Discovery: మనం చనిపోయే ముందు మెదడులో ఏం జరుగుతుంది? తెలుసుకునేందుకు బ్రెయిన్‌ను మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు
ఒక రోగి చనిపోయే ముందు, తరువాత మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు.
మరణం.. ఎప్పుడు ఒక మిస్టరీనే. మరణించడానికి ముందు మన మెదడు ఏం ఆలోచిస్తుంది? మరణించాక ఏం జరుగుతుంది? ఈ రెండూ కూడా అంతుతేలనివి. వాటి అంతుతేల్చాలనే ఉద్దేశంలోనే శాస్త్రవేత్తలు ఎన్నాళ్ల నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఓ అరుదైన అవకాశం చిక్కింది. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు అతని మెదడులో ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకునే వీలు చిక్కింది. ఎలా అంటే...
అమెరికాలో 87ఏళ్ల మూర్చరోగి ఆసుపత్రిలో చేరారు. అతని మూర్ఛలను గుర్తించడానికి వైద్యులు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫీ (EEG) చేశారు. అయితే హఠాత్తుగా రోగి గుండెపోటుతో మరణించారు. ఇలా జరగడం వల్ల మరణిస్తున్న వ్యక్తి మెదడు ఆలోచించడాన్ని లేదా కార్యాచరణను రికార్డు చేసేందుకు శాస్త్రవేత్తలకు వీలు చిక్కేలా చేసింది. అతని మరణం, ఆ సమయంలో అతని మెదడు చేస్తున్న పనిని EEG పరికరం రికార్డు చేసింది. ఈ పరిశోధనా వివరాలను స్కై న్యూస్ తో పాటూ, ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. దాని ప్రకారం రోగికి అమర్చిన ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ మరణానికి ముందు, తరువాత కలిపి దాదాపు 15 నిమిషాల పాటూ మార్పులను రికార్డు చేస్తూనే ఉంది.
ఏం కనిపెట్టారు?
EEG మెషీన్ రోగి చివరి గుండె చప్పుడుకు ఇరువైపులా 30 సెకన్లలో మెదడులో ఒక నిర్ధిష్టరకమైన తరంగాలను కలిగిందని, అందులో పెరుగుదల అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మెదడు తరంగాలను గామా తరంగాలు అంటారు. ఇవి అధునాతనమైన కాగ్నిటివ్ విధులను కలిగిఉంటాయి. అంటే ఏకాగ్రత, కలలు కనడం, ధ్యానం, జ్ఞాపకాలు, సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో చురుకుగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తల ఇచ్చిన నివేదిక ప్రకారం రోగి గుండె కొట్టుకోవడం ఆగిపోయే ముందు, తరువాత గామా తరంగాలలో పెరుగుదల కనిపించింది. అంటే చనిపోవడానికి ముందు తన జీవితం అంతా ఒక ఫ్లాష్ లా గుర్తు వచ్చి ఉండొచ్చు, జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నారు పరిశోధకులు. అయితే మొత్తం ప్రక్రియను ఒక అధ్యయనంగా భావించలేమని, అనుకోకుండా బయటపడిన ఒక పరిశోధనా ఫలితంగానే చూడాలని చెప్పారు. చివరిక్షణాలలో ఏంజరుగుతుందో తెలుసుకోవాలంటే లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, శోధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ఎన్నో అధ్యయనాలు చేయాల్సి వస్తుందని తెలిపారు.
Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి
Also read: మధుమేహులకు బెస్ట్ ఫుడ్ కొర్రల కిచిడీ, వారానికోసారి తిన్నా ఎంతో ఆరోగ్యం