Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?
తలస్నానం చేసిన తర్వాత జుట్టు కాస్త రఫ్ గా ఉంటుంది. దాన్ని మృదువుగా మార్చేందుకు చాలా మంది కండిషనర్ పెడతారు.
కాలుష్యం, దుమ్ము, వేడి వాతావరణం, ఒత్తిడి నుంచి జుట్టుని రక్షించుకోవడానికి అదనపు సంరక్షణ చాలా అవసరం. షాంపూతో జుట్టు శుభ్రం చేసుకోవడం వల్ల తలపై మురికి పోతుంది. కానీ జుట్టు గరుకుగా, డల్ గా మారిపోతుంది. అందుకే దాన్ని సాఫ్ట్ చేసుకోవడం కోసం కండిషనర్ పెడతారు. జుట్టు సంరక్షణలో కండిషనింగ్ చాలా ముఖ్యమైన భాగం. కండిషనర్ అనేది మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎమోలియెంట్స్, సిలికాన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి జుట్టు తేమని తిరిగి నింపుతాయి. జుట్టు చివర్ల సున్నితంగా చేస్తాయి. అయితే తలస్నానం చేసిన ప్రతీసారి కండిషనర్ అవసరమా? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. ఇది జుట్టుకి అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది.
స్ప్లిట్స్ తగ్గిస్తుంది
జుట్టు పెళుసుగా, పొడిగా మారినప్పుడు స్ప్లిట్స్ ఏర్పడతాయి. దాని వల్ల జుట్టు చివర్ల చీలిపోతుంది. అవి జుట్టు పెరుగుదలని నిరోధిస్తాయి. కండిషనర్ ఉపయోగించడం వల్ల జుట్టు స్ప్లిట్స్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. జుట్టుకు మృదుత్వంతో పాటు పోషణ అందిస్తుంది. సహజమైన మెరుపుని ఇస్తుంది. కండిషనర్ వల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు చిట్లకుండ కాపాడుతుంది.
పొడిగా ఉండనివ్వదు
రెగ్యులర్ గా షాంపూ చేయడం వల్ల స్కాల్ఫ్ లోని సహజ నూనె తొలగిపోతుంది. తేమని నిలుపుకోవడం కష్టంగా మారి పొడిగా అయిపోతుంది. ఈ పొడిదనం నుంచి బయట పడేందుకు కండిషనర్ ఉపయోగపడుతుంది. జుట్టు లోపలి వరకు వెళ్లి తేమని అందిస్తుంది.
జుట్టు చిక్కు పడకుండా చేస్తుంది
తలస్నానం చేసినప్పుడు కొద్దిగా జుట్టు చిక్కుబడుతుంది. దాన్ని విడదీసేందుకు కండిషనర్ సహాయపడుతుంది. కండిషనర్ స్కాల్ఫ్ ని హైడ్రేట్ చేస్తుంది. దువ్వెన పెట్టినప్పుడు జుట్టు చిక్కు లేకుండా సులభంగా దువ్వుకోవచ్చు. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ధృడంగా ఉండేలా చేస్తుంది.
జుట్టు మెరుపుని కాపాడుతుంది
క్లోరినేటెడ్ నీటిలో ఈత కొట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. దాన్ని కాపాడుకోవాలంటే జుట్టుకి తప్పనిసరిగా కండిషనర్ పెట్టడం అవసరం. ఇది జుట్టుకి రక్షణగా పని చేస్తుంది. జుట్టు తంతువులని కాపాడుతుంది. కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు సహజమైన రంగు పోకుండా నివారిస్తుంది. అందుకే జుట్టుని షాంపూ చేసిన తర్వాత ప్రతిసారీ కండిషనర్ ఉపయోగించడం మర్చిపోవద్దు. అలా చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.
ఎటువంటి కండిషనర్ పెడుతున్నామనేది కూడా ముఖ్యమే. కెమికల్స్ ఎక్కువగా ఉండకుండా సహజమైన పదార్థాలతో తయారు చేసే కండిషర్స్ ఎంచుకోవడం తప్పనిసరి. నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న కండిషనర్స్ పెట్టడం వల్ల జుట్టుకి కావలసిన పోషణ అందుతుంది. ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. నాణ్యత లేని కండిషనర్స్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కండిషనర్స్ కొనుగోలు చేసే ముందు ఏయే పదార్థాలతో వాటిని తయారుచేశారనేది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బరువు తగ్గించే ఈ ఐదు ఆహారాలు మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచుకోండి