Choking: పొలమారితే ‘ఎవరో తలచుకోవడం’ కాదు, గొంతులో జరిగేది ఇది
పొలమారడం అనేది పొరపాటున జరిగే ఓ ప్రక్రియ. ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది.
పాలో, నీళ్లో తాగుతున్నప్పుడు, ఏదైనా కారంది తింటున్నప్పుడు ఒక్కోసారి పొలమారుతుంటాం. అలా పొలమారగానే ‘ఎవరో నిన్ను తలచుకుంటున్నారు’ అంటారు చాలా మంది. పొలమారడానికి, ఎక్కడో ఉన్న వారు తలచుకోవడానికి ఏమీ సంబంధం లేదు. ఆహారం తినే, తాగే ప్రక్రియలో జరిగే చిన్న పొరపాటు వల్ల పొలమారడం అనేది సంభవిస్తుంది. కాకపోతే పాత కాలం నమ్మకాలు ఇంకా కొన్ని మనుగడలోనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి.
ఇలా జరగడం వల్లే...
ఆహారం తీసుకుంటున్నప్పుడు అది నోటి నుంచి ఆహార వాహిక గుండా లోపలికి వెళుతుంది. దీని పక్కన శ్వాసకోశ నాళం కూడా ఉంటుంది. ఈ నాళం తాలూకు కవాటం మూస్తూ తెరుస్తూ ఉంటుంది. దీని ద్వారానే మనం ముక్కు ద్వారా పీల్చే గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఆ కవాటం తెరుచుకుని ఉన్న సమయంలో చాలా తక్కువ మొత్తంలో నీళ్లు లేదా మెతుకులు వంటివి అందులోకి వెళ్లిపోతుంటాయి. అలాంటప్పుడు దగ్గు విపరీతంగా వచ్చి, ఊపిరి కూడా కష్టమవుతుంది. దీన్నే పొలమారడం అంటారు. చాలా మంది పొలమారినప్పుడు తల మీద కొడతారు. ఇలా కొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాసేపటి తరువాత ఆ రూటు క్లియర్ అవుతుంది.
పిల్లలకు అయితే...
చిన్నపిల్లల్లో పొలమారడం అధికంగా జరుగుతుంది. వారిది శ్వాసకోశనాళం మరీ సన్నగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఊపిరాడక చాలా ఇబ్బంది పడిపోతారు. అలాంటప్పుడు వారిని తలకిందులుగా చేసి మెడ కింది భాగం, వీపుకు పై రెండు మూడు సార్లు గట్టిగా తట్టాలి. ఇలా చేస్తే శ్వాసకోశ నాళంలో ఇరుక్కున్న పదార్థం బయటకు వస్తుంది. ఇదే పెద్దవారిలో జరిగినప్పుడు, పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు ముందుకు వంగమని చెప్పాలి. తలను కిందకి వంచమనాలి. రెండు భుజాల మధ్య ఉన్న వీపు భాగంపై తట్టాలి.
పొలమారడం ఒక్కోసారి ఊపిరికి అడ్డుపడి ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి తినేటప్పుడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. తినేటప్పుడు అధికంగా మాట్లాడడం, నవ్వడం వంటివి చేయకూడదు.
2. ఆహారాన్ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి.
3. ఆహారాన్ని వేగంగా తినడం, మింగడం వంటివి చేయకూడదు.
4. ముఖ్యంగా మసాలాలు, కారం అధికంగా వేసిన ఆహారాన్ని తినడం తగ్గించాలి.
5. పిల్లలకు ఆహారాన్ని తినిపించేటప్పుడు చిన్న చిన్న ముద్దలు పెట్టాలి. కొందరు నోట్లో కుక్కేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం.
Also read: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Also read: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది