Tirupati Vada : తిరుపతి వడలను ఇంట్లోనే ఇలా చేసేయండి.. రెసిపీ చాలా ఈజీ
Tirupati Vada Recipe : తిరుపతి లడ్డూతో పాటు.. అక్కడ చేసే వడకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మీకు కూడా తిరుపతి వడ ఇష్టమైతే.. ఈ రెసిపీ మీకోసమే.
Tirupati Prasadam : వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు తమ జీవితంలో ఓసారైనా తిరుపతి వెళ్తారు. మంచి దర్శనం చేసుకుని.. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, వడలు కోసం క్యూ కడతారు. మీరు లడ్డూతో పాటు వడలకు కూడా ఫ్యాన్ అయితే ఇక్కడ మీకోసం రెసిపీ ఎదురు చూస్తోంది. దీనిని మీరు నైవేద్యంగా చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో స్పెషల్ తినేందుకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ తిరుపతి వడను ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - ఒకటిన్నర కప్పు (పొట్టు తీయనిది)
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
నల్లమిరియాలు - ఒకటిన్నర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - తగినంత
డీప్ ఫ్రై కోసం - నెయ్యి
తయారీ విధానం
ముందుగా మినపప్పును కొన్నిసార్లు నీటితో శుభ్రం చేసి.. దానిలో పప్పు మునిగే వరకు నీటిని ఉంచి 5 గంటలు నానబెట్టండి. అనంతరం వాటిని పొట్టు పోనియకుండా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ గిన్నే తీసుకుని దానిలో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి పొడి చేయండి. దానిలోనే పొట్టుతో కూడిన మినపప్పు వేసి నీరు లేకుండా మిక్సీ చేయండి. చివర్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీటిని చిలకరించి.. ముతక పేస్ట్గా మిక్సీ చేయండి. అప్పుడు పిండి కాస్త జిగటగా మారుతుంది.
వడ తయారీ కోసం ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో నెయ్యి వేసి.. అది వేడి అవుతున్న సమయంలో ఓ అరటి ఆకు లేదా నూనె రాసిన ఓ ప్లేట్ తీసుకోండి. పిండి నుంచి కాస్త మిశ్రమం తీసుకుని.. వడ రూపంలో ఒత్తుకోండి. ఈ సమయంలో మీ చేతులకు కాస్త నీరు అద్దుకుంటే మంచిది. లేదంటే పిండి మీ చేతులకు అంటుకుపోయి.. వడ సరిగ్గా రాదు. చేతులకు నీరు ఉంటే వడ సులువుగా వదిలిపోతుంది. వడ చాలా సన్నగా ఉండేలా చూసుకోండి. లేదంటే అవి బాగా ఉడకవు.
కాగుతున్న నెయ్యిలో ఈ వడలను వేసి ఫ్రై చేయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు ఫ్రై చేయండి. మీడియం మంట మీద బంగారు రంగు వచ్చేలా రెండు వైపులా వేయించుకోండి. వడలు ఉబ్బితే గరిటెతో నొక్కండి. అవి ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అంతే వేడి వేడి తిరుపతి వడ సిద్ధమైపోయింది. వీటిని మీరు ప్రసాదంగానే కాకుండా.. పిల్లలకు పోషకాహారంగా కూడా అందిచవచ్చు. ఎందుకంటే దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తాము కాబట్టి ఇవి ఫ్రైడ్ ఫుడ్స్ కంటే చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని మీరు నేరుగా తినేయొచ్చు. లేదంటే పల్లీ చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో కలిపి తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం పండుగల సమయంలోనే కాకుండా.. టేస్టీ, హెల్తీ ఫుడ్ తినాలనుకున్నప్పుడు మీరు వీటిని తయారు చేసుకోవచ్చు.
Also Read : పిల్లలు ఇష్టంగా తినే తియ్యని పొంగనాలు.. అరటిపండుతో హెల్తీగా చేసేయండిలా