Dengue or Viral Fever : జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డెంగ్యూనా? వైరల్ ఫీవర్‌కు దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి
Fever and Body Pain : జ్వరంతో పాటు బాడీ పెయిన్స్ ఉంటే చాలామంది దానిని డెంగ్యూ అనుకుని భయపడుతూ ఉంటారు. ఎలాంటి లక్షణాలు ఉంటే వైరల్ ఫీవరో.. డెంగ్యూనో ఇప్పుడు తెలుసుకుందాం.

- జ్వర లక్షణాలు అన్ని డెంగ్యూ కావని వైద్యులు అంటున్నారు.
- కళ్ల వెనుక నొప్పి, దద్దుర్లు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
- జ్వరం తగ్గినా తీవ్ర లక్షణాలుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
- సొంత వైద్యం మానుకుని, దోమలు నివారించడం చాలా ముఖ్యం.
Dengue vs Viral Fever : హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో జ్వరంతో ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య ఈ మధ్యకాలం పెరుగుతుంది. డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో.. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపించగానే చాలామంది దానిని డెంగ్యూ అని భయపడుతున్నారు. అయితే వైద్యుల ప్రకారం ఇలాంటి లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలోనూ కనిపిస్తాయి. మరి డెంగ్యూ, సాధారణ వైరల్ ఫీవర్ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? ఏ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలో.. వైద్యుల సూచనలు ఏంటో చూసేద్దాం.
డెంగ్యూ, వైరల్ ఫీవర్ లక్షణాలు
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే అది డెంగ్యూ అనుకోకూడదు. డెంగ్యూలో సాధారణంగా అధిక జ్వరంతో పాటు తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లలో నొప్పులు, వికారం, వాంతులు లేదా చర్మంపై దద్దుర్లు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాల్లో కొన్ని ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలోనూ ఉంటాయి. అందుకే లక్షణాల ఆధారంగా సమస్యను నిర్థారించుకోకూడదు.
Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
అధిక జ్వరం ఉంటే..
వైరల్ ఫీవర్‌లోనూ జ్వరం ఎక్కువగా ఉండొచ్చు. డెంగ్యూ కూడా జ్వరంతోనే మొదలవుతుంది. అందుకే థర్మామీటర్లో ఉష్ణోగ్రత ఎక్కువగా కనిపిస్తే డెంగ్యూ అనుకోకూడదు.
ఒళ్లు నొప్పులు ఉంటే..
డెంగ్యూ వస్తే కండరాలు, కీళ్లు, ఎముకల్లో నొప్పులతో పాటు తలనొప్పి, ముఖ్యంగా కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే బాడీ పెయిన్స్ ఒక్కటే ఉంటే అది డెంగ్యూ లక్షణం కాకపోవచ్చు.
చర్మంపై దద్దుర్లు కనిపిస్తే..
డెంగ్యూ లక్షణాల్లో ర్యాష్ కూడా ఒకటి. జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
Also Read : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జ్వరం వచ్చి తగ్గిపోతే..
డెంగ్యూలో ముఖ్యమైన, ప్రమాదకరమైన లక్షణాలు కొన్నిసార్లు జ్వరం తగ్గుతున్న సమయంలో లేదా తగ్గిన తర్వాత కనిపిస్తాయి. కాబట్టి జ్వరం తగ్గితే పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు.
ప్రమాదకరమైన లక్షణాలు ఇవే..
తీవ్రమైన కడుపునొప్పి, పదేపదే వాంతులు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, వాంతుల్లో లేదా మలంలో రక్తం, తీవ్రమైన నీరసం లేదా అసహనం వంటి లక్షణాలు ఉంటే అవి డెంగ్యూ ప్రమాదకరమైన సంకేతాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
Also Read : వర్షాకాలంలో డెంగ్యూ వచ్చే అవకాశాలెక్కువ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికవరీ టిప్స్ ఇవే
స్వయంగా మందులు వేసుకోకండి..
జ్వరం వచ్చిందని మెడికల్ షాపులో సొంతంగా మందులు తీసుకోవడం కంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా డెంగ్యూ అనుమానం ఉన్నప్పుడు రక్తస్రావం వంటి సమస్యల ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మందుల విషయంలో వైద్యుల సూచనలు పాటిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
దోమల నియంత్రణ
డెంగ్యూ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించవచ్చు. అందుకే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల పెరుగుదలను అరికట్టడం, బయటకు వెళ్లేటప్పుడు దోమల నుంచి రక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం.
కాబట్టి జ్వరం వచ్చిన ప్రతిసారీ డెంగ్యూ అని భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో డెంగ్యూ అవకాశం ఉందని అనిపించే లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని.. దానికి తగ్గట్లు చికిత్స తీసుకోవడం మంచిది.
Also Read : డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్లేట్ కౌంట్‌ని పెంచే ఇంటి చిట్కాలివే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















