Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి
ఎయిర్ ఫ్రైయర్ ఎలా పనిచేస్తుందో, దాని వల్ల ఉపయోగాలేంటో చాలా మందికి తెలియవు. వారి కోసమే ఈ కథనం.
గణాంకాల ప్రకారం చూస్తే చాలా దేశాల్లో ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకం పెరుగుతోంది. అవి వచ్చిన కొత్తలో పెద్దగా వాటిని ఎవరూ వాడేందుకు ఇష్టపడలేదు కానీ ఇప్పుడు మాత్రం అనేక మంది ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నూనెతో వండిన వంటకాలు తినేందుకు ఇష్టపడని వారు ఎయిర్ ఫ్రైయర్లలో వండుకుంటారు. దీనిలో అతి తక్కువ నూనెతోనే వేపుళ్లు చేసుకోవచ్చు. అంతేకాదు త్వరగా అయిపోతుంది, పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా.
ఎలా పనిచేస్తుంది?
అతి తక్కువ నూనెతోనే ఎయిర్ ఫ్రైయర్ చక్కగా వేయించేస్తుంది. అదెలా అంటే ఆహారం చుట్టూ వేడి గాలిని వెదజల్లుతుంది. ఆ గాలికే పదార్థాలు ఉడికిపోతాయి.దీనిలో ఉండే చిన్న ఫ్యాన్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. చికెన్ ఫ్రై చేయాలంటే ఓవెన్లో ఎక్కువ సమయం పడుతుంది. స్టవ్ మీద కూడా 40 నిమిషాలకు మించే వేగుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో ఓసారి పదార్థాలు వేస్తే మరి చూసుకో అక్కర్లేదు. చాలా సులువుగా వండేస్తుంది. కరకరలాడేటా క్రిస్పీగా వేపుళ్లు చేయడంలో ఎయిర్ ఫ్రైయర్ బాగా పనిచేస్తుంది. ఫ్రైంచ్ ఫ్రైస్, అరటి కాయ వేపుడు, బంగాళాదుంప వేపుడు, చికెన్ వింగ్స్, చికెన్ లెగ్ పీస్, చేప ముక్కల ఫ్రై లాంటివి ఇందులో చక్కగా అవుతాయి.
ఆరోగ్యానికి మంచివేనా?
అధికంగా నూనెతో వండిన వంటలు తినడం వల్ల చాలా ఆరోగ్యసమస్యలు వస్తాయి. అదే ఎయిర్ ఫ్రైయర్లో వండితే అతి తక్కువ నూనెతోనే వండుకోవచ్చు. అందుకే ఆరోగ్యకరమనే చెప్పాలి. సాధారణంగా చికెన్ వేపుడు, బంగాళాదుంపలు వేపేందుకు చాలా నూనె అవసరం అవుతుంది. కానీ ఎయిర్ ఫ్రైయర్లో కేవలం అర స్పూనూ నూనెతో వండేసుకోచ్చు.
కరెంటు...?
ఎయిర్ ఫ్రైయర్ ఓ ఎలక్ట్రానిక్ వస్తువు. అది కరెంటు మీదే పనిచేస్తుంది. అలాగని అతిగా విద్యుత్ కాల్చేయదు. ఓవెన్ తో పోలిస్తే దాని కన్నా ఇది తక్కువగానే కాలుస్తుంది. ఓవెన్లో గంట పాటూ ఉడికే ఆహారం, ఎయిర్ ఫ్రైయర్లో కేవలం 20 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. అయితే దీని పరిమాణంతోనే సమస్య. ఎయిర్ ఫ్రైయర్లో ఆహారం వేసే కంపార్ట్‌మెంట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఇద్దరి నుంచి ముగ్గురికే వేపుళ్లు సరిపోతాయి. అంతకుమించి సరిపోయేలా వండాలంటే రెండు మూడు ట్రిప్పులు వండుకోవాలి.
ధర...?
సాధారణమైనవి రూ. 2000 నుంచి మొదలవుతున్నాయి. కానీ బ్రాండెడ్ కావాలంటే మాత్రం రూ.7000 పెట్టాల్సిందే. అవి పనిచేసే తీరు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.
Also read: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?
Also read: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al