Triglycerides: ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ఇవి గుండెకు చేసే నష్టాలేమిటీ? ఏ ఆహారంతో వాటిని అడ్డుకోవచ్చు?
గుండెకి హాని చేసే కొవ్వు అంటే అది చెడు కొలెస్ట్రాల్ అని అందరూ అనుకుంటారు. కానీ అదే కాదు ట్రైగ్లిజరైడ్ కొవ్వు కూడా పరిమితికి మించి ఉంటే గుండె ప్రమాదంలో ఉన్నట్టే.
ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో కనిపించే కొవ్వు రకం. మనం తినే ఆహారాలలో ఉండే కొవ్వుని అదనపు కేలరీలుగా మారుస్తాయి. ఇవి కార్బోహైడ్రేట్ల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇవి శరీరానికి శక్తి వనరు. కొవ్వు కణాలలో నిల్వ ఉంటాయి. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు వినియోగిస్తుంది. ఇవి సాధారణ స్థాయిలో ఉన్నంత వరకు ఆరోగ్యకరమే. కానీ పరిమితి దాటితే మాత్రం శరీరానికి హానికరమే. ముఖ్యంగా గుండెకు ముప్పు తప్పదు.
ట్రైగ్లిజరైడ్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగితే గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్సులిన్ అసమతుల్యతకి కూడా దారి తీయవచ్చు. అది మాత్రమే కాదు ధమనులు బిగుసుకుపోయేలా చేస్తుంది. దీన్నే ఆర్టేరియోస్కర్లోసిస్ అంటారు. ఇది స్ట్రోక్, గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ప్యాంక్రియాస్ వాపుకు కారణం కావచ్చు. అందుకే వీటి సరైన స్థాయిలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు చక్కగా ఉపయోగపడతాయి.
పసుపు
డిటాక్స్ వాటర్, సూప్ లేదా టీ దేనికైనా పసుపు జోడించుకోవడం మంచిది. ఇది శరీరంలోని ట్రగ్లిజరైడ్ స్థాయిల కారణంగా వచ్చే మంటని నయం చేయడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీకి మేలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
ఆకు కూరలు
బచ్చలి కూర, కాలే, బ్రకోలి వంటి ఆకు కూరలు సహజంగా ట్రైగ్లిజరైడ్ స్థాయిలని తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇందులోని విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు రక్త ప్రవాహంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది.
తృణధాన్యాలు
ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ వంటి తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్
గుండెకి మేలు చేసే వంట నూనెలో ఆలివ్ ఆయిల్ అగ్రస్థానం అనే చెప్పాలి. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ లని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కొవ్వు చేపలు
సాల్మన్, ట్రౌట్, ట్యూనా వంటి కొవ్వు చేపలు తీసుకోవడం వల్ల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ ని తగ్గించడమే కాదు మంటని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
నట్స్
రోజువారీ ఆహారంలో గింజలు చేర్చుకోవడం వల్ల గుండె మాత్రమే కాదు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇవి గుండెకి మేలు చేసేందుకు దోహదపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ స్పెషల్ టీలు తాగారంటే వర్షాకాలంలో రోగాల భయమే అక్కర్లేదు