Vitamin E: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!
చర్మ సంరక్షణ చాలా అవసరం. విటమిన్-E ఆయిల్ తో చర్మానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
విటమిన్-E ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పవర్ హౌస్. విటమిన్-E క్యాప్స్యుల్స్‌లో ఉండే నూనె అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అందాన్ని రెట్టింపు చేయడంలో విటమిన్-E ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. జుట్టు పెరుగుదలకి కావాల్సిన చక్కని పోషక పదార్థం ఇది. యాంటీ ఆక్సిడెంట్ లా పని చేసి జుట్టు కుదుళ్ల నుంచి రిపేర్ చేస్తుంది. వెంట్రుకలు ఊడకుండా చేయడమే కాదు కొత్త వెంట్రుకలు వచ్చేందుకు కూడా సహకరిస్తుంది.
గోర్లు పెరుగుదల
ఆడవాళ్ళు ఇంటి పనుల్లో భాగంగా బట్టలు ఉతకడం, వంటలు చేయడం, అంట్లు తోమడం, తోటపని చేస్తూనే ఉంటారు. వాటి వల్ల వాళ్ళ చేతులు, గోర్లు పాడైపోతాయి. గోర్లు విరిగిపోవడం, సరిగా పెరగకపోవడం జరుగుతుంది. పనుల వల్ల గోర్లు పగిలిపోవడం, చిట్లి పోవడం అందరూ ఎదుర్కొనే సమస్య. గోర్లు చెడిపోవడం వల్ల పసుపు రంగులోకి మారిపోతాయి. ఒక్కోసారి విరిగిపోతాయి. దీన్ని నివారించడానికి విటమిన్ ఈ క్యాప్స్యుల్స్ బాగా పని చేస్తాయి. గోర్లు, క్యూటికల్స్, గోళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవడానికి విటమిన్-E క్యాప్సుల్‌లో ఉండే నూనెను ఉపయోగించొచ్చు. నిద్రకు ముందు ఆ నూనెను గోళ్ళకి అప్లై చేసుకుంటే మంచిది. గోర్లు చక్కగా పెరుగుతాయి.
మాయిశ్చరైజింగ్ క్రీమ్
రెగ్యులర్ గా రాత్రి వేళ రాసుకునే క్రీములో కొద్దిగా విటమిన్-E ఆయిల్ వేసుకుని మిక్స్ చేసి మొహానికి అప్లై చేసుకోవచ్చు. ఇది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇది సీరంలా పని చేసి రాత్రి సమయంలో మొహానికి తేమని అందిస్తుంది. నూనె రాసుకున్న వెంటనే పడుకోవడం వల్ల అది దిండ్లు, బెడ్ షీట్స్ కి అవుతుంది. అందుకే నిద్రకి ఉపక్రమించడానికి కనీసం 30 నిమిషాల ముందు రాసుకోవాలి. అలా చేస్తే ముఖానికి బాగా పడుతుంది.
జుట్టు బాగా పెరగాలంటే..
విటమిన్-E జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలని అందిస్తుంది. క్యాప్స్యుల్స్ నుంచి నూనెని బయటకి తీసి రెగ్యులర్ హెయిర్ ఆయిల్ తో కలపాలి. ఆ నూనెని జుట్టుకి రాసుకుని సున్నితంగా మసాజ్ చేసి 2-3 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. షాంపూ, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.
ముడతలు తగ్గిస్తుంది
చర్మంపై ముడతలు తగ్గించుకోవడానికి చక్కగా పని చేస్తుంది. విటమిన్-E నూనె యాంటీ ఏజింగ్ క్రీమ్ గా ఉపయోగించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లుతో లోడ్ చేయబడిన ఈ నూనె చర్మం మీద మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మ నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా దృఢంగా మారుస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.
వడదెబ్బ నుంచి రక్షణ
ఎండలోకి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలడం వల్ల చర్మం కమిలిపోయినట్టుగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో విటమిన్ ఈ ఆయిల్ ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి సహజ తేమని అందిస్తాయి. చర్మం కమిలిపోయినా, కాలినా, దురదగా ఉన్నప్పుడు విటమిన్ ఇ నూనెని కూలింగ్ క్రీమ్ తో కలిపి రాసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి చల్లగా అనిపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఇవి తరచూ తింటే అల్జీమర్స్ తగ్గించుకోవచ్చు, జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు