Snake vs Mongoose: పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు ఎందుకు? కారణం ఇదే..
పాము కాటువేస్తే ఏ జీవైనా చనిపోతుంది. అయితే, ముంగిసలకు మాత్రం ఏమీ కాదు. పాముపై ఎప్పుడు అవే విజయం సాధిస్తాయి. ఎందుకు?
పాముకు ఎదురెళ్లినా మనకే రిస్కు.. పాము ఎదురైనా మనకే రిస్కు. అది కాటేస్తే.. డైరెక్టుగా పైకే. టైమ్ బాగుంటేనే బతికి బట్టకట్టగలం. మనుషులే కాదు.. పెద్ద పెద్ద జంతువులు కూడా పామును చూడగానే భయపడతాయి. కాటేస్తే తిప్పలేనని పక్కకు తప్పుకుంటాయి. అయితే, ఒక్క ముంగిస మాత్రమే దానికి ఎదురెళ్లి.. ముప్పు తిప్పలు పెడుతుంది. చివరికి పైచేయి సాధిస్తుంది. ఈ పోరాటంలో పాము తన ఆత్మరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కసిదీరా కాటేసి చంపాలని చూస్తుంది. కానీ, ముంగిసకు ఏమీ కాదు. దాని ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది పోరాడుతూనే ఉంటుంది. పామును చంపిన తర్వాతే అది అక్కడ నుంచి కదులుతుంది. వాటి మధ్య వైరం ఎందుకో చెప్పడం కష్టమే. కానీ, రెండు ఎదురుపడితే మాత్రం ఫైటింగ్ పక్కా. మరి, పాము కాటేసినా ముంగిసకు ఏమీ కాదు ఎందుకు? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు కూడా ముంగిస.. ఇమ్యునిటీ సీక్రెట్‌ను తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని కీలక విషయాలు తెలిశాయి.
ముంగిస గురించి తెలుసుకొనే ముందు పాములు గురించి తెలుసుకోవాలి. పాములు తాము కాటేసుకున్నా చనిపోలేవు. వాటి కోరల్లోని విషం చర్మంలో విస్తరిస్తుందేగానీ.. లోపలికి ప్రవేశించదు. ఇందుకు కారణం దాని శరీర నిర్మాణం. చిత్రం ఏమిటంటే.. ముంగిసలు పాము జాతికి చెందినవి కాకపోయినా.. వాటి శరీరం, కండరాలు పాముల తరహాలోనే విషాన్ని అంతర్గత భాగాల్లోకి విస్తరించకుండా కాపాడతాయి. ముంగిసల సీక్రెట్ తెలుసుకోవడం కోసం ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు జరిపిన పరివోధనల్లో ఈ విషయం తెలిసింది.
పాములు కాటేసినా ముంగిసలు ఎందుకు చనిపోవు? వాటి శరీరం విషంతో పోరాడే రసాయనాలను విడుదల చేస్తుందా? అనే కోణంలో పరిశోధనలు చేపట్టారు. ఆ రసాయనాల ద్వారా మనుషులకు అవసరమైన ఔషదాలను తయారు చేయాలనేది వారి ప్లాన్. పాము కాటుకు గురయ్యేవారు తక్షణమే కోలుకోనేందుకు ఆ ఔషదం ఉపయోగపడుతుందని భావించారు. అయితే, శాస్త్రవేత్తల ఆశలు అడియాశలే అయ్యాయి. పాము విషాన్ని ఎదుర్కోడానికి ముంగిస ఎలాంటి యాంటీ వెనమ్ రసాయనాన్ని రిలీజ్ చేయదు. కేవలం దాని కండరాల్లోని గ్రాహక అణువులు (Receptor Molecules) వల్లే పాము విషం శరీరంలోకి చేరడం లేదని కనుగొన్నారు.
పాము విషంలోని ఆల్ఫా-న్యూరోటాక్సిన్ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కండరాలు, నరాలను పనిచేయకుండా చేస్తాయి. దీంతో పాము కాటుకు గురయ్యే బాధితుడు పక్షవాతానికి గురికావడం లేదా చనిపోవడం జరుగుతుంది. అయితే, ముంగిస శరీరంపై ఉండే ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు ఆల్ఫా-న్యూరోటాక్సిన్‌ను అడ్డుకుంటాయి. దానివల్ల పాము కాటేసినా.. ఏమీ కాదు. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కాటేసినా.. ముంగిసకు ఏమీ కాదు. అయితే, దేనికైనా ఒక పరిధి ఉంటుంది. పాము పదే పదే కాటు వేస్తూ విషం మోతాదును పెంచితే మాత్రం ముంగిసకైనా మరణం తప్పదు. అయితే, ముంగిస అన్నిసార్లు కాటు వేసే అవకాశాన్ని పాములకు ఇవ్వదు. చాలా వేగంగా కాటు నుంచి తప్పించుకుంటుంది. తెలివిగా పోరాడుతుంది. వాటి కాళ్లకు ఉండే పదునైన గోళ్లతో పామును గాయపరుస్తుంది. పళ్లతో తలను పట్టుకుని చంపేస్తుంది.