(Source: ECI/ABP News/ABP Majha)
Back Pain: వెన్ను నొప్పి వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు
ప్రస్తుత పరిస్థితుల్లో వెన్ను నొప్పి సర్వసాధారణం అయిపోతుంది. దీని నుంచి బయట పడాలంటే కొన్ని పనులు చేస్తే సరిపోతుంది.
వెన్ను నొప్పి అందరినీ ఇబ్బందిపెట్టేదె. గంటల తరబడి ఆఫీసులో కుర్చీకి అతుక్కుపోవడం సరైన విధంగా కూర్చుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి లేదా నడుము నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఒక్కొక్కరికి నొప్పి రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా స్ప్రే లేదా అయింట్మెంట్ వాడుతూ ఉంటారు. మరికొంతమంది యోగా, వ్యాయామాల ద్వారా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవే కాదు ఇంటి నివారణ చిట్కాలతో కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నొప్పి ఎక్కువగా ఉండి, వైద్యులని సంప్రదించలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లోనే ఇలా చేస్తే నొప్పిని నివారించవచ్చు.
స్ట్రెచ్: కండరాలు, స్నాయువులు సాగదీయడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు. వాటిని సాగదీసినప్పుడు కండరాల్లో ఉద్రిక్తత తగ్గుతుంది. ముందుకు వంగి కాలి వేళ్ళని తాకడం వంటి భంగిమల్లో కొద్ది సేపు ఉండటం వల్ల నొప్పి తగ్గే అవకాశం ఉంది.
మసాజ్: నొప్పితో ఎక్కువగా బాధగా అనిపిస్తే కొద్దిగా ఆ ప్రాంతంలో మందు రాసుకుని మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి తగ్గించడానికి వివిధ రకాల బ్యాక్ మసాజ్ లు కూడా ఉన్నాయి.
వేడి లేదా చల్లని నీటితో ప్యాక్: నొప్పి తీవ్రంగా అనిపిస్తే వేడి లేదా చల్లని నీటితో తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి లేదా చల్లటిది తగలడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. దీని వల్ల నొప్పి తగ్గుతుంది. ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం, వేడి నీటితో కాపడం పెట్టడం వంటివి చేసుకోవచ్చు.
హీల్స్ మార్చుకోవాలి: ఒక్కోసారి హై హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్ను నొప్పి వేధిస్తుంది. సౌకర్యవంతంగా లేని బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల వెన్నుపూస మీద ఒత్తిడి పడుతుంది. అందుకే ఎత్తు కాలి మడమలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తారు. అంగుళం కంటే ఎత్తు ఎక్కువ ఉన్న చెప్పులు వినియోగించకపోవడమే ఉత్తమం.
నడక: పని ఒత్తిడిలో పడి కదలకుండా కుర్చీకే పరిమితం అవడం వల్ల కూడా నొప్పి వస్తుంది. అందుకే కనీసం అరగంటకి ఒకసారైన లేచి అటు ఇటు కొద్ది సేపు నడవాలి. పడుకునే విధానంలో కూడా మార్పులు చేసుకోవాలి.
బరువులు ఎత్తేటప్పుడు: అధిక బరువులు ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా బరువు ఎత్తడం వల్ల వెన్ను మీద ఒత్తిడి పడుతుంది. దీని వల్ల నొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకే బరువులు ఎత్తే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధూమపానం చెయ్యరాదు: ధూమపానం చేస్తే వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి. పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ వెన్నెముకలోని ఎముకలని బలహీనపరుస్తుంది. అందుకే ఈ అలవాటు ఉంటే తప్పనిసరిగా మానుకోవాలి.
దీర్ఘకాలికంగా వెన్నునొప్పి వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని రకాల నడుము నొప్పులు క్యాన్సర్ కి కారణం కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకే తగిన పరీక్షలు చేయించి నివారణ చర్యలు తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: Diabetes: మందులు వాడకుండా మధుమేహాన్ని తిప్పికొట్టగలమా?
Also read: బ్రేకప్ అయ్యాక మానసికంగా కుంగిపోయారా? ఇలా బయటపడండి