Oats Recipe: మధుమేహులకు రవ్వ ఇడ్లీ కన్నా ఈ ఓట్స్ ఇడ్లీ ఉత్తమం
డయాబెటిక్ ఉన్న వారు ఏది పడితే అది తినకూడదు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓట్స్‌కు మనదేశంలో మంచి ఆదరణ ఉంది. వీటిలో పోషక విలువలు అధికం. ముఖ్యంగా మధుమేహురోగులకు ఇవి చాలా మంచివి. సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే వీటి ధర కాస్త అధికమనే చెప్పాలి. అయినా వీటి వాడకం మామూలుగా లేదు. ఓట్ మీల్ పేరుతో రోజూ వీటిని తినే వాళ్లు ఉన్నారు. అయితే ఎప్పుడు ఒకేలా ఓట్స్ తింటుంటే బోరుకొడుతుంది. టేస్టీ ఇడ్లీలుగా చేసుకుంటే రుచికి బావుంటుంది, ఆరోగ్యం కూడా దక్కుతుంది. వీటిలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. ఇందులో బీటా గ్లూకెన్ అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఓట్స్ ఉత్తమమైన ఆహారం. ఓట్స్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఓట్స్ తో చేసే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీ. దాని తయారీ కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - రెండు కప్పులు
పుల్లని పెరుగు - రెండు కప్పులు
మిపపప్పు - ఒక టేబుల్ స్పూన్
శెనగపప్పు - అర స్పూను
ఆవాలు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
నూన - అర స్పూను
కొత్తిమీర తురుము - ఒక స్పూను
క్యారెట్ తురుము - రెండు స్పూనులు
పసుపు - చిటికెడు
ఉఫ్పు - రుచికి తగినంత
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఓట్స్ వేసి రంగు మారే వరకు వేయించాలి. మాడిపోకుండా చూసుకోవాలి.
2. ఆ ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
3. మళ్లీ కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. ముందుగా ఆవాలు వేయించాలి. అవి చిటపడలాడాక శెనగపప్పు, మినప పప్పు వేయించాలి.
4. తరువాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పసుపు వేసి వేయించాలి.
5. వేయించినవన్నీ ఓట్స్ పొడిలో వేసి బాగా కలపాలి.
6. ఓట్స్ మిశ్రమంలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇడ్లీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి ఓట్స్ మిశ్రమం వేయాలి.
8. పావుగంటకు ఇడ్లీలు రెడీ అయిపోతాయి. వీటిని కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Also read: ప్రపంచంలో ఎయిడ్స్ నయమైన తొలి మహిళ, ఇప్పటికి ముగ్గురిలో జరిగిందిలా
Also read: సముద్రపు చేపలంటే ఇష్టమా? వాటిలో దాక్కున్న అయిదు ప్రమాదాలు ఇవిగో