంది. ఇది కండరాలను బలపరుస్తుంది. శరీరంలో శక్తిని నిలుపుతుంది. శనగపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలయిక చలికాలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మెరుగైన జీర్ణక్రియ
చలికాలంలో మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే.. శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది కడుపును తేలికగా ఉంచుతుంది. అలాగే చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని బలపరుస్తుంది.
శనగపప్పు బెస్ట్ అంటే..
శనగలను ప్రోటీన్ కోసం ఉత్తమ శాఖాహార వనరుగా పరిగణిస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు b1, b2, b3, b9, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, జింక్, అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని చలి నుంచి రక్షించడానికి, శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
లడ్డూలు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు
- శనగపప్పు
- నెయ్యి
- బెల్లం
- యాలకులు పొడి
- కుంకుమ పువ్వు
- పిండి
- జీడిపప్పు
- బాదం
- మఖానా
తయారుచేసే విధానం
- ముందుగా శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేయడానికి.. మొదట ఒక పాన్‌లో నెయ్యి వేసి శనగపప్పును బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పప్పు పొట్టు తీసినది కాకుండా చూసుకోండి. తరువాత వేయించిన పప్పును చల్లార్చి మిక్సర్‌లో వేసుకోవాలి.
- తరువాత ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేరుశెనగ, జీడిపప్పు, బాదం, మఖానాను వేయించి.. చల్లార్చుకోవాలి. తర్వాత పౌడర్ చేసుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని నెయ్యిలో వేయించాలి. పిండి వేగిన తర్వాత శనగపప్పు పొడిని కలపాలి.
- అన్ని పదార్థాలను వేయించిన తర్వాత.. మరొక పాన్‌లో బెల్లం, కొద్దిగా నీరు వేసి తీగ పాకం తయారు చేయాలి. ఇందులో శనగపప్పు మిశ్రమం, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- అన్ని పదార్థాలను బెల్లం పాకంలో కలిపిన తర్వాత.. ఆ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిశ్రమం కొద్దిగా తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకోవాలి.
అంతే టేస్టీ, హెల్తీ లడ్డూలు రెడీ. అయితే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చని చెప్తున్నారు. చలికాలంలో ఇమ్యూనిటీ కోసం హెల్తీగా స్నాక్‌గా తినవచ్చు. మీరు కూడా వీటిని ఇంట్లో ట్రై చేసి.. టేస్టీ ఫుడ్‌ని ఆస్వాదించండి.






















