Breakthrough: ప్రపంచంలో ఎయిడ్స్ నయమైన తొలి మహిళ, ఇప్పటికి ముగ్గురిలో జరిగిందిలా
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే వార్త ఇది. హెచ్ ఐవీ పూర్తిగా నయమైన మూడో వ్యక్తిగా ఒక మహిళ చరిత్రలో నిలిచింది.
హెచ్ఐవీ సోకిన తరువాత జీవితం మీద ఆశ వదిలేసుకుంటారు చాలామంది. కారణం ఆ రోగానికి ఇంతవరకు చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం.కానీ ఇప్పుడు ఆశలు చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ మహిళకు క్యాన్సర్ చికిత్సలో భాగంగా స్టెమ్‌సెల్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆమెకు అప్పటికే హెచ్ఐవీ కూడా ఉంది. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌ను చంపే శక్తి గల దాత నుంచి స్టెమ్‌సెల్స్‌ను సేకరించారు. మహిళ ఎముకమజ్జలో ఆ స్టెమ్‌సెల్స్ ను అమర్చారు. ఆ తరువాత అద్భుతం జరిగింది. కొన్ని రోజులకు ఆమెకు ఉన్న ఎయిడ్స్ వ్యాధి కూడా నయమైంది. ఇలా ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నయమైన మొదటి మహిళ ఈమె (పేరు గోప్యంగా ఉంచారు). ఇంతకు ముందు ఇద్దరు పురుషులకు ఎయిడ్స్‌కు కారణమైన వైరస్ పూర్తిగా నశించింది. వారిద్దరి తరువాత ఈ మహిళలోనే మళ్లీ అలా జరిగింది. దీంతో హెచ్ఐవీకి కూడా త్వరలో చికిత్స వచ్చే అవకాశం కనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ కేసును ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పెద్ద అధ్యయనం ఇది.
ఈ అధ్యయనంలో భాగంగా క్యాన్సర్, హెచ్ ఐవీతో బాధపడుతున్న 25 మంది రోగులను ఎంపిక చేశారు. వారికి క్యాన్సర్ రోగనిరోధక కణాలను చంపడానికి కీమోథెరపీ నిర్వహించారు. వైద్యులు వీరిలో స్టెమ్‌సెల్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం జెనెటిక్ మ్యుటేషన్ అధికంగా ఉన్న దాతల నుంచి మూల కణాలను సేకరించి మార్పిడి చేశారు.ఈ రోగుల్లో హెచ్ఐవీ వైరస్ అడ్డుకునే రోగనిరోధక శక్తి కూడా అభివృద్ధి చెందింది. ఒక మహిళలో పూర్తిగా ఎయిడ్స్ నయం అయ్యింది.
సాధ్యం కాదు...
ప్రస్తుతం హెచ్ఐవీతో బాధపడుతున్న రోగులు చాలా మంది ఉన్నారు. అలాగని వారందరికీ ఎముక మజ్జ మార్పిడి చేయాలని మాత్రం తాము చెప్పడం లేదని అంటున్నారు పరిశోధకులు. అది సాధ్యం కాని పని అంటున్నారు. అయితే ఈ అధ్యయనం వల్ల హెచ్ఐవీకి కూడా చికిత్స కనిపెట్టగలమన్న భరోసా మాత్రం వచ్చిందని చెబుతున్నారు. భవిష్యత్తులో అన్ని రోగాల్లానే ఎయిడ్స్ కు చికిత్స, ప్రత్యేకమైన మందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: సముద్రపు చేపలంటే ఇష్టమా? వాటిలో దాక్కున్న అయిదు ప్రమాదాలు ఇవిగో
Also Read: కష్టానికి దక్కిన బహుమతి, తన ఉద్యోగికి బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చిన యజమాని