Typhoid Diet : టైఫాయిడ్ వస్తే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఇవే.. జ్వరం తగ్గిన తర్వాత రికవరీ కోసం ఇవి తినండి
Typhoid Diet Plan : టైఫాయిడ్ వచ్చిందా? అయితే ఈ సమయంలో తినాల్సిన ఫుడ్స్ ఏంటో.. వేటిని తినకూడదో.. జ్వరం ఉన్నప్పుడు ఎలాంటి వాటిని తినకపోవడం మంచిదో చూసేద్దాం.

- కారం, మసాలాలు, వేపుళ్లు మాని వైద్యుల సూచనలు పాటించండి.
Eat and Avoid Foods During Typhoid : టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా నీరసంగా ఉంటుంది. ఆకలి తగ్గిపోవడం, కడుపునొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సమయంలో ఏది పడితే అది తినడం కంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జ్వరం తగ్గిన తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. వేటిని దూరంగా ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
టైఫాయిడ్
టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీనిని తగ్గించుకునేందుకు వైద్యుల సూచనల ప్రకారం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం శరీరానికి పోషకాలు, శక్తిని అందించి కోలుకోవడంలో హెల్ప్ చేస్తుంది కానీ.. ఇన్ఫెక్షన్‌ను నయం చేయదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరి WHO ప్రకారం టైఫాయిడ్ వచ్చినప్పుడు తినాల్సిన ఫుడ్స్ ఏంటో.. తగ్గిన తర్వాత ఏవి తింటే త్వరగా కోలుకుంటారో చూసేద్దాం.
Also Read : జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
టైఫాయిడ్ సమయంలో తీసుకోవాల్సిన ఫుడ్స్
టైఫాయిడ్ సమయంలో ఆకలి తగ్గిపోతుంది. దీంతో కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపించవచ్చు. అలాంటప్పుడు అన్నం, పెసరపప్పుతో మెత్తని ఖిచిడీ చేసుకోండి. తక్కువ మసాలాలతో, బాగా ఉడికించి తీసుకుంటే నోటికి రుచిగానూ.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే కారం, నూనె తగ్గించాలి. ఇడ్లీలు, రవ్వ ఉప్మా, గంజి వంటి సులభంగా జీర్ణయ్యే ఆహారాలు తీసుకోవాలి.
పండ్లు తినాలనిపిస్తే బాగా పండిన అరటిపండు, తొక్క తీసిన ఆపిల్ లేదా ఉడికించి మెత్తగా చేసిన ఆపిల్ తినవచ్చు. పచ్చి కూరగాయలు, సలాడ్లకు బదులుగా క్యారెట్, సొరకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను బాగా ఉడికించి మెత్తగా చేసుకుని తినవచ్చు. ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఉడికించిన గుడ్డు, తక్కువ మసాలాలతో చేసిన చికెన్ సూప్, మెత్తగా ఉడికించిన పప్పు వంటివి తినాలి. జీర్ణ సమస్యలు ఉంటే దానికి తగ్గట్లు మీల్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగడం మంచిది. వైద్యుల సూచన మేరకు ORS, పెరుగు, మజ్జిగ కూడా తాగవచ్చు.
Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
రికవరీ కోసం ఏ ఫుడ్స్ తినాలి?
టైఫాయిడ్ నుంచి రికవరీ కోసం డైట్ మార్చుకోవాల్సి ఉంది. CBSE ఫుడ్ న్యూట్రిషన్స్ అండ్ డైటేటిక్స్ ప్రకారం.. జ్వరం తగ్గిన తర్వాత రికవరీ కోసం కొన్ని ఫుడ్స్ ఆహారంలో తీసుకోవాలి. జ్వరం తగ్గిన వెంటనే మామూలు డైట్కి మారిపోకూడదు. ఆకలి, జీర్ణశక్తి మెరుగుపడే కొద్దీ గుడ్డు, పప్పులు, పెరుగు, బాగా ఉడికించిన చికెన్ లేదా చేపలను తినవచ్చు. ఇవి కండరాల బలం తిరిగి పొందడానికి, శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.
జ్వరం తగ్గిన వెంటనే పచ్చి కూరగాయలు, ఎక్కువ పీచు ఉండే ఫుడ్ ఎక్కువగా తినకూడదు. ఉడికించిన కూరగాయలు, మెత్తని పండ్లతో ప్రారంభించాలి. కడుపు సమస్యలు లేకుండా జీర్ణమవుతున్న మీ రెగ్యూలర్ డైట్లోకి వచ్చేయవచ్చు.
Also Read : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
టైఫాయిడ్ వచ్చినప్పుడు తినకూడని ఆహారాలు ఇవే
ఎక్కువ కారం, మసాలాలు ఉన్న కూరలు, ఊరగాయలు, చట్నీలు కొంతకాలం తగ్గించాలి. ఇవి కడుపులో అసౌకర్యాన్ని పెంచుతాయి. పూరీలు, పకోడీలు, సమోసాలు, చిప్స్ వంటివి తినకూడదు. పచ్చి కూరగాయలు, పండ్లు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి వాటిని శుభ్రం చేసి.. త్వరగా జీర్ణమయ్యే వాటిని తినాలి. స్ట్రీట్ ఫుడ్కి దూరంగా ఉండాలి.
టైఫాయిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు..
టైఫాయిడ్ త్వరగా తగ్గాలంటే.. ఫీవర్ నెగ్లెక్ట్ చేయకూడదు. వైద్యుల సూచనల ప్రకారం టెస్ట్ చేయించుకోవాలి. ఆలస్యం చేస్తే టైఫాయిడ్ ముదురుతుంది. అలాగే వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సును మధ్యలో ఆపకూడదు. జ్వరం తగ్గిందని మందులు మానేయడం మంచిది కాదు. ఒకేసారి ఎక్కువగా తినకుండా ప్రతి 2లేదా3 గంటలకు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. నీరు, లిక్విడ్స్ సరిపడా తీసుకోవాలి. కొందరిలో టైఫాయిడ్ లక్షణాలు తగ్గినా.. తర్వాత కూడా కొందరిలో బ్యాక్టీరియా శరీరంలో ఉండవచ్చు. అందుకే వైద్యుల ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోండి.
Also Read : చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























