Dogs: వేసవిలోనే కుక్కలు మనుషులను అధికంగా కరుస్తాయి ఎందుకు?
వేసవి వచ్చిందంటే కుక్కలు రెచ్చిపోతాయి. మనుషుల మీద దాడి చేస్తాయి.
వానాకాలం, శీతాకాలంలో కుక్క కాటు బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ వేసవి వచ్చిందంటే రోజూ ఏదో ఒక ప్రాంతంలో కుక్క కాటు కేసులు నమోదవుతూనే ఉంటాయి. అంతవరకు బాగానే ఉన్న కుక్కలు అకస్మాత్తుగా మనుషుల మీద దాడి చేసి కండలు పీకేస్తాయి. ఎండాకాలంలోనే కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయి. దీనికి కారణాన్ని వివరిస్తున్నారు నిపుణులు. మనుషుల్లాగే కుక్కలు కూడా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. ఇవి రోడ్ల మీదే వేడి వాతావరణంలోనే తిరుగుతూ ఉంటాయి. ఆ వేడికి వాటి శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
మనుషుల మాదిరిగానే వేడి వాతావరణంలో కుక్కల స్వభావం కూడా మారుతుంది. ఎండలోనుంచి వచ్చిన వ్యక్తి చాలా చికాకుగా ఉంటాడు. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. కుక్కల మానసిక పరిస్థితి కూడా వేసవిలో అలాగే ఉంటుంది. అవి చాలా దూకుడుగా, కోపంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటికి ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండవు. దీని వల్ల అది డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇలా డీ హైడ్రేషన్‌కు గురైన కుక్క ఎవరినైనా కరిచే అవకాశం ఎక్కువ. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం కేవలం వీధి కుక్కలు మాత్రమే కాదు, వేసవిలో పెంపుడు కుక్కలు సైతం ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాకపోతే వీధి కుక్కలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. కుక్క కరిచేటప్పుడు 34 శాతం తల, మెడ, బుగ్గలపూ దాడి చేస్తాయి. 21 శాతం పెదవులపై, 8 శాతం ముక్కు, చెవులపై కరుస్తాయి. కొన్ని సార్లు పాదాలు, చీలమండలపై కూడా కరుస్తాయి.
ఆడకుక్కలు ఆ సమయంలో...
ఆడ శునకాల్లో లైంగిక హార్మోన్లు విడుదలవుతున్న సమయంలో కూడా అది దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఒత్తిడి, ఆందోళనకు గురవుతాయి. ఆ సమయంలో అవి కరిచే అవకాశం ఉంది. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది.
కరుస్తుందని చెప్పే సంకేతాలు
కుక్కల ప్రవర్తనను బట్టి అవి కరుస్తాయో లేదో అంచనా వేయచ్చు. అవి కొన్ని రకాల లక్షణాలను చూపిస్తాయి.
1. దంతాలు పటపట కొరకడం
2. కోపంగా అరవడం
3. తోక వేగంగా ఊపడం
4. తదేకంగా చూడడం
5. చెవులు కిందకి వెనుకకు వంచినట్టు చేయడం
వేసవిలో వీధి కుక్కలకి దూరంగా ఉండడం మంచిది.
Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.